Begin typing your search above and press return to search.

సామాన్యురాలిని పక్కన కూర్చోబెట్టుకున్నమోడీ

By:  Tupaki Desk   |   6 Sep 2015 10:01 AM GMT
సామాన్యురాలిని పక్కన కూర్చోబెట్టుకున్నమోడీ
X
ప్రపంచానికే పెద్దన్న మాదిరి వ్యవహరించే అమెరికాకు అధినేత లాంటి వ్యక్తి.. ఖాళీ సమయాల్లో చేపలు పట్టటం.. తన చుట్టూ ఉన్న సామాన్యులతో మమేకం కావటం.. చిన్నారులకు పాఠాలు చెప్పటం లాంటివి చాలానే చేస్తుంటారు. డాబుసరిగా.. దర్పం ఉట్టిపడేలా.. వీవీఐపీ చట్రంలో ఉండిపోయే భారత ప్రధాని లాంటి వారిని చూసినప్పుడు.. అమెరికా అధ్యక్షుడి మాదిరి స్వేచ్ఛగా.. సామాన్యలతో మమేకం అయ్యే నాయకులు ఎప్పుటికి వస్తారన్న కొరత తీరేస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ.

తాజాగా బాదర్ పూర్.. ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన వ్యవహరించిన తీరు పలువుర్ని ఆకట్టుకుంది. ఢిల్లీ నుంచి ఫరీదాబాద్ కు హెలికాఫ్టర్ లో వెళ్లాల్సి ఉన్నప్పటికీ.. దాన్ని వదిలేసి.. మెట్రో రైలులో ప్రధాని ప్రయాణించటం పలువుర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. జనపథ్ వద్ద మెట్రో ఎక్కిన మోడీ.. ఫరీదాబాద్ వరకూ మెట్రోలోనే ప్రయాణించారు.

అంతేకాదు..ఫరీదాబాద్ లో మైట్రో రైలును ప్రారంభించిన తర్వాత ఆయన సామాన్యులతో మమేకం అయిపోవటం.. పలువుర్ని విస్మయానికి గురి చేసింది. రైలు లోపలకు వెళ్లిన ఆయనకు.. అప్పటికే రైల్లో కూర్చున్న ప్రయాణికులతో మాట్లాడారు. అంతేకాదు.. తన పక్కన కొందరు సామాన్యుల్ని కూర్చోబెట్టుకొని క్షేమ సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు.

అంతేకాదు.. ఒక తన పక్కనున్న ఒక మహిళా టెక్కీతో మాట్లాడిన మోడీ.. ఎలా ఉన్నారు? ఎక్కడ పని చేస్తున్నారు? ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు? లాంటి ప్రశ్నల్ని వేశారు. ఒక చిన్నారిని చేతుల్లోకి తీసుకున్న ఆయన.. ఆ పాపాయితో కాసేపు ఆడుకున్న పరిస్థితి. ఏది ఏమైనా సామాన్యులతో ఇట్టే కలిసిపోయి.. తానూ ఒక సామాన్యుడినేనన్నట్లుగా వ్యవహరించిన తీరు అందరిని ఆకట్టుకుంది.