Begin typing your search above and press return to search.

మోడీ వర్చువల్ . కరోనాపై కీలక యోచన

By:  Tupaki Desk   |   22 Nov 2020 8:32 AM GMT
మోడీ వర్చువల్ . కరోనాపై కీలక యోచన
X
జీ20 సదస్సులో ప్రధాని నరేంద్రమోడీ కీలక ప్రసంగం చేశారు. ఈ ఏడాది సదస్సుకు సౌదీ అరేబియా ఆతిథ్యం ఇస్తుండగా.. ఆ దేశ పాలకుల ఆహ్వానం మేరకు మోడీ వర్చువల్ విధానంలో పాల్గొని కీలక ప్రసంగం చేశారు. జీ20 నిర్వహిస్తున్న తొలి అరబ్ దేశంగా సౌదీ రికార్డులకు ఎక్కింది.

‘21వ శతాబ్ధంలో అందరికీ సమాన అవకాశాలు’ అనే థీమ్ తో ఈ ఏడాది సదస్సు నిర్వహించారు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత భూగోళం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు కరోనా వైరస్ అని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. మానవ చరిత్రను మలుపు తిప్పే ఘటన కరోనా విలయం అని.. కరోనా అనంతరం కాలంలో కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్లాలని ఉంటుందని.. ఆర్థిక వ్యవస్థల పునరుద్ధరణ, ఉద్యోగాలు, వాణిజ్య పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి మాత్రమే పరిమితమైపోకుండా మానవాళి భవిష్యత్తును సంరక్షించుకోవడంపై ప్రపంచ దేశాలన్నీ దృష్టి సారించాలన్నారు. తన ప్రసంగంలో మోడీ నాలుగు కీలక ప్రతిపాదనలు చేశారు.

కరోనా విలయకాలంలో అన్నింటికంటే ముందుగా పని విధానంలో మార్పులొచ్చాయని.. ఎక్కడి నుంచైనా పనిచేయడం ఇప్పుడు సాధారణ వ్యవహారంగా తయారైందని మోడీ అన్నారు. ఇక అంతర్జాతీయ సమావేశాలు కూడా వర్చువల్ గానే నిర్వహించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు.

‘జీ20 వర్చువల్‌ సెక్రటేరియట్‌'ను ఏర్పాటు చేయాలని మోడీ ప్రతిపాదించారు. అదేసమయంలో నాలుగు అంశాలపై ప్రపంచం దృష్టి సారించాలని చెప్పారు. నైపుణ్యాలను భారీగా సృష్టించడం, సమాజంలోని అన్ని వర్గాల వారికి సాంకేతికత చేరేలా చూడటం, ప్రభుత్వ విధానాల్లో పాదర్శకత, పర్యావరణ పరిరక్షణ వంటి వాటిని అనుసరించాలని అన్నారు. కొత్త ప్రపంచ నిర్మాణానికి ఈ జీ20 సదస్సు పునాది కావాలని ఆకాంక్షించారు