Begin typing your search above and press return to search.

మసీదు సందర్శించారుగా?

By:  Tupaki Desk   |   17 Aug 2015 4:49 AM GMT
మసీదు సందర్శించారుగా?
X
ఎవరి నమ్మకాలు వారివి. కొందరి తృఫ్తి కోసం తనకు తాను మోసం చేసుకొని.. ఎదుటివారిని మోసం చేసే వారు కొందరైతే.. మరికొందరు మాత్రం తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. ఈ క్రమంలో వెల్లువెత్తే విమర్శల్ని పెద్దగా పట్టించుకోరు. ప్రధానమంత్రి మోడీ కూడా రెండో పక్షానికి చెందిన వారు. ఎవరో మనసుల్ని దోచుకోవాలన్న ఉద్దేశ్యంతో తాను నమ్మని దాని గురించి..నమ్మినట్లుగా ఆయన వ్యవహరించరు.

నిజానికి రాజకీయ నాయకులు ఇలాంటి విషయాల్లో అందరి మనసుల్ని దోచుకోవటానికే ప్రాధాన్యం ఇస్తారే తప్పించి.. తమ మనసు చెప్పినట్లుగా ఉండరు. ఆ మధ్య ఒక కార్యక్రమానికి హాజరైన సందర్భంగా ముస్లింలు ధరించే టోపీని పెట్టబోతుంటే.. మోడీ సున్నితంగా వారించి.. వద్దన్నారు. దీనికి కొందరు అభ్యంతరం వ్యక్తం చేసి.. మోడీలోని కరుడుగట్టిన మతవాదిని చూపించే ప్రయత్నం చేశారు.

కానీ.. అదే సమయంలో.. దేశంలోని ఇతర వర్గాలకు చెందిన నేతలు హిందుమతాన్ని.. మత ధర్మానికి ప్రతీకలైన వాటిని అనుసరించకున్నా ఎవరూ దాని గురించి ప్రస్తావించరు. అదేమంటే.. మైనార్టీలకు సంబంధించిన అంశాల్ని మెజార్టీలు అనుసరించాలేకానీ.. మెజార్టీలకు సంబంధించిన వాటి గురించి మైనార్టీ నేతలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నట్లుగా మాట్లాడుతుంటారు.

మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో.. మా ఇంటికి మీ ఇల్లు అంతే దూరమన్న మాటను మాత్రం వారు అస్సలు పట్టించుకోరు. కానీ.. జనం కోసం.. వారు రాల్చే ఓట్ల కోసం మోడీ తన ధర్మాన్ని.. తన ఇష్టాయిష్టాల్ని గుట్టుగా దాచేసి.. కొందరి కోసం నటించలేదు. తాజాగా ఆయన యూఏఈ దేశాల్లోపర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన చారిత్రత్మాకమైన మసీదును సందర్శించారు. మక్కా.. మదీనాల తర్వాత ప్రపంచంలోనే మూడో అతి పెద్దదైన చారిత్రక షేక్ జాయేద్ గ్రాండ్ మసీదును ఆయన సందర్శించారు. 1.8లక్షల చదరపు అడుగుల్లో విస్తరించిన మసీదును అద్భుత ప్రార్థనాలయంగా.. మానవ విజయాలకు ఇదో ఉదాహరణగా మోడీ కీర్తించారు.

ముస్లింలు అందించిన టోపీ పెట్టకోకుండా ఉండటాన్ని భూతద్దంలో చూసిన వారు.. ఇప్పుడు మసీదు సందర్శించటంపై ఏమంటారు? తనకు నచ్చినట్లుగా ఉండే స్వేచ్ఛ ప్రతిఒక్కరికి ఉంటుంది. కానీ.. ప్రతి చర్యకు తప్పులు వెతికే కన్నా.. ఆ వ్యక్తి నిజంగా తప్పులు చేసినప్పుడు నిలదీయటం మంచిది. టోపీ పెట్టుకోకపోవటాన్ని ముస్లిం మతధర్మం పట్ల మోడీకి ఉన్న వ్యతిరేకతను చూసిన వారికి.. తాజా మసీదు పర్యటనతో ముస్లింలకు ఆయన అనుకూలమని చెప్పేస్తారా? ఇక్కడ చెప్పేదేమంటే.. ఒకట్రెండు ఉదాహరణలతో ఒక వ్యక్తి ఫలానా అని ముద్ర వేసే బదులు.. కొంత సమయం గడువు ఇస్తే మంచిది. మరి.. ఈ విషయాన్ని బురద జల్లే సూడో లౌకికవేత్తలు అర్థం చేసుకుంటే బాగుంటుంది.