Begin typing your search above and press return to search.

మోదీజీ..జ‌ర్న‌లిజంపై క‌త్తి అంత వీజీ కాదండీ!

By:  Tupaki Desk   |   3 April 2018 9:54 AM GMT
మోదీజీ..జ‌ర్న‌లిజంపై క‌త్తి అంత వీజీ కాదండీ!
X
కేంద్రంలో సంపూర్ణ మెజారిటీతోనే ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన మోదీ... తాను ఏం చేసినా చెల్లిపోతుంద‌ని భావిస్తున్న‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగిన విష‌యం తెలిసిందే. ఇదే భావ‌న‌తో ముందుకు సాగుతున్న బీజేపీ స‌ర్కారు... చాలా అంశాల‌పై ఇత‌ర పార్టీల ఆందోళ‌న‌లు, ప్ర‌జ‌ల మ‌నోభావాల‌తో సంబంధం లేకుండా... అస‌లు నిర‌స‌న‌ల‌ను ప‌ట్టించుకోకుండానే దూసుకెళుతోంది. అయితే ఇటీవ‌లి కాలంలో బీజేపీ గ్రాఫ్ తో పాటుగా ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ గ్రాఫ్ కూడా ఒక్క‌సారిగా ప‌డిపోతున్న వైనంతో క‌మ‌ల‌నాథుల్లో అంత‌ర్మ‌థ‌నం మొద‌లైంద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు నిద‌ర్శ‌నంగానే కాసేప‌టి క్రితం మోదీ స‌ర్కారు ఓ కీల‌క విష‌యంలో యూట‌ర్న్ తీసుకుందన్న వాద‌న వినిపిస్తోంది. అదేంట‌న్న విష‌యానికి వ‌స్తే... నకిలీ వార్తలు ప్రచురిస్తే జర్నలిస్టులపై క‌త్తి దూయాల‌ని, అందులో భాగంగా స‌ద‌రు జ‌ర్న‌లిస్టుల‌కు జారీ చేసిన‌ అక్రిడేషన్‌ను రద్దు చేస్తామని గత రాత్రి కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసిన సంగతి తెలిసిందే.

పెద్ద నోట్ల ర‌ద్దు, జీఎస్టీ వంటి కీల‌క అంశాల్లో త‌న‌కు ఎదురే లేద‌న్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించిన మోదీ స‌ర్కారు... జ‌ర్న‌లిస్టుల విష‌యంలోనూ త‌న‌కు తిరుగు ఉండ‌ద‌ని భావించిన‌ట్లుగా క‌నిపించింది. అయితే అదేమీ అంత ఈజీ విష‌యం కాద‌ని బీజేపీ స‌ర్కారు తెల్లారే స‌రికంతా తేట‌తెల్ల‌మైపోయింద‌న్న వాద‌న వినిపిస్తోంది. జ‌ర్న‌లిస్టుల‌పై ఆంక్ష‌లు విధించాల‌న్న విష‌యంలో నేటి ఉద‌యం నుంచి దేశ‌వ్యాప్తంగా వివిధ ఛానెళ్లు - పత్రికల ఎడిటర్ల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. జర్నలిస్టు సంఘాల నుంచి పెద్ద ఎత్తున్న నిరసనలు ఎదురయ్యాయి. దీనికి తోడు ఈ నిర్ణయం పత్రికా స్వేచ్ఛను హరించటమేనంటూ విపక్షాలు రంగంలోకి దిగాయి. దీంతో ప‌రిస్థితి ఒక్క‌సారిగా చేజారిపోతోంద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన మోదీ స‌ర్కారు ప‌రిస్థితిని చ‌ల్లార్చేందుకు రంగంలోకి దిగ‌క త‌ప్ప‌లేదు.

ఈ క్ర‌మంలో ఆ ఉత్తర్వుల్లో ఏవైనా మార్పులు సూచించాలంటూ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ నేటి ఉదయం స్వ‌యంగా ట్వీట్‌ చేశారు. అయినా కూడా జ‌ర్న‌లిస్టుల వైపు నుంచి ఏమాత్రం ఆందోళనలు చల్లారకపోగా... అంత‌కంత‌కూ మ‌రింత ఎక్కువ‌య్యాయి. దీంతో నిన్న రాత్రి తీసుకున్న‌ నిర్ణయాన్ని పూర్తిగా వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రధాని కార్యాలయం ప్రకటించక త‌ప్ప‌లేదు.. ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాతో చర్చించిన తర్వాతే ఈ మేరకు ఓ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర సమాచార శాఖకు ప్రధాని మోదీ సూచించినట్లు తెలుస్తోంది. మొత్తంగా జ‌ర్న‌లిజంపై క‌త్తి దూయాల‌న్న త‌న నిర్ణ‌యం త‌న మెడ‌కే చుట్టుకుంటుంద‌న్న విష‌యాన్ని గ్ర‌హించిన మోదీ... న‌ష్ట నివార‌ణ చ‌ర్య‌ల్లో భాగంగా నిన్న రాత్రి విడుద‌ల చేసిన ఉత్త‌ర్వుల‌ను కేవ‌లం కొన్ని గంటల వ్య‌వ‌ధిలోనే ఉప‌సంహ‌రించుకునేందుకు తీర్మానించేసిన‌ట్లుగా విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి.