Begin typing your search above and press return to search.

టీకాల విషయంలో బయటపడిన మోడి డొల్లతనం

By:  Tupaki Desk   |   9 May 2021 3:35 AM GMT
టీకాల విషయంలో బయటపడిన మోడి డొల్లతనం
X
కరోనా వైరస్ తీవ్రత కారణంగా యావత్ దేశం అల్లాడిపోతున్న సమయంలో కేంద్రప్రభుత్వ డొల్లతనం బయటపడింది. కోవిడ్ టీకా కోసం రు. 35 వేల కోట్లు కేటాయించినట్లు పోయిన ఏడాది బడ్జెట్ సమయంలో ఆర్ధికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ చాలా ఆర్భాటంగా చేసిన ప్రకటన అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఆరోగ్యశాఖ బడ్జెట్ ను రు. 94 వేల కోట్లనుండి 2.23 లక్షల కోట్లకు పెంచినట్లు ప్రకటించారు. టీకాల కోసం అవసరమైతే మరిన్ని నిధులు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

సీన్ కట్ చేస్తే తాజాగా వెల్లడైన వివరాల ప్రకారం కరోనా టీకాల కోసం కేంద్రం ఇప్పటివరకు చేసిన ఖర్చు కేవలం రు. 4744 కోట్లు మాత్రమే. అవును లక్షరాల కేవలం 4474 కోట్లు మాత్రమే. కేటాయింపులేమో 35 వేల కోట్లు, చేసిన ఖర్చేమో 4474 కోట్లు. అంటే కేటాయింపులు మాత్రమే ఘనంగా ఉంది. చేసిన ఖర్చు మాత్రం చాలా చాలా తక్కువని అర్ధమైపోతోంది. ఇపుడు చేసిన ఖర్చులో అధికభాగం టీకాలు ఉత్పత్తిచేస్తున్న రెండు ఫార్మాకంపెనీలకు అడ్వాన్సులు ఇవ్వటానికే.

ప్రస్తుత, మే నెలతో పాటు జూన్, జూలై నెలల్లో చేయాల్సిన సరఫరా కోసం కేంద్రం రెండు ఫార్మాకంపెనీలకు 16 కోట్ల డోసులకు అడ్వాన్సు చెల్లించింది. నిజానికి ఈ 16 కోట్ల డోసులు ఏమాత్రం సరిపోవు. నెలకు కనీసం 30 కోట్ల డోసులుంటేగాని జనాలకు టీకాలు వేయటం సాధ్యంకాదట. అలాంటపుడు అడ్వాన్సులతో పాటు ఇచ్చిన ఆర్డర్లే 16 కోట్లంటే ఇక అందరికీ టీకాలు వేయటం ఏ విధంగా సాధ్యం ? తాజాగా వెల్లడైన లెక్కల ప్రకారం చూస్తే వచ్చే జూలైవరకు టీకాల కొరత తప్పదని అర్ధమైపోతోంది.

ఇక్కడే నరేంద్రమోడి డొల్లతనం బయటపడిపోతోంది. ఒకవైపేమో దేశంలో అందరికీ టీకాలు ఇస్తామని, వేయాల్సిందే అంటు గంభీరంగా ఉపన్యాలు, ఆదేశాలిస్తున్నారు. ఇదే సమయంలో టీకాల ఉత్పత్తికి అవసరమైన ఆర్డర్లు మాత్రం కంపెనీలకు ఇవ్వటంలేదు. కేంద్రం చెల్లించిన అడ్వాన్సుల ప్రకారమే కంపెనీలు ఆర్డర్లు సరఫరా చేస్తున్నట్లుంది. దీంతో అవసరాలు చాలానే ఉన్నా అందుతున్న ఆర్డర్లు మాత్రం చాలా చాలా తక్కువగా ఉంటోంది. దీంతోనే దేశమంతా టీకాల కొరత పెరిగిపోతోంది.

టీకాల కోసమే రు. 35 వేల కోట్లు కేటాయించామని అవసరమైతే మరిన్ని నిధులు కేటాయిస్తామని ప్రకటించిన నిర్మల ముందుగానే ఎందుకు మేల్కొనలేదో ఎవరికీ అర్ధం కావటంలేదు. దేశంలో ఎంతమందికి టీకాల అవసరమో లెక్కలుగట్టి అంతమేర టీకాల ఉత్పత్తికి అడ్వాన్సులు ఎందుకు ఇవ్వలేదు. దేశంలో టీకాల అవసరం ఉంటుందని తెలిసి కూడా మోడి విదేశాలకు ఎందుకని ఎగుమతి చేసినట్లు ? ఇపుడు టీకాల కోసం యావత్ దేశం అల్లాడిపోతుంటే కేంద్రం ఏమిచేస్తున్నట్లు ? మొత్తానికి కరోనా వైరస్ సెకెండ్ వేవ్ తీవ్రతను అరికట్టడంలోనే కాదు టీకాలు వేయించటంలో కూడా కేంద్రం దారుణంగా ఫెయిలైందని తేలిపోయింది.