Begin typing your search above and press return to search.

మోడీ కేర్‌...ఎప్పటి నుంచి అంటే...

By:  Tupaki Desk   |   4 Feb 2018 4:22 AM GMT
మోడీ కేర్‌...ఎప్పటి నుంచి అంటే...
X
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ క‌ల‌ల ప్రాజెక్టుకు ముహుర్తం ఖ‌రారైంది. ప్రభుత్వం దేశంలోని 10 కోట్ల పేద కుటుంబాల కోసం ప్రకటించిన మెగా ఆరోగ్య సంరక్షణ పథకం (మోడీకేర్) వచ్చే అక్టోబర్ 2వ తేదీ నుంచి ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. ఈ పథకానికి అయ్యే వ్యయాన్ని కేంద్రం 60 శాతం - రాష్ర్టాలు 40 శాతం చొప్పున భరించాల్సి రావచ్చని స‌మాచారం. ఒక్కో కుటుంబానికి ప్రభుత్వం 1,000 నుంచి 1,200 వరకు ప్రీమియం చెల్లించనున్నట్టు అంచనా. ఈ పథకం కింద పది కోట్ల కుటుంబాలు లేదా 50 కోట్ల మంది లబ్ధిదారులకు ఏటా రూ.5 లక్షల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తారు.

2011 నాటి సామాజిక ఆర్థిక కుల గణనలో అణగారిన వర్గాలుగా గుర్తింపు పొందిన వారికి ఈ పథకం వర్తిస్తుంది. ఇది ఆధార్ అనుసంధాన సదుపాయమైనందున లబ్ధిదారులు దేశంలోని ఎంపికచేసిన ఏ ప్రైవేటు లేదా ప్రభుత్వ దవాఖానలోనైనా చికిత్స పొందవచ్చు. ఈ పథకం కోసం కేంద్ర ప్రభుత్వానికి ఏటా రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్ల వరకు ఖర్చు కాగలదని నీతి ఆయోగ్ అంచనా వేసింది. బీమా సంస్థలు తక్కువ ప్రీమియంలకు ఒప్పుకొంటాయని ఆశిస్తున్నందున ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయగలమని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకు అధికారులు రాజస్థాన్‌లో అమలవుతున్న పథకాన్ని ఉదాహరణగా సూచిస్తున్నారు. రాజస్థాన్ ప్రభుత్వం ఏటా ఒక్కో కుటుంబానికి రూ.500 చెల్లిస్తూ రూ.3.75 లక్షల వరకు వైద్య సదుపాయం కల్పిస్తోంది. కాగా వినియోగం 2.5 శాతం మాత్రమే ఉన్నది. వివిధ రాష్ర్టాలలోను - అలాగే ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న ఇటువంటి పథకాలను నీతి ఆయోగ్ అధ్యయనం చేసి జాతీయ ఆరోగ్య సంరక్షణ పథకం (ఎన్‌ హెచ్‌ పీఎస్)ను రూపొందించిందని అధికారులు పేర్కొన్నారు.

ప్రభుత్వం ప్రస్తుతం అమలు చేస్తున్న రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన (ఆర్‌ ఎస్‌ బీవై) స్థానంలోనే ఎన్‌ హెచ్‌ పీఎస్‌ ను అమలు చేయనుంది. ఆర్‌ఎస్‌బీవైని దారిద్య్ర రేఖకు దిగువనున్న (బీపీఎల్) వారికి మాత్రమే వర్తింపజేస్తుండగా, ఏటా రూ.30 వేల వరకే వైద్య సదుపాయం లభిస్తున్నది. తెలంగాణ - ఆంధ్రప్రదేశ్ - రాజస్థాన్ - కర్ణాటక - తమిళనాడు రాష్ర్టాలు సొంతంగా వైద్య బీమా పథకాలను అమలు చేస్తున్నాయి. ఈ పథకాల కింద రాష్ట్ర ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తుండగా, రూ.3 లక్షల వరకు వైద్య సదుపాయం లభిస్తున్నది. ఎన్‌ హెచ్‌ పీఎస్ అమలులోకి వచ్చిన తరువాత రాష్ర్టాలు కూడా తమ నిబంధనలను అమలు చేయాల్సి ఉంటుందని, అయితే అమలుచేసే విధానంపై వాటికి వెసులుబాటు కల్పిస్తార‌ని స‌మాచారం. రాష్ర్టాలు ఓ ప్రభుత్వరంగ బీమా సంస్థను భాగస్వామ్యంలోకి తీసుకోవచ్చు లేదా ఒక ట్రస్టును ఏర్పాటు చేయవచ్చని తెలుస్తోంది.

ఎన్‌ హెచ్‌ పీఎస్ కింద ఖరీదైన వైద్యం అందిస్తే దేశంలో పేదరికం తగ్గిపోగలదని ఆరోగ్య సేవల డైరెక్టర్ జనరల్ డాక్టర్ బీడీ అథానీ అభిప్రాయపడ్డారు. ప్రతి సంవత్సరం ఆరు నుంచి ఏడు కోట్ల మంది వైద్యపరమైన ఖర్చుల కారణంగా దారిద్య్ర రేఖ దిగువకు చేరుతున్నారని చెప్పారు. ఈ పథకం అటువంటి పరిణామాన్ని నిలువరించగలదని అన్నారు. ఈ పథకానికి నిధుల గురించి చింతించాల్సిన అవసరం లేదని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ అన్నారు. ప్రభుత్వం విద్య - వైద్యం సెస్సును ఒక శాతం పెంచేందుకు బడ్జెట్‌ లో ప్రతిపాదించినందున, ఆ రూపంలో రూ.11వేల కోట్ల వరకు ఖజానాలో చేరుతాయని చెప్పారు. రాష్ర్టాల అంగీకారాన్ని బట్టి మొదటి సంవత్సరమే 50 శాతం మందికి ఈ పథకాన్ని వర్తింపజేయవచ్చని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. ఈ పథకాన్ని ప్రారంభించేందుకు ప్రభుత్వానికి రూ.5 వేల కోట్ల నుంచి రూ.6 వేల కోట్లు చాలని చెప్పారు. ఈ పథకం కోసం తాము ఏడాదిన్నరగా కృషి చేస్తున్నామని వీకే పాల్ తెలిపారు. ఇంకా ఏమైనా లోపాలుంటే సరిచేసి అక్టోబర్ 2వ తేదీ నుంచి పథకాన్ని లబ్ధిదారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తామని చెప్పారు.