Begin typing your search above and press return to search.

బాబుతో మోడీషాల ఫ్యూచర్ డీల్ ఇదేనేట?

By:  Tupaki Desk   |   7 Sep 2022 7:35 AM GMT
బాబుతో మోడీషాల ఫ్యూచర్ డీల్ ఇదేనేట?
X
ఇంతకాలం సందేహంగా పట్టి పీడుస్తూ.. సమాధానం దొరికినంతనే.. ఆ జవాబుకు మరిన్ని ఉప ప్రశ్నలు ముంచెత్తటం లాంటి వాటికి సొల్యూషన్ తాజాగా దొరికినట్లే. ఏపీలో తన స్నేహితుడైన జగన్ తో కాకుండా టీడీపీతో బీజేపీ ఎందుకు పొత్తు పెట్టుకుంటుంది? దానికి కారణం ఏమిటి? బాబు అంటే అస్సలు ఇష్టపడని మోడీ.. 2024 ఎన్నికల నాటికి ఆయన పార్టీతో డీల్ కు ఎందుకు ఓకే చేస్తారు? లాంటి ప్రశ్నలకు తాజాగా సమాధానం దొరికే వాదన ఒకటి చేతికి వచ్చింది.

2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల్లో విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్న బీజేపీ.. అందుకు తగ్గట్లే భారీ వ్యూహాన్ని సిద్ధం చేసుకోవటం తెలిసిందే. వరుసగా రెండుసార్లు అధికారంలో ఉండి మూడోసారి ఎన్నికలకు సిద్ధమైన వేళ.. వ్యతిరేకత అంతో ఇంతో ఖాయం. దాని ప్రభావం ఎంత ఉందన్న విషయాన్ని లెక్కల్లో చూసుకున్న మోడీషాలు.. ఇప్పుడు కొత్త మిత్రపక్షాలతో ఆ కొరత తీర్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు.

బీజేపీ అగ్రనాయకత్వం అంచనాల ప్రకారం తక్కువలో తక్కువ 50 నుంచి 70 సీట్లు 2019 కంటే తక్కువ వచ్చే వీలుందని లెక్క వేస్తున్నారు. వీటిని భర్తీ చేసుకోవటానికి పార్టీ సొంతంగా బలం పెంచుకోవటం ఒక పద్దతి అయితే.. మిత్రపక్షాలతో ఆ లోటును భర్తీ చేసుకోవటం మరో పద్దతి. తాజాగా వినిపిస్తున్న దాని ప్రకారం రెండో దానికే బీజేపీ అగ్రనాయకత్వం మొగ్గు చూపుతున్నట్లుగా చెబుతున్నారు.

గతంలో తమతో జతకట్టి.. తర్వాతి కాలంలో వివిధ కారణాలతో తమ నుంచి దూరమైన మిత్రపక్షాల్ని తమ గూటికి తెచ్చుకోవాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతుున్నారు. ఇందులో భాగంగా తమిళనాడులో మిత్రపక్షంగా ఉన్న అన్నాడీఎంకే.. పీఎంకే.. మహారాష్ట్రలోని ఏక్ నాథ్ షిండే ఆధ్వర్యంలోని శివసేన.. అథావలేకు చెందిన రిపబ్లికన్ పార్టీ.. పంజాబ్ లో అమరీందర్ సింగ్ ఆధ్వర్యంలోని పంజాబ్ లోక్ కాంగ్రెస్.. బిహార్ లో లోక్ జనశక్తి.. అసోంలో అసోం గణపరిషత్.. హర్యానాలో జన నాయక్ జనతా పార్టీ.. ఉత్తరప్రదేశ్ లో అప్నాదళ్ తో పాటు ఏపీలో టీడీపీ.. జనసేనలతో కలిసి ప్రయాణిస్తారని చెబుతున్నారు.

గతంలో కటీఫ్ చెప్పిన టీడీపీతో మోడీషాలు ఎందుకు ఓకే అంటారంటే.. అక్కడే ఉంది అసలు లెక్క అని చెబుతున్నారు. ఏపీలో ఉన్న 25 సీట్లలో ఇప్పుడు అత్యధికం అధికార వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో తమతో జత కట్టమనే వీల్లేదు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత నేపథ్యంలో పాత కాంబినేషన్ అయిన జనసేన.. టీడీపీ.. బీజేపీల కాంబినేషన్ లో విజయం సాధించటం పక్కా అన్న ధీమా వ్యక్తమవుతోంది. అందుకే.. ఆ పార్టీలతో కలిసి డీల్ కుదుర్చుకుంటారని చెబుతున్నారు.

టీడీపీ.. జనసేనలకు అసెంబ్లీ స్థానాల్లో ఒప్పందం కుదుర్చుకోవాలని.. దాదాపు 18 నుంచి 20 ఎంపీ సీట్ల వరకు తమకు కేటాయించాలని.. మిగిలిన వాటిల్లో టీడీపీ.. జనసేన సర్దుకోవాలన్న ఆఫర్ చెప్పే వీలుందన్న మాట వినిపిస్తోంది. దీనికి పరిహారంగా అసెంబ్లీలో తమకు సింగిల్ డిజిట్ సీట్లు ఇచ్చినా తమకు అభ్యంతరం లేదన్న మాటను బాబుతో చెప్పే వీలుందంటున్నారు.

బాబు ఆసక్తి మొత్తం రాష్ట్రంలో అధికారంలోకి రావటం మీదనే కావటంతో ఆయనకు ఇబ్బంది ఉండదని.. అదే సమయంలో జనసేనతో పొత్తు విషయంలోనూ అసెంబ్లీ సీట్లే అధిక ప్రాధాన్యతతో ఉంటుందని చెబుతున్నారు. తమకు ఎంపీ టికెట్లు వదిలేస్తే.. అసెంబ్లీ టికెట్ల విషయంలో తాము ఎలాంటి అభ్యంతరాలు ఉండవన్న విషయాన్ని బాబుకు చెబుతారని చెబుతున్నారు. ఎంపీ సీట్లు లేకున్నా.. ఎమ్మెల్యే సీట్లు ఉండటంతో వాటితో సరిపెట్టుకోవాలన్న ఆలోచనకు బాబు మొగ్గు చూపుతారని చెబుతున్నారు. ఈ కారణంతోనే జగన్ తో కాకుండా బాబుతో మోడీషాలు పొత్తు పెట్టుకోవటానికి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. మరేం జరుగుతుందో కాలమే డిసైడ్ చేయాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.