Begin typing your search above and press return to search.

ఆఫీస‌ర్ల‌పై మండిప‌డ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే

By:  Tupaki Desk   |   7 Jan 2017 4:35 PM GMT
ఆఫీస‌ర్ల‌పై మండిప‌డ్డ అధికార పార్టీ ఎమ్మెల్యే
X
ఆంద్ర‌ప్ర‌దేశ్ ప్రభుత్వం జ‌న‌వ‌రి 2 నుంచి నిర్వహిస్తున్న జన్మభూమి - మా ఊరు కార్యక్రమం ప్రహసనంగా మారుతోందనే అభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర మంత్రులు మినహా ఎమ్మెల్యేలకు అధికారులు అంతగా ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించిన చంద్రన్న కానుక సంచులను ఎరగా వేసి ప్రజలను శాంతింపచేస్తున్నారనే విమర్శలు వినవస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇళ్లస్థలాలు - రేషన్‌ కార్డులు - గృహ నిర్మాణ పథకం - ఫించన్లకు వేలల్లో దరఖాస్తులు వెల్లువెత్తుతున్నాయి. స్థానిక సమస్యల పరిష్కారంపై అనేక గ్రామసభల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు. స్వయానా అధికార పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గం పరిధిలో జరిగే జన్మభూమి కార్యక్రమానికే అధికారులు గైర్హాజరు కావడం గమనార్హం.

గుంటూరు పశ్చిమ నియోజకవర్గం పరిధిలో 26వ డివిజన్‌ లో జరగాల్సిన జన్మభూమి కార్యక్రమానికి ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరయ్యారు. ఆయనతో పాటు పలువురు పార్టీ నేతలు తరలివచ్చారు. అయితే మునిసిపల్ అధికారులు కార్యక్రమానికి రాకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని జన్మభూమి సభలు నిర్వహిస్తుంటే అధికారులు గైర్హాజరు కావడంలోని ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ప్రజలకు జవాబుదారీ కావాల్సిన మునిసిపల్ అధికారులు రానప్పుడు సభలు నిర్వహించటం ఎందుకంటూ మోదుగుల వెనుతిరిగి వెళ్లారు. అంతేకాదు సభకు హాజరుకాని అధికారులపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీచేశారు. కాగా అధికార పార్టీ ప్రాతినిధ్యం వహించని నియోజకవర్గాల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు జన్మభూమి కార్యక్రమానికి హాజరు కాకపోవడంతో నియోజకవర్గ పార్టీ ఇన్‌ చార్జిలదే పెత్తనంగా మారింది. దీంతో ఏకపక్షంగా నిర్వహిస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

ఇదిలాఉండ‌గా... కుటుంబ సామాజిక సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించేందుకై ఏర్పాటు చేసే వేదికే జన్మభూమి అని హోం శాఖ మంత్రి - రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ప్రసంగిస్తూ దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఆనాడు ప్రజల వద్దకు పాలన ఏర్పాటు చేసి ప్రజా సమస్యలను పరిష్కరించారని, దానిని స్ఫూర్తిగా తీసుకుని నేడు చంద్రబాబు నాయుడు జన్మభూమి పేరుతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారని చిన‌రాజ‌ప్ప అన్నారు. పేద - బడుగు - బలహీన వర్గాల అభ్యున్నతితో పాటు రైతు శ్రేయస్సుకై ముఖ్యమంత్రి అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు. అందుకే పలు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని తెలిపారు. ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఆ కుటుంబంలో సభ్యులు విద్యావంతులై ఉండాలన్నారు. రైతు భూసార పరీక్షల ద్వారా అధిక లాభాలు ఆర్జించవచ్చన్నారు. అనంతరం స్వయం సహాయక సంఘాల సభ్యులకు చెక్కులు, దీపం కనెక్షన్లను అందజేశారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/