Begin typing your search above and press return to search.

వైసీపీలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే...

By:  Tupaki Desk   |   8 July 2019 6:10 AM GMT
వైసీపీలో ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యే...
X
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి నెల రోజులు అయ్యిందో లేదో అప్పుడే ఆ పార్టీ నేతల మధ్య అంతర్గత కలహాలు బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే కొన్ని జిల్లాల్లో ఎమ్మెల్యేలు వర్సెస్ మంత్రులు - మరికొన్ని చోట్ల ఎమ్మెల్యేలు వర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. కర్నూలు జిల్లాలో కర్నూలు ఎమ్మెల్యే మ‌హ్మ‌ద్‌ హ‌ఫీజ్‌ ఖాన్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌ రెడ్డి మధ్య కోల్డ్ వార్ స్టార్ట్ అయినట్టు జిల్లా రాజకీయాల్లో ప్రచారం జరుగుతోంది. 2014 ఎన్నికల్లో కర్నూలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎస్వీ మోహన్‌ రెడ్డి విజయం సాధించారు. ఆపరేషన్ ఆకర్ష్ నేపథ్యంలో ఆయన టిడిపిలోకి జంప్ చేసేశారు.

ఎన్నికలకు ముందు చంద్రబాబు మోహన్ రెడ్డికి సీటు ఇవ్వలేదు. దీంతో ఆయన తిరిగి వైసీపీ గూటికి రివ‌ర్స్ జంప్ చేసేశారు. ఎన్నికల్లో హ‌ఫీజ్‌ ఖాన్ గెలుపుకోసం ఎస్వీ మోహన్‌ రెడ్డి కష్టపడ్డారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో తనకున్న పరిచయాలను వాడి మరి హ‌ఫీజ్‌ ఖాన్ విజ‌యంలో త‌న‌దైన వ్యూహాలు ప‌న్నారు. ఎన్నిక‌ల్లో టీడీపీ అభ్య‌ర్థి టీజీ. భ‌ర‌త్‌ పై హ‌ఫీజ్‌ ఖాన్ విజ‌యం సాధించారు. తొలి ప్రయత్నంలోనే ఎమ్మెల్యేగా గెలిచిన హ‌ఫీజ్‌ ఖాన్‌ గెలిచిన నెల రోజులకే నగర బాట పట్టారు. ప్రతిరోజు రెండు వార్డుల్లో తిరుగుతూ అక్కడ ప్రజల సమస్యలను నోట్ చేసుకుని వాటిని పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు.

ఈ క్రమంలోనే నగరంలో ఉన్న సమస్యలు తెలుసుకుని వాటిని అసెంబ్లీలో ప్రస్తావిస్తా అని కూడా చెబుతున్నారు. ప్రతిరోజు న‌గ‌ర‌బాట‌తోనే ఆయ‌న‌ దినచర్య ప్రారంభమవుతుంది. అలాగే నగర సుందరీకరణపై దృష్టి పెట్టి పారిశుద్ధ్య పనులు కూడా వెంటనే చేయిస్తున్నారు. బెల్లం చుట్టూ ఈగలు అన్న చందంగా గెలుపు ఉన్న చోటే నేతలంతా వాలిపోవటం సహజం. ఈ క్రమంలోనే వైసిపి కార్యకర్తలు.. నేతల అంతా ఇప్పుడు హ‌ఫీజ్‌ ఖాన్‌ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. నిన్నటి వరకు ఎమ్మెల్యేగా జిల్లా కేంద్రంలో ప‌వ‌ర్ సెంట‌ర్‌ గా ఉన్న‌ ఎస్వీ మోహన్‌ రెడ్డి దగ్గరకు ఇప్పుడు పార్టీ నేతలు ఎవరూ రావడం లేదు. దీంతో ఎస్వీ కాస్త రాజకీయంగా డౌన్‌ అయినట్టే కనిపిస్తోంది.

ఎన్నికల్లో తాను గెలిచాక ఎస్వీ సహాయనిరాకరణ చేస్తున్నారన్న విషయం గ్రహించిన హఫీజ్ ఖాన్ నగరంపై పట్టు కోసమే నగర బాట చేస్తున్నార‌న్న టాక్ ఉంది. గెలుపు కోసం త‌న‌ను వాడుకుని.. ఇప్పుడు ఎమ్మెల్యే త‌మ నేత‌ను ప‌క్క‌న పెడుతున్నార‌ని ఎస్వీవ‌ర్గం భావిస్తోంది. హ‌ఫీజ్‌ ఖాన్ స్వతంత్రంగా వ్యవహరించడం మోహన్ రెడ్డి వర్గీయులకు నచ్చటం లేదు. ఇదే వీరిద్దరి మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది.