Begin typing your search above and press return to search.

ఎంపీ సీటు ఎందుకు.. సీఎంను చేస్తే పోలా?

By:  Tupaki Desk   |   1 Aug 2015 9:22 AM GMT
ఎంపీ సీటు ఎందుకు.. సీఎంను చేస్తే పోలా?
X
రాజకీయాలు ఎంత దిగజారి పోయాయో తాజా ఉదంతాన్ని చూస్తే అర్థమవుతుంది. 257 మంది మరణానికి కారణమైన యాకూబ్ మెమన్ కు ఉరిశిక్ష అమలు చేసిన నేపథ్యంలో.. ఆయన సతీమణి ఇప్పుడు నిస్సహాయురాలని.. ఆమెకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలంటూ సమాజ్ వాదీ పార్టీ మహారాష్ట్ర విభాగం ఉపాధ్యక్షుడు మహ్మద్ ఫరూఖ్ కోరుతున్నారు.

కేవలం మాటగానే కాదు.. ఈ మేరకు పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కు లేఖ కూడా రాశారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. యాకూబ్ మెమన్ సతీమణికి ఈ పేలుళ్ల ఉదంతంలోసంబంధం ఉందంటూ పోలీసులు అరెస్ట్ చేసి.. ఆధారాలు లేవని ఆమెను విడుదల చేశారు. తాజాగా లేఖ రాసిన నేత వ్యాఖ్యానిస్తూ.. తాను ఈ లేఖ రాయకూడదని.. ఇది సరైన సమయం కాదని తెలిసినప్పటికీ.. నిస్సహాయులకు అసరాగా నిలిచే వ్యక్తిగా.. మనం తప్పకుండా యాకూబ్ సతీమణి రహీన్ కు మద్ధతుగా నిలవాలంటూ వ్యాఖ్యానించారు.

ఆమెను కానీ రాజ్యసభకు పంపితే.. ఆపన్నుల తరఫున గళం విప్పుతుందని ఆయన వ్యాఖ్యానించాడు. నిజానికి ఇలాంటి నేతల్ని పార్టీ పదవుల్లో నియమించటమే ములాయం చేసే తప్పు. ఇంకా నయం.. రాజ్యసభకు కాకుండా.. ఉత్తరప్రదేశ్ లోని ములాయం కుమారుడు అఖిలేశ్ యాదవ్ ప్లేస్ లో ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తే..ఆమె ఆపన్నులకు మరింత సాయం చేస్తుందేమో.

ఉగ్రవాద కార్యకలాపాల ఆరోపణలు ఉండి.. జైల్లో కొంతకాలం గడిపి వచ్చిన వ్యక్తిని.. రాజ్యసభకు పంపాలంటూ డిమాండ్ చేస్తున్న తీరు చూస్తే.. రాజ్యసభ సీటు మరీ అంత తేలికైపోయిందా..?ఇలాంటి చేష్టలకు ములాయం కాస్త కఠినంగా స్పందిస్తే బాగుంటుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.