Begin typing your search above and press return to search.

మన 'స్లమ్ డాగ్'.. ఇప్పుడు మిలియనీర్

By:  Tupaki Desk   |   21 Feb 2017 2:25 PM GMT
మన స్లమ్ డాగ్.. ఇప్పుడు మిలియనీర్
X
‘మహ్మద్ సిరాజ్’ పేరు ఎప్పుడైనా విన్నారా? లేదనే చెబుతారు.కానీ.. ఇప్పుడు అతని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. కాదు.. తన ఆట తీరుతో అందరిని మాట్లాడుకునేలా చేశాడు. రంజీల్లో ఆడే ఈ హైదరాబాదీ ఆటగాడికి ఇప్పటివరకూ పడిన కష్టానికి తగిన ఫలితం దక్కింది. నిన్నమొన్నటి వరకూ భారత్ ఏ తరఫు ఆడితే చాలన్న లక్ష్యంతో ఉండే సిరాజ్ మైండ్ సెట్ ఇప్పుడు పూర్తిగా మారిపోయింది.

తనకు లభించిన సువర్ణావకాశాన్ని వినియోగించుకొని రంజీల్లో సత్తా చాటిన అతగాడు.. ఇప్పుడు ఐపీఎల్ లో తానేంటో లోకానికి తెలియజేయాలని ఉవ్విళ్లూరుతున్నాడు. నిన్నటి వరకూ సిరాజ్ అంటే ఎవరికి తెలీనివాడు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయారు. ఐపీఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ రూ.2.6 కోట్లకు సిరాజ్ ను కొనుగోలు చేయటంతో ఒక్కసారిగా వార్తల్లోకి వచ్చేసి.. హాట్ న్యూస్ గా మారిపోయాడు.

సిరాజ్ జీవితాన్ని.. అతడి క్రికెట్ ప్రయాణాన్ని చూసినప్పుడు.. సినిమాటిక్ గా ఉంటుంది. నిన్నటి వరకూ కడు పేదరికంతో ఉన్న ఈ కుటుంబ పరిస్థితి.. ఐపీఎల్ వేలం ఒక్కసారిగా పరిస్థితిని మార్చేసింది. సిరాజ్ తండ్రి ఆటో డ్రైవర్. నిత్యం ఆటోతోలుతూ.. వచ్చే డబ్బులతో కుటుంబ భారాన్ని మోస్తున్నాడు. కొడుకు ఇష్టాన్ని కాదనలేక అతడ్ని.. క్రికెటర్ గా చేయాలని తపించటమే కాదు.. ఆయన కలను సిరాజ్ కొంతమేర నెరవేర్చాడని చెప్పాలి.

తన తండ్రి కష్టాన్ని సిరాజ్ మాటల్లోనే చెప్పాలంటే.. ‘‘మా కోసం.. మా కుటుంబం కోసం మా నాన్న 30 ఏళ్లు ఆటో నడుపుతున్నాడు. ఐపీఎల్ వేలం నా జీవితంలో గొప్ప సంఘటన. నన్ను ఏదో ఒక ఫ్రాంచైజీ కొనుగోలు చేస్తుందని అనుకున్నాను కానీ.. రూ.2.6కోట్ల ధర పలుకుతానని అస్సలు అనుకోలేదు. ఐపీఎల్ ద్వారా వచ్చే డబ్బుతో.. మా నాన్నను ఆటో నడపటం మానిపిస్తా. ఇల్లు కొంటా. నాన్నతో పాటు.. నా కుటుంబాన్ని చూసుకుంటా. భారత జట్టులో స్థానం సంపాదించటమే లక్ష్యంగా ఆడతా. ఇక.. నా సత్తా చాటుతా’’ అని చెప్పుకొచ్చాడు.

వార్నర్.. యువరాజ్.. ముస్తాఫిజుర్.. భువనేశ్వర్ లతో ఆడే రోజు కోసం ఎదురుచూస్తున్నా. బెంగళూరుతో మ్యాచ్లో ఆడే అవకాశం లభించాలని తాను కోరుకుంటున్నట్లు సిరాజ్ వెల్లడించాడు. క్రిస్ గేట్.. విరాట్ కోహ్లీ.. డివిలియర్స్ లకు బౌలింగ్ చేయటానికి మించిన గొప్ప విషయం మరొకటి ఉండదన్న సిరాజ్.. తన కలల్ని నెరవేర్చుకోవాలని ఆశిద్దాం. నిండు మనసుతో.. అతడికి ఆల్ ద బెస్ట్ చెబుదాం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/