Begin typing your search above and press return to search.

ఈ బాబుపై!.. ఆ బాబు రెచ్చిపోయారే!

By:  Tupaki Desk   |   31 March 2019 4:16 AM GMT
ఈ బాబుపై!.. ఆ బాబు రెచ్చిపోయారే!
X
ఏపీలో ఎన్నిక‌లకు రంగం సిద్ధ‌మైన వేళ‌... ఇద్ద‌రు బాబుల మ‌ధ్య పోరు ర‌స‌వ‌త్త‌రంగా మారింది. ఈ ఇద్దరు బాబులు ఎవ‌రంటే... ఇక‌రేమో టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు కాగా... ఇంకో బాబేమో గ‌తంలో టీడీపీలో ఉండి, ఆ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగి, ఆ తర్వాత రాజ‌కీయాల్లో నుంచి త‌ప్పుకుని.. 20 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్ర‌ముఖ సినీ న‌టుడు మంచు మోహ‌న్ బాబు. గ‌తంలో టీడీపీ త‌ర‌ఫునే ఉన్న మోహ‌న్ బాబు... ఇప్పుడు కొత్త‌గా వైసీపీలో చేరిపోయారు. వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కుటుంబంతో బంధుత్వం నేప‌థ్యంలో ఆ పార్టీలో మోహ‌న్ బాబు చేరిక పెద్ద‌గా ఆశ్చ‌ర్యం క‌లిగించ‌కున్నా... పార్టీలో చేరిన వెంట‌నే ఏపీ ఎన్నిక‌ల ప్ర‌చారంలోకి దిగిపోయిన మోహ‌న్ బాబు... చంద్ర‌బాబు ఓట‌మి, జ‌గ‌న్ గెలుపే ల‌క్ష్యంగా సాగుతున్న వైనం మాత్రం ఆశ్చ‌ర్యం క‌లిగిస్తోంద‌నే చెప్పాలి.

ఎన్నిక‌ల ప్ర‌చారంలో భాగంగా వ‌చ్చీ రావ‌డంతోనే చంద్ర‌బాబు కుమారుడు, మంత్రి నారా లోకేశ్ బ‌రిలోకి దిగిన మంగ‌ళ‌గిరి అసెంబ్లీ నియోజక‌వర్గంలో కాలుపెట్టిన మోహ‌న్ బాబు... జ‌గ‌న్ ను గెలిపించాల‌ని ఓట‌ర్ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. ఓ మోస్త‌రు ప్ర‌చారం చేసిన ఆయ‌న ఆ త‌ర్వాత విజ‌య‌వాడ‌కు చేరుకుని ఏకంగా మీడియా స‌మావేశం పెట్టి మ‌రీ చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డారు. చంద్ర‌బాబు మోస‌గాడ‌ని, న‌య‌వంచ‌కుడ‌ని త‌న నోటికి వ‌చ్చిన ప‌దాల‌న్నింటినీ మోహ‌న్ బాబు ప్ర‌యోగించేశారు. గ‌తంలో తాను కూడా టీడీపీలోనే ఉన్నాన‌ని గుర్తు చేసిన మోహ‌న్ బాబు... పార్టీలో చంద్ర‌బాబు కంటే కూడా తానే సీనియ‌ర్‌న‌ని చెప్పుకున్నారు. అయితే పార్టీకి విధేయుడిగా తాను ఉంటే... చంద్రబాబు మాత్రం సొంత మామ అన్న ద‌య కూడా లేకుండా పార్టీని స్థాపించి అధికారం చేజిక్కించుకున్న స్వ‌ర్గీయ నంద‌మూరి తారక‌రామారావునే వెన్నుపోటు పొడిచి పార్టీతో పాటు అధికారాన్ని హ‌స్త‌గ‌తం చేసుకున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. ఎన్టీఆర్ కుమారులు అమాకుల‌ని, వారి అమాయ‌క‌త్వాన్నే ఆస‌రా చేసుకున్న చంద్ర‌బాబు... ఎన్టీఆర్‌ను ఈజీగానే మోసం చేశార‌ని ఆరోపించారు.

అయితే నాడు తాను కూడా చంద్రబాబుతోనే న‌డిచాన‌ని, ఆ త‌ర్వాత అది త‌ప్ప‌ని తెలుసుకున్నాన‌ని చెప్పుకొచ్చారు. మ‌రోమారు అలాంటి త‌ప్పు చేయొద్ద‌న్న భావ‌న‌తోనే ఇన్నాళ్లు రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నాన‌ని చెప్పిన మోహ‌న్ బాబు.. ఇప్పుడు వైసీపీలో చేరిన‌ట్లు చెప్పుకొచ్చారు. గ‌డ‌చిన ఐదేళ్ల‌లో చంద్ర‌బాబు ఏపీకి ఒర‌గ‌బెట్టిందేమీ లేద‌ని చెప్పిన మోహ‌న్ బాబు... ఈ సారి కూడా ఆయ‌న‌కు అధికారం ఇచ్చినా ఒరిగేదేమీ లేద‌న్నారు. చంద్ర‌బాబు నైజం తెలుసుకుని ఈ సారి జ‌గ‌న్‌ కు ఓటేయాల‌ని, త‌ద్వారా జ‌గ‌న్‌కు ఓ అవ‌కాశ‌మివ్వాల‌ని కూడా మోహ‌న్ బాబు పిలుపునిచ్చారు. మొత్తంగా అల్లుడి వ‌ర‌సైన జ‌గ‌న్ కోసం రంగంలోకి దిగిన మోహ‌న్ బాబు... గ‌తంలో తాను మైత్రి నెర‌పిన చంద్ర‌బాబుపై విరుచుకుప‌డ్డార‌న్న మాట‌. ఈ విరుచుకుప‌డ‌టంలోనూ మోహ‌న్ బాబు కొత్త విష‌యాలేమీ చెప్ప‌క‌పోగా... ఆయ‌న చెప్పిన‌దంతా పాత క‌థేన‌న్న వాద‌న వినిపిస్తోంది.