Begin typing your search above and press return to search.

కోర్టును తప్పు దోవ పట్టించారు.. సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం..

By:  Tupaki Desk   |   2 April 2019 10:17 AM GMT
కోర్టును తప్పు దోవ పట్టించారు.. సెషన్స్ కోర్టులో తేల్చుకుంటాం..
X
ప్ర‌ముఖ‌ న‌టుడు - నిర్మాత మంచు మోహ‌న్‌ బాబుకు చెక్ బౌన్స్ కేసులో హైద‌రాబాద్ ఎర్ర‌మంజిల్ మెట్రోపాలిటిన్ మేజిస్టేట్ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించడం సంచలనమైంది. దీనిపై మీడియాలో ప్రధానంగా కథనాలు రావడంతో ఈ కేసు వెనుకున్న అసలు నిజాలను మోహన్ బాబు మీడియాకు వివరించారు. తనకు ఏడాది జైలు శిక్ష పడడంలో వెనుకున్న అసలు కుట్రను దర్శకుడు వైవీఎస్ చౌదరి చేశాడని ఆయన మీడియా సమక్షంలో బయటపెట్టారు.

మోహ‌న్‌ బాబు మాట్లాడుతూ ‘‘2009లో `స‌లీమ్` సినిమా చేస్తున్న స‌మయంలో ఆ సినిమాకు సంబంధించిన మొత్తాన్ని ద‌ర్శ‌కుడు వైవిఎస్ చౌద‌రికి చెల్లించేశామని... మా బ్యాన‌ర్‌ లోనే మ‌రో సినిమా చేయ‌డానికి గాను రూ.40ల‌క్ష‌ల అడ్వాన్స్ చెక్ ఇచ్చామని’’ తెలిపారు. `స‌లీమ్` అనుకున్న స్థాయిలో విజ‌యం సాధించ‌క‌పోవ‌డంతో వైవీఎస్ చౌద‌రితో త‌దుప‌రి చేయాల్సిన సినిమాను రద్దు చేసుకున్నామని మోహన్ బాబు వివరించాడు.

అయితే సినిమా క్యాన్సల్ చేసుకున్నామనే విషయం వైవీఎస్ చౌదరికి చెప్పి ఆ 40లక్షల చెక్‌ ను బ్యాంకులో వేయ‌వ‌ద్ద‌ని సూచించామని మోహన్ బాబు వివరించారు. కానీ దీన్ని మనసులో పెట్టుకున్న వైవీఎస్ చౌదరి కుట్రపన్ని కావాల‌నే చెక్‌ ను బ్యాంకులో వేసి చెక్‌ ను బౌన్స్ చేశారని మోహన్ బాబు ఆరోపించారు.. నాపై చెక్ బౌన్స్‌ కేసుని వేసి... కోర్టును త‌ప్పు దోవ ప‌ట్టించాడని మండిపడ్డారు. ఆ కేసులోనే ఇప్పుడు కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిందని.. ఇందులో నా తప్పు ఏమాత్రం లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.

కాగా ఈ తీర్పుని మేం సెష‌న్స్ కోర్టులో సవాల్ చేస్తామని తెలిపారు. కొన్ని చానెల్స్‌ పనిగట్టుకొని నాకు ఏడాది జైలు శిక్ష అంటూ అభాసుపాలు చేయాలని చూస్తున్నాయని.. నాపై వ‌స్తున్న త‌ప్పుడు ఆరోప‌ణ‌ల‌ను న‌మ్మ‌వద్దు`` మోహన్ బాబు విజ్ఞప్తి చేశారు.