Begin typing your search above and press return to search.

మోహన్ బాబు భూ వివాదం...క్లారిటీ ఇచ్చిన ఎమ్మార్వో

By:  Tupaki Desk   |   3 March 2022 9:41 AM GMT
మోహన్ బాబు భూ వివాదం...క్లారిటీ ఇచ్చిన ఎమ్మార్వో
X
ఈ మధ్యకాలంలో మంచు ఫ్యామిలీ పేరు వార్తల్లో ప్రముఖంగా నిలుస్తోన్న సంగతి తెలిసిందే. 'మా'ఎన్నికలలో మంచు విష్ణు పోటీ చేయడం మొదలు...తాజాగా మంచు విష్ణు ఆఫీసులో హెయిర్ డ్రెస్సింగ్ ఎక్విప్ మెంట్ చోరీ వ్యవహారం వరకు మోహన్ బాబు, విష్ణుల పేర్లు వార్తల్లో వినిపిస్తున్నాయి. ఇక, మోహన్‌బాబు, విష్ణుల పేరిట చిత్తూరు జిల్లాలోని చంద్రగిరిలో డీకేటీ పట్టాలు మంజూరు కావడం చర్చనీయాంశమైంది. అయితే, తాజాగా ఆ భూముల వ్యవహారంపై చంద్రగిరి ఎమ్మార్వో శిరీష క్లారిటీ ఇచ్చారు.

చంద్రగిరి మండలం రామిరెడ్డిపల్లి-68 గ్రామ రెవెన్యూ లెక్క దాఖలా సర్వే నంబరు 412-1ఎ లోని 2.79 ఎకరాలు మోహన్‌బాబు, 412-1బిలో 1.40 ఎకరాలను మంచు విష్ణు పేరిట డీకేటీ పట్టా జారీ కావడం చర్చనీయాంశమైంది. దీంతో, ఆ రికార్డులను పరిశీలించామని, 1942 నుంచి 2001 వరకు ఆ భూమిపై 11 సార్లు క్రయవిక్రయాలు జరిగాయని వెల్లడించారు. సర్వే నంబరు 412-1లో 5.29 ఎకరాల భూమికి 1928లో దరఖాస్తు పట్టాలు మంజూరు చేశారని వెల్లడించారు.

అయితే, 18 జూన్ 1954 కంటే ముందు మంజూరైన డీకేటీ పట్టా భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని 2016లో అప్పటి ప్రభుత్వం జీవో 215ను జారీ చేసిందని చెప్పారు. దీంతో, మోహన్‌బాబు, విష్ణుల పేరిట ఉన్న భూములు డీకేటీ నుంచి పట్టా భూములుగా మారాయని వెల్లడించారు. కానీ, ఆన్‌లైన్‌లో సాంకేతిక లోపంతో అవి ఇంకా డీకేటీ పట్టా భూములుగానే కొనసాగుతున్నాయని, అందుకే, ఈ సమస్య వచ్చిందని శిరీష క్లారిటీ ఇచ్చారు.

కాగా, నాగ శ్రీను వ్యవహారంలో మోహన్ బాబు, విష్ణులపై నాయీ బ్రాహ్మ‌ణ సంఘం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగ శ్రీను వ్యవహారంలో మోహన్ బాబు తీరును జాతీయ బీసీ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కూడా విమర్శించారు. నాయీ బ్రాహ్మణులకే కాకుండా, యావత్ బీసీలకూ మోహన్ బాబు, విష్ణు తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.