Begin typing your search above and press return to search.

అస‌లు మోహ‌న్ బాబు ప్లానెంటి?

By:  Tupaki Desk   |   28 Nov 2016 7:07 AM GMT
అస‌లు మోహ‌న్ బాబు ప్లానెంటి?
X
ప్రముఖ నటుడు, మాజీ ఎంపీ మోహన్‌ బాబు మ‌రోమారు త‌న‌దైన శైలిలో వ్య‌వ‌హ‌రించిన తీరుపై కొత్త చ‌ర్చ మొదలైంది. కాపుల్ని బీసీల్లో చేర్చాలంటూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం చేస్తున్న ఉద్యమానికి మోహ‌న్ బాబు మద్దతు ప్రకటించారు. ముద్రగడను కలుసుకునేందుకు ఆయన ప్రత్యేకంగా కిర్లంపూడి వెళ్లారు. భేటీ అనంత‌రం మీడియాతో మాట్లాడాతూ ముద్రగడను ఓ గొప్ప పోరాట యోధుడిగా మోహన్‌ బాబు అభివర్ణించారు. కాపుల్ని బీసీల్లో చేర్చాలన్న కోరిక న్యాయబద్దమైందేనని చెప్పారు. ఆయన పోరాటం సహేతుకమేనని - ముద్రగడ ఉద్యమం విజయం సాధించాలని మోహ‌న్ బాబు అభిలషించారు. ముద్రగడ ఏ ఉద్యమం చేపట్టినా న్యాయబద్దంగా ఉంటుంద‌న్నారు.త‌న ఇంటికి రావాల‌ని ముద్ర‌గ‌డ కోర‌లేద‌ని, తానే ముద్రగడను చూసేందుకు ప్రత్యేకంగా వచ్చానని మోహ‌న్ బాబు వివ‌రించారు. సతీసమేతంగా విచ్చేసిన మోహన్‌ బాబుకు ముద్రగడ ఘనంగా ఆహ్వానం పలికారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం ముద్ర‌గ‌డ పాద‌యాత్ర‌ను అడ్డుకునేందుకు వీలైన‌న్నీ మార్గాలు వెతుకుతున్న క్ర‌మంలో మోహ‌న్‌బాబు వేసిన అడుగు రాజ‌కీయంగా చ‌ర్చ‌నీయాంశం అయింది. ముద్ర‌గ‌డ స్వ‌గ్రామానికి వెళ్లి మ‌రీ మోహ‌న్‌బాబు మ‌ద్ద‌తు తెల‌ప‌డం వెనుక మ‌ర్మం ఏమిట‌ని రాజ‌కీయ‌వ‌ర్గాలు చ‌ర్చించుకుంటున్నాయి. త్వ‌ర‌లో రాజ‌కీయాల్లోకి రానున్న‌ట్టు కొద్దికాలం క్రితం ప్ర‌క‌టించిన మోహ‌న్‌ బాబు తాజాగా ముద్ర‌గ‌డ‌ను క‌ల‌వ‌డం వెనుక ఆయ‌న వ్యూహాం ఏమిట‌ని విశ్లేషించుకుంటున్నాయి. ఇదిలాఉండ‌గా... కాపులకు రిజర్వేషన్లు కల్పించాలన్న హామీ అమలు కోసం ప్రభుత్వంపై తన చివరిశ్వాస వరకు పోరాటం చేస్తానని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం స్పష్టంచేశారు. కాకినాడలో కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన సమారాధనలో ముద్ర‌గ‌డ‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓట్ల కోసం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని యథావిధిగా అమలు చేయాలన్నదే తన డిమాండ్‌గా స్పష్టం చేశారు. ఇందుకోసం గాంధేయవాదంతో తాను ప్రతిపాదించిన సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహణకు ప్రభుత్వం అడ్డం పడిందన్నారు. తనతో పాటు కాపు ఉద్యమ నాయకులందర్నీ హౌస్‌ అరెస్టు చేశారన్నారు. తమను అనుసరిస్తున్న యువతపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, పోలీసులు కూడా చంద్రబాబు తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు.

ఎవరెంతగా ఒత్తిళ్ళు తెచ్చినా తమను ఉద్యమబాట నుంచి పక్కకు తప్పించలేరని ముద్రగడ స్పష్టం చేసారు. అంతిమ శ్వాస వరకు పోరాటాన్ని కొనసాగిస్తానన్నారు. ముద్రగడ రాకతో సమారాధన కార్యక్రమానికి ఒక్కసారిగా జోరు పెరిగింది. కాపు యువత ముద్రగడకు పెద్దెత్తున నినాదాలు చేస్తూ స్వాగతం పలికారు. అయితే ఇదే కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీకిచెందిన ఉపముఖ్యమంత్రి చినరాజప్ప - ఎమ్‌ పి తోట నరసింహం - ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూతో పాటు వైకాపా ఎమ్మెల్యే రాజా - మాజీమంత్రి కొప్పన మోహనరావు - ఇతర నాయకులు కూడా వచ్చారు. అయితే వీరంతా అభివాదాలకే పరిమితమయ్యారు. ఎలాంటి ప్రసంగాలు చేయక‌పోవ‌డం గ‌మ‌నార్హం.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/