Begin typing your search above and press return to search.

ఆయన్ను పిలవరా..మోహన్ బాబు ఆగ్రహం

By:  Tupaki Desk   |   28 Jan 2019 4:26 AM GMT
ఆయన్ను పిలవరా..మోహన్ బాబు ఆగ్రహం
X
దర్శకరత్న దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ సందర్భంగా నిర్వాహకులు వ్యవహరించిన తీరుపై ప్రముఖ విలక్షణ నటుడు మోహన్ బాబు మండిపడ్డారు. దాసరి విగ్రహావిష్కరణకు కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభంను ఎందుకు ఆహ్వానించలేదని ప్రశ్నించారు. ముద్రగడను పిలవకపోవడం సరికాదని తప్పుపట్టారు.

పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు గాంధీ బొమ్మల సెంటర్ లో దాసరి నారాయణ రావు విగ్రహావిష్కరణ సభ జరిగింది. విగ్రహాన్ని మోహన్ బాబుతోపాటు ఎంపీ మురళీ మోహన్ - సినీ ప్రముఖులు శ్రీకాంత్ - శివాజీరాజా - చోటాకే నాయుడు - సురేష్ కొండేటి - కవిత - హేమ - ప్రభ - సి. కళ్యాణ్ - రేలంగి నరసింహరావు - ధవళ సత్యం - రాజా వన్నెంరెడ్డి తదితరులు పాల్గొని ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ బాబు.. ‘తనను నమ్ముకున్న వారిని ద్రోహం చేయకుండా అందరికీ మంచి చేయాలనే వ్యక్తిత్వం కలిగిన వ్యక్తి ముద్రగడ. ఈ ప్రాంతంలో ఆయన ఉండడం గర్వకారణం.. అనుకున్నది సాధించగల వ్యక్తి ముద్రగడ. ఆయన్ను విగ్రహావిష్కరణకు ఆహ్వానించకపోవడం సరికాదు’ అని అన్నారు. ముద్రగడ తనకు మంచి మిత్రుడని.. ముద్రగడ ఏ పార్టీలో లేరని.. తాను రాజకీయాల్లో లేనని.. అందుకే మా భేటికి రాజకీయ ప్రాధాన్యత లేదని మోహన్ బాబు స్పష్టం చేశారు. కేవలం మర్యాదపూర్వకంగానే కలిసానని చెప్పుకొచ్చారు.

ఈ సందర్భంగా తన గురువు అయిన దాసరి బయోపిక్ తెరకెక్కాల్సిన అవసరం ఉందని మోహన్ బాబు అభిప్రాయపడ్డారు. దాసరి బయోపిక్ తీసేందుకు వారు కుటుంబసభ్యులు ముందుకొస్తే తాను పూర్తి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. దాసరి స్థానాన్ని టాలీవుడ్ లో ఎవరూ భర్తీ చేయలేరని.. తనలాంటి వందల మందిని ఆయన చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారని గుర్తు చేశారు. దర్శకుడికి హీరో ఇమేజ్ తీసుకొచ్చింది దాసరియేనని మోహన్ బాబు పేర్కొన్నారు.