Begin typing your search above and press return to search.

హెరిటేజ్ మోహ‌న్ బాబుదా? ఆయ‌న మాట‌ల్లోనే..!

By:  Tupaki Desk   |   3 April 2019 5:27 AM GMT
హెరిటేజ్ మోహ‌న్ బాబుదా?  ఆయ‌న మాట‌ల్లోనే..!
X
ప్ర‌ముఖ సినీన‌టుడు.. తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన మంచు మోహ‌న్ బాబు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇంత‌కాలం ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచిన హిస్ట‌రీ మాత్ర‌మే తెలిసిన తెలుగు ప్ర‌జ‌ల‌కు తాజాగా ఆయ‌న హెరిటేజ్ స్టోరీని చెప్పుకొన్నాచు. యూజ్ అండ్ త్రో క్యారెక్ట‌ర్ బాబుద‌ని చెప్పిన ఆయ‌న.. న‌మ్మిన ఎన్టీఆర్ మొద‌లు త‌న‌ను న‌మ్మినోళ్లంద‌రిని ఆయ‌న మోసంచేసిన‌ట్లుగా సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

టీడీపీ ఎన్టీఆర్ ద‌ని.. హెరిటేజ్ ఫుడ్స్ త‌న‌ద‌ని చెప్పిన మోహ‌న్ బాబు.. ఇంత‌కూ హెరిటేజ్ ఆయ‌న సొంతం(?) ఎలానో ఆయ‌న మాట‌ల్లోనే వింటే..

"చంద్రబాబుది అంతా కరివేపాకు పాలసీ. యూజ్‌ అండ్‌ త్రో. అదే ఆయన క్యారెక్టర్‌. ఎన్టీ రామారావు సహా చంద్రబాబు తనను నమ్మిన వాళ్లందర్నీ మోసం చేశారు. నాకు చేసిన మోసం అదో చరిత్ర. హెరిటేజ్‌ ఫుడ్స్‌ నాది.. అంటే అందులో నాది ఎక్కువ శాతం. చంద్రబాబు - నేను - దాగా అనే మరో స్నేహితుడు కలిసి హెరిటేజ్‌ ఫుడ్స్‌ ను స్థాపించాం"

హెరిటేజ్ లో నేను ప్రధాన భాగస్వామిని. అంటే.. నాది ఎక్కువ పెట్టుబడి. చంద్రబాబుది తక్కువ పెట్టుబడి. దాగా అనే అయనది మరింత‌ తక్కువ పెట్టుబడి. సంస్థ స్థాపించిన కొన్నాళ్లకు చంద్రబాబు కొన్ని బ్లాంక్‌ పేపర్లు పంపించి సంతకాలు పెట్టమన్నారు.

బ్లాంక్‌ పేపర్ల మీద సంతకాలు ఎందుకని అడిగితే ఏదో చెప్పారు. అప్పట్లో నేను సినిమా హీరోగా అగ్రస్థానంలో ఉన్నాను. కెరీర్‌ పీక్స్‌ లో ఉండటంతో చాలా బిజీగా ఉన్నా. అప్పట్లో నాకిన్ని విషయాలు కూడా తెలీవు. స్నేహితుడు అని నమ్మి చంద్రబాబు చెప్పినట్లు బ్లాంక్‌ పేపర్ల మీద సంతకాలు చేశా. తరువాత మరికొన్ని పేపర్ల మీద కూడా సంతకాలు తీసుకున్నారు. తరువాత కొన్నేళ్లకు హెరిటేజ్‌ సంస్థతో నాకు సంబంధం లేదని చెప్పడంతో షాక్‌ తిన్నా.

ఈ విష‌యం మీద కోర్టుకు వెళ్లా. కేసు చాలా కాలం సాగింది. కానీ చంద్రబాబు పరపతి ఉన్నవాడు. ఆయనతో మనం తట్టుకోలేం అని కుటుంబ సభ్యులు - కొందరు స్నేహితులు చెబితే ఆ కేసు వదిలేశా. ఓ సినిమా తీశా.. ఫెయిల్‌ అయ్యిందని సరిపెట్టుకున్నా. నా త‌ర్వాత మ‌రో పార్ట‌న‌ర్ దాగానూ నాకు మాదిరే మోసం చేసి బయటకు పంపారు. హెరిటేజ్‌ సంస్థ విషయంలో బాబు మమ్మల్నే కాదు రైతులను - ప్రభుత్వాన్ని కూడా మోసం చేశారు.

చంద్రబాబు ఏం చేశారో తెలుసా? కంపెనీ డబ్బును ఖర్చుల కోసమని చెప్పి బ్యాంకు నుంచి డ్రా చేసేవారు. ఆ డబ్బును తనకు తెలిసిన కొందరు రైతులకు ఇచ్చేవారు. వాళ్లు హెరిటేజ్‌ కంపెనీలో షేర్లు కొన్నట్టు చూపించేవారు. కొన్నాళ్లకు మళ్లీ ఆ షేర్లను తానే కొనుక్కున్నట్లు డ్రామా నడిపించారు. హెరిటేజ్‌ సంస్థలో వాటాలు పెట్టినట్టు గానీ వాటిని చంద్రబాబుకు అమ్మినట్టు గానీ ఆ రైతులకే తెలియకుండా వ్యవహారం నడిపారు. రైతులు ఇస్తే పన్నులు ఉండవు. అంత ఘోరాలు చేశారు.

ఎన్టీ రామారావును మోసం చేసి టీడీపీని తీసుకున్నట్టుగా.. నన్ను మోసం చేసి హెరిటేజ్‌ సంస్థను తీసుకున్నారు. దాన్ని రూ.వేల కోట్లకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. ఈ విషయం మీద తిరుపతిలో లేదా కాణిపాకంలో గానీ విజయవాడ కనకదుర్గమ్మ సన్నిధిలో గానీ కుటుంబ సభ్యులతో వచ్చి ఒట్టేసి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. మరి చంద్రబాబు తన కుటుంబ సభ్యులతో వచ్చి అలా చెప్పగలరా?