Begin typing your search above and press return to search.

అంత అహంకారం వ‌ద్దు.. నా డ‌బ్బులు నాకివ్వు!

By:  Tupaki Desk   |   22 March 2019 9:35 AM GMT
అంత అహంకారం వ‌ద్దు.. నా డ‌బ్బులు నాకివ్వు!
X
త‌మ విద్యా సంస్థ శ్రీ‌విద్యానికేత‌న్ సంస్థ‌కు ప్ర‌భుత్వం నుంచి రావాల్సిన ఫీజ్ రీయింబ‌ర్స్ మెంట్ మొత్తాన్ని చెల్లించాలంటూ ప్ర‌ముఖ సినీ న‌టుడు మోహ‌న్ బాబు తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. ఈ రోజు ఆయ‌న వేలాది మంది విద్యార్థుల‌తో ర్యాలీ నిర్వ‌హించే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. పోలీసులు అందుకు ఒప్పుకోలేదు.

ఎన్నిక‌ల కోడ్ అమ‌ల్లో ఉన్నందున నిర‌స‌న ర్యాలీలు చేసేందుకు అనుమ‌తి లేద‌ని మోహ‌న్ బాబుకు పోలీసులు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న త‌న ఇద్ద‌రు కుమారుల‌తో క‌లిసి ర్యాలీ నిర్వ‌హించారు. ఒక‌ద‌శ‌లో మోహ‌న్ బాబును గృహ‌నిర్బందంలో ఉంచిన‌ట్లుగా వార్త‌లు వ‌చ్చాయి. అయితే.. విద్యార్థుల‌తో నిర్వ‌హిస్తాన‌న్న నిర‌స‌న ర్యాలీని మోహ‌న్ బాబు ఇద్ద‌రు కుమారులు చేప‌ట్టారు.

ఈ సంద‌ర్భంగా విద్యాసంస్థ‌ల‌కు చెల్లించాల్సిన ఫీజు బ‌కాయిల్ని వెంట‌నే చెల్లించాలంటూ ఫ్ల‌కార్డులు ప‌ట్టుకొని ర్యాలీ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వ్య‌ర్థ వాగ్దానాలు ఇవ్వ‌టం ఆపి.. విద్యార్థుల ఫీజులు స‌కాలంలో చెల్లించాలంటూ ఫ్ల‌కార్డులు ప‌ట్టుకొని నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్టారు.

తాను అనుకున్న‌ట్లు మోహ‌న్ బాబు ర్యాలీని నిర్వ‌హించ‌టం సంచ‌ల‌నంగా మారింది. అనుమ‌తి లేద‌న్న పోలీసులు.. ఒక ద‌శ త‌ర్వాత ర్యాలీని చూస్తుండిపోయారే త‌ప్పించి ఇంకేమీ చేయ‌లేక‌పోయార‌న్న మాట వినిపిస్తోంది. ఇదిలా ఉంటే.. ర్యాలీ అనంత‌రం మాట్లాడిన మోహ‌న్ బాబు.. బాబుపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

చంద్ర‌బాబు ఇప్పుడు ముఖ్య‌మంత్రి కాద‌ని.. ఆయ‌న కేవ‌లం అప‌ధ‌ర్మ ముఖ్య‌మంత్రి అని వ్యాఖ్యానించారు. పోలీసులు కూడా చంద్ర‌బాబు మాట విన‌టం లేద‌న్నారు. ఎన్నిక‌ల వేళ‌లో వ్య‌ర్థ వాగ్దానాల్ని ఇవ్వ‌టం మానేయాల‌ని డిమాండ్‌చేశారు. నాలుగున్న‌రేళ్లుగా చంద్ర‌బాబు ఏపీ ప్ర‌జ‌ల్ని ఏ విధంగా ఏడిపించారో వారంద‌రికి తెలుస‌న్నారు. వాస్త‌వానికి త‌న‌కు చంద్ర‌బాబు అంటే ఇష్ట‌మ‌ని.. ఆయ‌న క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు త‌మ విద్యార్థులే ఆయ‌న త‌ర‌ఫు పోరాటం చేశార‌న్నారు. ఎన్నిక‌ల వేళ వాగ్దానాలు ఇచ్చే చంద్ర‌బాబు వ‌ద్ద ఇవ్వ‌టానికి ఏమీ లేద‌ని.. ఆయ‌న సొంతానికి మూడు ఎక‌రాల భూమి మాత్ర‌మే ఉంద‌న్నారు.

ప్ర‌జ‌ల నుంచి దోచుకున్న డ‌బ్బే ప్ర‌జ‌ల‌కు పంచుతున్నారే త‌ప్పించి.. ఆయ‌న సొంత డ‌బ్బు ఇవ్వ‌లేద‌న్న మోహ‌న్ బాబు.. ప్ర‌తి ఏటా ఆరంభంలోనే ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ ప‌థ‌కానికి సంబంధించి ప్ర‌తి మూడు నెల‌ల‌కు ఒక‌సారి బ‌కాయిలు చెల్లిస్తామ‌ని చెప్పార‌ని.. ఇప్పుడు ఎన్ని లేఖ‌లు రాసినా స్పందించ‌లేద‌న్నారు. మ‌నిషికి అంత అహంకారం ప‌నికి రాద‌ని.. బాబేమీ స‌త్య హ‌రిశ్చంద్రుడి కాద‌న్న ఆయ‌న‌.. అవ‌న్నీ త‌న‌కు అవ‌స‌రం లేద‌ని.. త‌న‌కు ఇవ్వాల్సిన బ‌కాయిల్ని చెల్లించాల‌ని చంద్ర‌బాబును డిమాండ్ చేశారు. అంతా బాగానే ఉంది కానీ మోహ‌న్ బాబు మాట‌ల్లో ఒకే ఒక్క మాట ద‌గ్గ‌ర సందేహం. ఇప్పుడు బాబు సీఎం కాద‌ని చెప్పిన మోహ‌న్ బాబు.. చెల్లింపులు చెల్లించే అధికారం అప‌ద్ద‌ర్మ ముఖ్య‌మంత్రికి ఉంటుందా? సీఎంగా గుర్తించ‌నంటూనే.. బ‌కాయిల్ని క్లియ‌ర్ చేయ‌టం ఏమిటో మోహ‌న్ బాబుకే తెలియాలి.