Begin typing your search above and press return to search.

బీజేపీ ప్రతిపాధనపై సూపర్‌ స్టార్‌ రెస్పాన్స్‌

By:  Tupaki Desk   |   4 Feb 2019 12:16 PM GMT
బీజేపీ ప్రతిపాధనపై సూపర్‌ స్టార్‌ రెస్పాన్స్‌
X
మలయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌ లాల్‌ మరి కొన్ని రోజుల్లో జరుగబోతున్న పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేయబోతున్నాడు అంటూ చాలా రోజులుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి. కేరళలో బీజేపీకి బలం అంతంత మాత్రంగానే ఉంది. అందుకే కేరళలో బలం పెంచుకునేందుకు బీజేపీ చేయని ప్రయత్నం లేదు. అందులో భాగంగానే మోహన్‌ లాల్‌ తో చాలా నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నారు. ఆమద్య మోహన్‌ లాల్‌ కూడా ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవ్వడంతో పాటు, రాష్ట్రంలో జరుగుతున్న ఆర్‌ ఎస్‌ ఎస్‌ కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. దాంతో అంతా కూడా మోహన్‌ లాల్‌ బీజేపీలో చేరడం ఖాయం అనుకున్నారు.

ఒక వేళ మోహన్‌ లాల్‌ బీజేపీకి ఓకే చెప్తే తిరువనంతపురం ఎంపీ సీటును ఇచ్చేందుకు సిద్దంగా ఉంది. తిరువనంతపురంలో మోహన్‌ లాల్‌ పోటీ చేస్తే సునాయాసంగా విజయాన్ని సొంతం చేసుకుంటాడనేది రాజకీయ విశ్లేషకుల వాదన కూడా. అందుకే మోహన్‌ లాల్‌ వచ్చే ఎన్నికల తర్వాత పార్లమెంటులో అడుగు పెట్టడం పక్కా అంటూ అంతా భావించిన సమయంలో ఆయన స్పందన అంతా రివర్స్‌ అయ్యేలా చేసింది. తాజాగా హైదరాబాద్‌ కు ఒక చిత్రం షూటింగ్‌ కోసం వచ్చిన మోహన్‌ లాల్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ సమయంలోనే రాజకీయ అరంగేట్రం గురించి స్పందించారు.

నేను ఇప్పుడు, ఎప్పుడు కూడా నటుడిగానే ఉండేందుకు ఇష్టపడతాను. రాజకీయాలు నాకు సరిపడవు, సినిమా రంగంలో ఉన్నంత స్వేచ్చ రాజకీయాల్లో ఉండదు. రాజకీయాల్లో ప్రజా నాయకుడిగా ఉంటే ప్రజలు నాపై ఆధారపడి ఉంటారు, నాపై ఆశలు పెట్టుకుంటారు. వారిని తృప్తి పర్చడం, వారి కోరికలను నెరవేర్చడం అనేది చాలా కష్టమైన పని. అందుకే నేను రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోవడం లేదని మోహన్‌ లాల్‌ స్పష్టంగా క్లారిటీ ఇచ్చాడు. నేను ఉన్న సినిమా రంగం మాత్రమే నాకు తెలుసు, అంతకు మించి నాకు ఏమీ తెలియవు, రాజకీయాలు నాకు అసలు తెలియవు అంటూ మోహన్‌ లాల్‌ ఫుల్‌ క్లారిటీ ఇచ్చాడు. సూపర్‌ స్టార్‌ క్లారిటీతో అయినా బీజేపీ వారు ప్రయత్నాలు ఆపేస్తారేమో చూడాలి.