Begin typing your search above and press return to search.

సోమ‌వారం సెల‌వు కాకుంటే ప‌రిస్థితి ఏంది?

By:  Tupaki Desk   |   3 Oct 2017 6:30 AM GMT
సోమ‌వారం సెల‌వు కాకుంటే ప‌రిస్థితి ఏంది?
X
పాల‌కులు ప్ర‌జ‌ల్ని ప‌ట్టించుకోన‌ప్పుడు దేవుడే దిక్కు అంటుంటారు. ఇప్పుడి మాట హైద‌రాబాదీయుల‌కు అచ్చు గుద్దిన‌ట్లుగా స‌రిపోతుంది. పాల‌కుల నిర్ల‌క్ష్యం.. అధికారుల చేత‌కానిత‌నం క‌లిసి ప్ర‌జ‌ల‌కు సినిమా క‌నిపిస్తోంది. పాల‌న ప‌డ‌కేయ‌టంతో ప‌రిస్థితులు దారుణంగా మారాయి. గ‌ట్టి వాన ప‌డితే ఇళ్ల‌ల్లో నుంచి బ‌య‌ట‌కు అడుగు పెట్ట‌లేని దుస్థితి హైద‌రాబాదీయుల‌కు ఎదుర‌వుతోంది.

వ‌రుస‌గా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా నిత్యం ప్ర‌త్య‌క్ష న‌ర‌కాన్ని చ‌విచూస్తున్నారు ప్ర‌జ‌లు. ఈ మ‌ధ్య కాలంలో వ‌ర్షాలు చాలానే ప‌డినా.. సోమ‌వారం కురిసిన వాన ఇందుకు పూర్తిగా భిన్న‌మైన‌ద‌ని చెప్పాలి. ఆకాశానికి చిల్లు ప‌డిందా? అన్న రీతిలో కురిసిన వాన‌తో హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రం వ‌ణికిపోయింది. ప్ర‌జ‌ల సంగ‌తి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే లేదు. వ‌ర్షం వేళ బ‌య‌ట ఎందుకు ఉన్నామ‌ని తిట్టుకోకుండా ఉండ‌లేక‌పోయారు.

భారీగా కురిసిన వాన గ్రేట‌ర్ హైద‌రాబాదీయుల‌ను ఎంత ఇబ్బంది పెట్టినా.. ఒక పెను ప్ర‌మాదం ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల‌కు తృటిలో త‌ప్పింద‌ని చెప్పాలి. సోమ‌వారం (అక్టోబ‌రు 2) గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సెల‌వు కావ‌టంతో చాలావ‌ర‌కూ ఆఫీసులు ప‌ని చేయ‌ట‌లేదు. సైబ‌రాబాద్ ప‌రిధిలోని చాలా ఐటీ కంపెనీలకు సెల‌వు ఇచ్చారు. దీంతో.. ల‌క్ష‌లాది మంది బ‌య‌ట‌కు రాలేదు. ఒక‌వేళ సోమ‌వారం సెల‌వు కాకుంటే ప‌రిస్థితిని ఊహించేందుకు సైతం క‌ష్ట‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. భారీ వ‌ర్షం కార‌ణంగా రోడ్ల మీద‌కు వ‌ర‌ద పోటెత్తిన వైనంతో ప్ర‌జ‌లు బెంబేలెత్తిపోయారు.

హైద‌రాబాదీయుల‌కు ఎప్పుడు ఎదురుకాని చిత్ర‌మైన అనుభ‌వం సోమ‌వారం ఎదురైంద‌ని చెప్పాలి. రెండు గంట‌ల్లో కురిసిన భారీ వ‌ర్షానికి పోటెత్తిన వ‌ర్షానికి ఏం చేయాలో న‌గ‌ర‌జీవికి అస్స‌లు అర్థం కాలేదు. భారీ వర్షంతో ఎదురైన షాక్ నుంచి తేరుకునే లోపే రోడ్ల మీద‌కు భారీగా వాన‌నీరు వ‌ర‌ద రూపంలో ముంచెత్త‌టంతో వాహ‌న‌దారులు పెద్ద ఎత్తున ఇబ్బంది ప‌డ్డారు. ఉరుకులు ప‌రుగులు తీస్తున్న వాన‌నీటి ఉధృతిని త‌ట్టుకోలేక విల‌విల‌లాడిపోయారు

చినుకు ప‌డితేనే ట్రాఫిక్ జాంతో చుక్క‌లు క‌నిపించే న‌గ‌రజీవికి.. సోమ‌వారం సెల‌వు కావ‌టంతో పెను ప్ర‌మాదం నుంచి తృటిలో త‌ప్పించుకున్నార‌ని చెప్పాలి. ఒక‌వేళ‌.. సోమ‌వారం కానీ సెల‌వు కాకుంటే ఊహించ‌టానికి కూడా వీల్లేని ప‌రిస్థితి ఎదురై ఉండేద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. వ‌ర్ష తీవ్ర‌త ఎంత ఎక్కువ‌న్న దానికి గ్రేట‌ర్ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌ర పాల‌క సంస్థ (జీహెచ్ ఎంసీ) ప్ర‌ధాన కార్యాల‌యం నీట మునిగిపోయింది. అయ్య‌ప్ప సొసైటీ.. దుర్గం చెరువు తో స‌హా ప‌లు కాల‌నీలు నీట మునిగిపోయాయి. రోడ్లు చెరువులు మాదిరి మారిపోయిన దుస్థితి. ఇలాంటి వేళ‌.. వ‌ర్కింగ్ డే అయి ఉండే ప‌రిస్థితి ఎలా ఉండేద‌న్న భావ‌న కూడా భ‌యాన్ని క‌లిగిస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

వ‌ర్ష తీవ్ర‌త‌తో ప‌లుచోట్ల చెట్లు విరిగిప‌డ‌టం.. విద్యుత్ తీగ‌ల మీద చెట్లు ప‌డి.. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం క‌ల‌గ‌టం లాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఏది ఏమైనా.. సోమ‌వారం సెల‌వు కావ‌టం గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప్ర‌జ‌ల‌కు భారీ మేలు జ‌రిగింద‌ని చెప్ప‌క‌త‌ప్ప‌దు.