Begin typing your search above and press return to search.

కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త నోట్ల తళతళ

By:  Tupaki Desk   |   19 Dec 2016 11:07 AM GMT
కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో కొత్త నోట్ల తళతళ
X
ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో కడప జిల్లాలో అప్పుడే క్యాంపు శిబిరాలు ప్రారంభమయ్యాయి. వైకాపా అభ్యర్థిగా వైఎస్ వివేకానందరెడ్డి - టిడిపి తరఫున బీటెక్ రవి రంగంలోకి దిగారు. వారిద్దరి తరఫున ఆయా పార్టీల అధిష్ఠానాలు రంగంలోకి దిగి ఓటర్లు - వారి కుటుంబ సభ్యులపై వత్తిడి తీసుకొచ్చి బేరసారాలు చేసుకుని ఓటుకు రూ. 5 నుంచి రూ. 10 లక్షలు ఇస్తామని హామీ ఇస్తూ అడ్వాన్స్‌ గా కొంత ముట్టజెప్పి వారిని క్యాంపులకు తీసుకెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ అడ్వాన్సులన్నీ కొత్త రూ.2 వేల నోట్ల రూపంలోనే ఇస్తున్నారట.

ఈ క్రమంలో ఆదివారం చాలా మంది ఓటర్లను తమకు అనువైన ప్రాంతాలకు, తాము ఏర్పాటుచేసిన శిబిరాలకు తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా మహిళా ఓటర్లు అయితే వారికి భద్రతగా వారి భర్తతో పాటు కుటుంబ సభ్యులను కూడా శిబిరాలకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నేత - వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి సొంత జిల్లాపైనే టిడిపి అధిష్ఠానం దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్లకు బాగా డిమాండ్ పెరిగింది.

మూడేళ్ల క్రితం జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మండల పరిషత్ - జిల్లా పరిషత్ - నగర పాలక సంస్థ - పురపాలక సంఘాల ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థులందరికీ ఓటు హక్కు వుంది. నగర పాలక - పురపాలక సంఘాల్లోని ఓటర్లకు అరకొర ఆదాయం ఉన్నా మండల పరిషత్ - జిల్లా పరిషత్ ఓటర్లకు ఏమాత్రం ఆదాయం లేక ఎన్నికల్లో ఖర్చు చేసిన సొమ్ముకు వడ్డీ కూడా గిట్టుబాటుకాక పలువురు డీలా పడ్డారు. ఇదిలా ఉండగా జిల్లాలో 70శాతం పైబడి స్థానిక సంస్థలు గెలుపొందిన ప్రజాప్రతినిధులందరూ వైకాపాకి చెందిన వారే. అయితే అధికారంలో టిడిపి ఉండటంతో ఆ పార్టీ నేతలు కేవలం తమ సత్తా నిరూపణకు - ఆధిపత్యం - అధిష్ఠానం వద్ద తమ గుర్తింపు కోసం వైకాపా ఓటర్లకు గాలం వేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ నేతల కంటే తెలుగుతమ్ముళ్లే బంపర్ ఆఫర్‌ తో పాటు రాజకీయ భవిష్యత్తు కల్పిస్తామని ఓటర్లకు గట్టి హామీ ఇస్తున్నట్లు తెలుస్తోంది. అదే తరహాలో వైకాపా నేతలు కూడా 2019 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తుందని అప్పట్లో కావాల్సిన పదవులు ఇస్తామని ఓటర్లను నమ్మబలుకుతున్నట్లు సమాచారం.

ఇదంతా ఒక ఎత్తయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్యాంపు రాజకీయాలు.. ఆఫర్ల నేపథ్యంలో కొత్త నోట్ల కట్టలు చేతులు మారుతున్నాయట. ముఖ్యంగా టీడీపీ నేతలు అడ్వాన్సులుగా ఇస్తున్న మొత్తం చెక్కుల్లో కాకుండా కొత్త కరెన్సీయే ఇస్తున్నారట. మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయో.. ఏమో చంద్రబాబుకే తెలియాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/