Begin typing your search above and press return to search.

బీ అలెర్ట్.. గాలి ద్వారా మంకీపాక్స్ వ్యాప్తి

By:  Tupaki Desk   |   11 Jun 2022 6:26 AM GMT
బీ అలెర్ట్.. గాలి ద్వారా మంకీపాక్స్ వ్యాప్తి
X
కరోనా మహమ్మారి తర్వాత అంతలా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మరో వైరస్ మంకీపాక్స్. ఇప్పటికే ఈ వైరస్ దాదాపు 80 దేశాలకు విస్తరించింది. దీని వ్యాప్తి చూస్తూంటే ఈ వైరస్ కూడా గాలి ద్వారానే వ్యాపిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై పరిశోధనలు చేసిన అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ మంకీపాక్స్ వైరస్ గాలి ద్వారానే వ్యాపిస్తోందని ప్రకటించింది.

మంకీపాక్స్ వైరస్ కరోనా తర్వాత మరో మహమ్మారిలా మారుతోంది. ఈ వైరస్ కూడా కొవిడ్ వైరస్‌లా గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మహమ్మారి పుట్టుకొచ్చిన స్వల్ప వ్యవధిలోనూ ప్రపంచ దేశాలకు విస్తరించడం గాలి ద్వారా వ్యాపిస్తోందనడానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇప్పటికే 80 దేశాల్లో విస్తరించిన మంకీపాక్స్ వైరస్‌ వ్యాప్తిపై అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్(CDC) పరిశోధనలు చేసింది.

ఈ మహమ్మారి గాలి ద్వారా వ్యాప్తి చెందుతోందని సీడీసీ ప్రకటించింది. మంకీపాక్స్ సోకిన వ్యక్తికి దగ్గరగా ఉండి మాట్లాడితే ఈ వ్యాధి సోకుతుందని సీడీసీ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 1300 కేసులు నమోదైనట్లు తెలిపింది. ఈ వైరస్ సోకిన దేశాలు అప్రమత్తమై వ్యాప్తిని కట్టడి చేయడానికి చర్యలకు ఉపక్రమించాయి. బెల్జియం దేశ ప్రభుత్వం ఏకంగా మంకీపాక్స్ బాధితులు క్వారంటైన్‌లో ఉండాలని ఆదేశాలు జారీచేసింది.

ఇప్పటి వరకు ఆఫ్రికా, యూరప్, అమెరికాలను వణికిస్తున్న మంకీపాక్స్‌ వైరస్‌ ఆదివారం నాటికి ఆసియా ఖండంలోకి ప్రవేశించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఇజ్రాయెల్‌లో తొలి కేసు నమోదైనట్లు తెలిపింది.

స్విట్జర్లాండ్‌లోనూ మంకీపాక్స్ కేసులు వెలుగులోకి వచ్చినట్లు పేర్కొంది. రోజురోజుకు మంకీపాక్స్ కేసులు పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇలా ఈ కేసులు విస్తరించడం అసాధారణమని వ్యాఖ్యానించింది.

మరోవైపు మంకీపాక్స్ వైరస్ వ్యాప్తిపై ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. మంకీపాక్స్‌ అధికంగా వ్యాప్తి చెందడానికి శృంగారమే ప్రధాన కారణమనని పేర్కొంది. మంకీపాక్స్‌ ఉన్నవారు ఇతరులతో శారీరకంగా కలవడం కారణంగా వైరస్‌ వ్యాప్తి అధికంగా ఉందని ఆరోగ్య సంస్థ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ పేర్కొన్నారు. గతంలో మంకీపాక్స్‌ వ్యాప్తి లేని దేశాల్లోనూ ఈ కేసులు వెలుగుచూస్తున్న మాట వాస్తవమేనని, కానీ వాటిని నివారించవచ్చు అని తెలిపారు.