Begin typing your search above and press return to search.

కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు.. పసికందు మృతి

By:  Tupaki Desk   |   14 Feb 2021 12:52 PM GMT
కవల పిల్లల్ని ఎత్తుకెళ్లిన కోతులు.. పసికందు మృతి
X
జనవాసాల్లోకి చొరబడి కోతులు దారుణానికి పాల్పడ్డాయి. వనాలు తరగడంతో జనాల్లోకి వస్తున్న కోతులు చేసే అల్లరి అంతా ఇంతాకాదు. తాజాగా కోతులు అరాచకత్వానికి పాల్పడ్డాయి. కోతులు కవల పిల్లలను ఎత్తుకుపోయాయి. అందులో ఒక పసికందు ప్రాణాలు కోల్పోయిన ఘటన విషాదం నింపింది.

తమిళనాడులోని తంజావూర్ జిల్లా కేంద్రంలో గల రాంపూర్ రోడ్డు ప్రాంతంలో రాజు, భువనేశ్వరి దంపతులు నివసిస్తున్నారు. పెయింట్ పనులు చేసుకునే రాజు దంపతులకు ఇప్పటికే 5 ఏళ్ల పాప ఉంది. తాజాగా ఫిబ్రవరి 6న వీరికి మరో సంతానంగా కవల పిల్లలు పుట్టారు. కవలల్ని చూసుకుంటూ భువనేశ్వరి ఇంట్లోనే ఉంటోంది. కాగా శుక్రవారం వాళ్ల ఇంటిపై రౌడీ కోతి మూక విరుచుకుపడి.. 8 రోజుల పసికందుల్ని ఎంతుకెళ్లాయి. పిల్లలకు పాలిచ్చి పడుకోబెట్టిన తర్వాత 11 గంటల సమయంలో తల్లి భువనేశ్వరి పెరట్లోని బాత్రూమ్ కు వెళ్లింది.

ఆ సమయంలోనే కోతుల దండు ఆ ఇంటిపైకి దూకింది. చప్పుడుకు బాత్రూంలో ఉన్న భువనేశ్వరి పరుగున బయటకొచ్చింది. ఇంటి పైకప్పు పెంకుల్ని తొలిగించిన కోతులు చాపపై పడుకొని ఉన్న కవల పిల్లల్ని ఎత్తుకెళ్లాయి. భయంతో తల్లి కేకలు వేయడంతో చుట్టుపక్కల వాళ్లు బయటకొచ్చారు.

రెండుగా విడిపోయిన కోతుల గుంపు ఒక పాపను దూరంగా తీసుకెళ్లగా.. మరో గుంపు కోతులు రెండో పాతో ఇంటిపైకప్పుగా ఉండిపోయాయి. స్థానికులు బెదిరించడంతో ఒక పాపను ఇంటిపైకప్పుపై వదిలి కోతులు పారిపోయాయి. ఇంకో పాపను ఎత్తుకెళ్లాయి. చివరకు ఆ పాప ఇంటివెనుకున్న నీటి కందకంలో సృహ కోల్పోయి కనిపించింది. ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. కోతులు ఎత్తుకెళ్లిన సమయంలో శిశువు కీళ్లు తొలిగిపోయాయని.. నీళ్లలో పడేయడంతో ఊపిరాడక ప్రాణాలు పోయాయని డాక్టర్లు పేర్కొన్నారు. ఈ విషాద ఘటనతో తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు.