Begin typing your search above and press return to search.

భారత్‌ వృద్ధిరేటుపై మూడీస్‌ షాకింగ్‌ సర్వే!

By:  Tupaki Desk   |   11 Nov 2022 10:03 AM
భారత్‌ వృద్ధిరేటుపై మూడీస్‌ షాకింగ్‌ సర్వే!
X
ప్రముఖ రేటింగ్‌ ఏజెన్సీ.. మూడీస్‌ ఇండెక్స్‌ భారత వృద్ధిరేటుకు సంబంధించి సంచలన నివేదికను వెల్లడించింది. 2022లో భారతదేశ జీడీపీ వృద్ధిరేటు 7%కి తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు మూడీస్‌ పేర్కొంది. గతంలో జీడీపీ వృద్ధిరేటును 7.7% గా మూడీస్‌ అంచనా వేసిన సంగతి తెలిసిందే.

కాగా భారత జీడీపీ వృద్ధిరేటు 2023లో4.8%కి తగ్గుతుందని మూడీస్‌ పేర్కొంది. అయితే 2024 నాటికి 6.4 శాతానికి వృద్ధిరేటు చేరుతుందని మూడీస్‌ వివరించింది.

భారత వృద్ధిరేటు తగ్గడానికి అధిక ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం వంటివి కారణాలుగా నిలుస్తాయని తెలిపింది.

మరోవైపు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 2022–23లో భారత జీడీపీ వృద్ధిరేటును 7% గా అంచనా వేసింది. ద్రవ్యోల్బణంను తగ్గించడం,మారకపు రేటుకు మద్దతు ఇవ్వడం లక్ష్యంగా ఆర్‌బీఐ రెపో రేటును మరో 50 బిపిఎస్‌ (బేసిస్‌ పాయింట్లు) పెంచుతుందని ఆశిస్తున్నట్టు మూడీస్‌ తన తాజా నివేదికలో వెల్లడించింది.

అలాగే ఆర్‌బీఐ ద్రవ్యోల్బణాన్ని తగ్గించడం కంటే కూడా వృద్ధి రేటును పెంచడంపైనే దృష్టి సారించే అవకాశం ఉందని మూడీస్‌ తన నివేదికలో పేర్కొంది. మారకపు రేట్లు పెంచడం ద్వారా రూపాయిపై ఒత్తిడి తగ్గించడం వంటి చర్యలు చేపట్టే అవకాశం ఉందని తెలిపింది.

ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి మే నుండి ఆర్‌బీఐ ఇప్పటికే 190 బీపీఎస్‌ పాయింట్ల మేర రేట్లు పెంచింది, ఇది ఈ సంవత్సరం చాలా వరకు 2–6% లక్ష్యం కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం.

డాలర్‌తో పోలిస్తే బలహీనపడుతున్న భారత రూపాయి, అధిక చమురు ధరలు ద్రవ్యోల్బణంపై ఒత్తిడిని పెంచుతూనే ఉంటాయని మూడీస్‌ పేర్కొంది.

అయితే, సేవల కార్యకలాపాలు పుంజుకున్న నేపథ్యంలో భారతదేశ అంతర్గత వృద్ధి మూలాలు ప్రాథమికంగా చాలా బలంగా ఉన్నాయని మూడీస్‌ వెల్లడించింది.

రిజర్వ్‌ బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలు దేశీయ వృద్ధికి ఊతమిస్తూనే ఉంటాయని మూడీస్‌ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మందగమనం నెలకొనడం, బాహ్య డిమాండ్‌ మందగించడం వంటివి 2023లో భారత్‌ వృద్ధిపై ప్రతికూలం చూపనున్నాయని మూడీస్‌ తన నివేదికలో బాంబు పేల్చింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.