Begin typing your search above and press return to search.

మూడీఎస్ స్టేట్‌ మెంట్‌!...మోదీకి తిరుగులేదంతే!

By:  Tupaki Desk   |   17 Nov 2017 8:02 AM GMT
మూడీఎస్ స్టేట్‌ మెంట్‌!...మోదీకి తిరుగులేదంతే!
X
పెద్ద నోట్ల ర‌ద్దు - గూడ్స్ అండ్ స‌ర్వీస్ ట్యాక్స్‌(జీఎస్టీ) అమ‌లుతో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీపై న‌లు దిక్కుల నుంచి దాడి మొద‌లైన సంగ‌తి తెలిసిందే. కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ అయితే... ఈ రెండు అంశాల‌ను ఆస‌రా చేసుకుని మోదీపై సెటైర్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. విప‌క్షాల మాదిరే స్వ‌ప‌క్షంలోని య‌శ్వంత్ సిన్హా లాంటి కొంద‌రు నేత‌లు మోదీ నిర్ణ‌యాల‌ను బ‌హిరంగంగానే విమ‌ర్శిస్తున్నారు. ఈ త‌ర‌హా ప‌రిస్థితిలో ఏమాత్రం మొక్క‌వోని ధైర్యంతో అడుగులేస్తున్న మోదీ... త‌న ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల దేశానికే కాకుండా దేశ ప్ర‌జ‌ల‌కు చాలా లాభాలున్నాయంటూ త‌న మాట‌ను ప‌దే ప‌దే వ‌ల్లె వేస్తున్నారు. అయితే మోదీ మాట‌ల‌ను న‌మ్ముతున్న వారి సంఖ్య ఎంత ఉంద‌న్న విష‌యాన్ని ప‌క్క‌న‌బెడితే... సామాన్య జ‌నంలోనూ దీనిపై మిశ్ర‌మ స్పంద‌నే ల‌భిస్తోంది. మోదీ నిర్ణ‌యాన్ని కొంద‌రు తుల‌నాడుతుంటే... మ‌రికొంద‌రు మాత్రం ఆకాశానికెత్తేస్తున్నారు. విప‌క్షాలు - సొంత పార్టీ నేత‌లు - జ‌నం మాట ఎలా ఉన్నా... ఆయా దేశాల ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌కు రేటింగ్ ఇస్తూ.. ఆయా దేశాల ఆర్థిక బ‌లాలు - బ‌ల‌హీన‌త‌లను ఇట్టే చెప్పేసే అంత‌ర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీఎస్ మాత్రం మోదీకి బూస్ట్ ఇచ్చింద‌నే చెప్పాలి.

మోదీ తీసుకున్న ఈ రెండు సంస్క‌ర‌ణ‌ల కార‌ణంగా దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ బ‌లోపేతం అవుతోంద‌ని ఆ సంస్థ చాలా విస్ప‌ష్టంగా ఓ ఆస‌క్తిక‌ర ప్ర‌క‌ట‌న చేసింది. అంతేకాకుండా మోదీ తీసుకున్న ఈ రెండు నిర్ణ‌యాల కార‌ణంగా దేశీయ ఆర్థిక పరిస్థితి మ‌రింత‌గా మెరుగుప‌డింద‌ని, ఈ కార‌ణంగా 13 ఏళ్లుగా కొన‌సాగుతూ వ‌స్తున్న భార‌త్ రేటింగ్‌ను బీఏఏ3 నుంచి బీఏఏ2కు పెంచింది. అంటే మోదీ తీసుకున్నరెండు నిర్ణ‌యాల కార‌ణంగా భార‌త్ రేటింగ్ అమాంతంగా పెరిగింద‌న్న మాట‌. 13 ఏళ్లుగా రివ‌ర్స్ రేటింగ్‌ లో కొన‌సాగుతున్న భార‌త్ రేటింగ్‌లో ఎలాంటి మార్పు రాలేదు. ప్ర‌ఖ్యాత ఆర్థిక వేత్త‌గా పేరున్న మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ కూడా ఈ రేటింగ్‌ ను కించిత్ కూడా మార్చ‌లేక‌పోయారు. అయితే మోదీ విమ‌ర్శ‌ల జ‌డివాన ఎదురు వ‌స్తుంద‌ని తెలిసి కూడా ఈ రెండు నిర్ణ‌యాల‌ను తీసుకుని భార‌త్ రేటింగ్ పెంపుద‌ల‌కు కార‌ణ‌మ‌య్యార‌ని చెప్పాలి.

ఇదిలా ఉంటే... దేశ స్వల్పకాలిక స్థానిక కరెన్సీ రేటింగ్‌ను మూడీస్‌ పీ-3 నుంచి పీ-2కి మార్చింది. సంస్కరణల జోరుతో దేశంలో వాణిజ్య పరిస్థితి - ఉత్పాదకత మెరుగవుతాయని మూడీస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అభిప్రాయపడింది. భారత్‌ రేటింగ్‌ అవుట్‌ లుక్‌ ను సైతం స్టేబుల్‌ నుంచి పాజిటివ్‌ కు మార్చింది. జీఎస్టీని మూడీస్‌ ప్రశంసించింది. జీఎస్‌ టీ అమలుతో అంతరాష్ర్ట వాణిజ్యానికి ఎదురవుతున్న అవరోధాలు తొలిగి ఉత్పాదకత మరింత పెరుగుతుందని పేర్కొంది. అయితే భారత్‌కున్న అధిక రుణ భారం దేశ పరపతి ప్రతిష్టకు ప్రతికూలమని ఆ సంస్థ‌ ఆందోళన వ్యక్తం చేసింది. మోదీ ఆధ్వ‌ర్యంలో దేశంలో న‌మోదవుతున్న సంస్కరణల వేగం... పెరుగుతున్న రుణ భారం రిస్క్‌ లను తగ్గించగలవని మూడీఎస్ అభిప్రాయ‌ప‌డింది. ఇక గత ఆర్థిక సంవత్సరంలో భారత్‌ జీడీపీ వృద్ధి 7.1 శాతం కాగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడీపీ వృద్ధి 6.7 శాతానికి పరిమితమవుతుందని మూడీస్‌ అంచనా వేసింది.