Begin typing your search above and press return to search.

కుక్కకి అరుదైన గౌరవం ...వెటర్నరీ మెడిసిన్ లో డాక్టరేట్ !

By:  Tupaki Desk   |   20 May 2020 12:30 AM GMT
కుక్కకి అరుదైన గౌరవం ...వెటర్నరీ మెడిసిన్ లో డాక్టరేట్ !
X
ఓ కుక్కకి ఎవరికీ దక్కని అరుదైన గౌరవం దక్కింది. అదేమిటి అంటే కుక్కకు గౌరవప్రద డాక్టరేట్ పట్టా ఇచ్చారు. ఏంటి నమ్మడం లేదా ? అయినా నమ్మితీరాల్సిందే. కొన్ని నమ్మలేని విషయాలని కూడా నమ్మకతప్పదు. అమెరికాలోని వర్జీనియా టెక్ యూనివర్సిటీ తమ స్టాఫ్ లో ఒకటిగా భావిస్తున్న మూస్ డెవిస్ అనే శునకానికి వెటర్నరీ మెడిసిన్ లో డాక్టరేట్ పట్టా ప్రదానం చేసి గౌరవించింది. ఇటీవల గ్రాడ్యుయేషన్ సెరిమనీలో జరిగిన ఈ అపూర్వ ఘటన గురించి ఆన్ లైన్ ద్వారా వెల్లడించింది.

యూనివర్సిటీ విద్యార్థులకు, సిబ్బందికి సేవ చేస్తూ తన కెరీర్ ను గడిపిన ఈ ఆరేళ్ళ శునకం కృషిని గుర్తిస్తున్నామని యూనివర్సిటీ వెల్లడించింది. లాబ్రడార్ జాతికి చెందిన ఈ కుక్క 2014 నుంచి ఈ విశ్వవిద్యాలయంలోని కుక్ కౌన్సెలింగ్ సెంటర్ లో ఉంటోంది. ఈ వర్సిటీలో ఎనిమల్ అసిస్టెడ్ థెరపీ ప్రోగ్రామ్ కో-ఆర్డినేటర్, కౌన్సెలర్ కూడా అయిన ట్రెంట్ డెవిస్ దీని యజమాని. తన శారీరక అనారోగ్యం గురించి కూడా పట్టించుకోకుండా ఈ శునకం ఎప్పుడూ చలాకీగా ఉంటుందని, విద్యార్థులను, స్టాఫ్ ను సంతోషంగా ఉంచుతుందని ఆయన చెబుతున్నారు.

ఏవేవో కారణాలతో, డిప్రెషన్ కి గురై ఆత్మహత్య చేసుకోవాలనుకునే స్టూడెంట్స్ కో, లేదా సిబ్బందికో వారిని ఆ ఆలోచన నుంచి తప్పించడానికి నిర్వహించే కౌన్సెలింగ్ సెషన్స్ లో ఈ కుక్క కూడా పాల్గొందట. అలా ఇప్పటివరకు నిర్వహించిన 7,500 కౌన్సెలింగ్ సెషన్స్ లో మూస్ పార్టిసిపేట్ చేసిందని, అలాగే… ఇలాంటి 500 ఔట్ రీచ్ ఈవెంట్లకు కూడా హాజరయిందని ట్రెంట్ తెలిపారు. ఇంతటి చరిత్ర ఉన్న ఈ శునకానికి ప్రోస్టేట్ క్యాన్సర్ సోకిందని, రేడియేషన్, ఖేమోథెరపీ చికిత్సలు కూడా చేయించుకుందని ఆయన విచారంగా చెప్పారు. అయినా ఏ పనీ లేనప్పుడు ఈ శునకం స్విమ్మింగ్ చేస్తూ, టగ్ ఆఫ్ వార్ ఆట ఆడుతూ అసలు తనలో ఏ అనారోగ్యమూ లేనట్టే కనిపిస్తుందన్నారు.