Begin typing your search above and press return to search.

గోవా ఎయిర్ పోర్టు స్పెషల్ సరే.. ఎవరి చేతిలోకి వెళ్లనుంది?

By:  Tupaki Desk   |   12 Dec 2022 6:30 AM GMT
గోవా ఎయిర్ పోర్టు స్పెషల్ సరే.. ఎవరి చేతిలోకి వెళ్లనుంది?
X
దేశంలో కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. తాజాగా గోవాలోని మోపాలో ఏర్పాటు చేసిన కొత్త ఎయిర్ పోర్టును ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించటం తెలిసిందే. ఈ ఎయిర్ పోర్టుకు దివంగత గోవా ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ పేరును పెట్టారు. దేశంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతంగా చెప్పాల్సి వచ్చినప్పుడు గోవా పేరును అత్యధికులు చెబుతుంటారు. అలాంటి గోవాకు మరిన్ని హంగులు అద్దేందుకు వీలుగా ఇప్పటికే ఉన్న ఒక ఎయిర్ పోర్టుకు అదనంగా మరో ఎయిర్ పోర్టును ఏర్పాటు చేయటం.. దాన్ని తాజాగా ప్రారంభించటం తెలిసిందే.

దాదాపు రూ.2870 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు.. గోవా ఉత్తర ప్రాంతానికి వచ్చే పర్యాటకులకు మరింత సౌకర్యంగా ఉండనుంది. ఈ ఎయిర్ పోర్టుతో స్థానికంగా టూరిజం మరింత డెవలప్ అవుతుందన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ కొత్త ఎయిర్ పోర్టుతో ఏడాదికి 44 లక్షల మంది ప్రయాణించేందుకు వీలుగా దీన్ని సిద్ధం చేశారు. అంటే.. నెలకు దగ్గర దగ్గర నాలుగు లక్షల మంది వరకు ప్రయాణిస్తారని భావిస్తున్నారు. అయితే.. భవిష్యత్తులో ఈ ఎయిర్ పోర్టు ద్వారా ఏటా కోటి మంది వరకు ప్రయాణించేలా దీన్ని డిజైన్ చేయటం గమనార్హం.

ఇప్పటికే గోవాలో డబోలిమ్ ఎయిర్ పోర్టు ఉందన్న సంగతి తెలిసిందే. ఈ ఎయిర్ పోర్టు ద్వారా ఏటా 85 లక్షల మంది ప్రయాణిస్తుండటం తెలిసిందే. దీనికి బదులుగా మరో ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావటం గోవాకు మరింత మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇప్పటికే ఉన్న డబోలిమ్ ఎయిర్ పోర్టులో కార్గో సేవలకు అవకాశం లేదు. తాజాగా ఏర్పాటు చేసిన మోపా ఎయిర్ పోర్టులో మాత్రం ఆ వసతిని ఏర్పాటు చేశారు.

కొత్త ఎయిర్ పోర్టు అందుబాటులోకి రావటం ఒక ఎత్తు అయితే.. రానున్న రోజుల్లో ఈ ఎయిర్ పోర్టు ఎవరి వశం అవుతుందన్న చర్చ మొదలైంది. దీనికి కారణం.. దేశ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఎయిర్ పోర్టులను ప్రభుత్వంతో పాటు ప్రైవేటు భాగస్వామ్యంతో నిర్మిస్తున్నారు. మోపా ఎయిర్ పోర్టు విషయానికి వస్తే.. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు జీఎంఆర్ గోవా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్ పేరుతో పీపీపీ భాగస్వామ్యంతో దీన్ని నిర్మించారు.

ఇంతవరకు బాగానే ఉన్నా.. కొన్ని పేరున్న ఎయిర్ పోర్టుల యాజమాన్య హక్కుల మార్పుల విషయంలో తెర వెనుక చోటు చేసుకున్న పరిణామాలు కార్పొరేట్ ప్రపంచంలో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే. తాజాగా జీఎంఆర్.. గోవా రాష్ట్రసర్కారు నిర్మించిన ఈ ఎయిర్ పోర్టు బాగస్వామ్యం ఇలానే కొనసాగుతుందా? లేదంటే.. కొన్ని ఎయిర్ పోర్టుల యాజమాన్యాలు అనూహ్యంగా మారిపోయిన జాబితాలోకి మోపా కూడా చేరుతుందా? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. దీనికి సమాధానం కాలం సరిగ్గా చెబుతుందని చెప్పాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.