Begin typing your search above and press return to search.

జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ 'కరోనా' కుట్ర: మంత్రి

By:  Tupaki Desk   |   27 April 2020 1:15 PM GMT
జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ కరోనా కుట్ర: మంత్రి
X
ఈ ప్రపంచంలో.. ఇంతటి కరోనా టైంలో అన్నింటికంటే ఇప్పుడు విలువైనది ప్రాణం మాత్రమే..అందుకే ఇటలీలో కోటీశ్వరులైన వృద్ధులు కరోనాతో మమ్మలను డబ్బు కాపాడడం లేదని నోట్ల కట్టలను రోడ్లపై విసిరేశారట.. కరోనా సోకితే ప్రాణాలే పోతాయి.. అలాంటిది కొందరు పనిగట్టుకొని ప్రాణాలకు తెగించి దాన్ని వ్యాపింపచేసే పనిలో పడతారా? అసలు అలాంటి ప్రాణాలు పోయే ధైర్యం ఎవరైనా చేస్తారా? కానీ చేస్తారు అని అంటున్నారు ఏపీ మంత్రి మోపిదేవీ వెంకట రమణ.. అవును ఆయన చేసిన విమర్శలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.

కరోనా వ్యాప్తి నేపథ్యంలో తాజాగా మీడియా ముందుకొచ్చిన ఏపీ మంత్రి మోపిదేవి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొద్దిరోజులుగా కరోనా వ్యాప్తిపై వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న టీడీపీ నేతలపై ఆయన దుమ్మెత్తి పోశారు. ఏపీలో కరోనా వ్యాప్తికి టీడీపీ కార్యకర్తలే కారణమనే అనుమానం కలుగుతోందని మంత్రి మోపిదేవి ఆరోపించారు.

అంతటితో ఆగకుండా టీడీపీ కార్యకర్తలే స్లీపర్ సెల్స్ లా మారి గ్రామాల్లో కరోనాను వ్యాప్తి చేస్తున్నారని మంత్రి మోపిదేవీ ఆరోపించారు. సీఎం జగన్ కు వ్యతిరేకంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఈ విధంగా కుట్ర పన్నుతున్నారనే సందేహాలు కలుగుతున్నాయని ఆరోపించారు.

మంత్రి మోపిదేవికి టీడీపీపై ఆ కార్యకర్తలపై ఎంత అపనమ్మకం ఉన్నా.. ఈరోజుల్లో కరోనా అంటేనే జనాలు ఆమడ దూరం పరిగెడుతున్నారు. సోకితే ప్రాణాలు పోయే ఈ మహమ్మారిని పనిగట్టుకొని ఎవరూ వ్యాపింపచేయరు. అలాంటిది టీడీపీ నేతలు కేవలం చంద్రబాబు కోసం.. వైసీపీ ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడం కోసం ప్రాణాలతో చెలగాటం చేస్తారా అన్నది చర్చనీయాంశమవుతోంది. అసలు ఇలాంటి ధైర్యం ఎవరైనా చేస్తారా? మంత్రి మోపిదేవి వ్యాఖ్యలపై ఇప్పుడు సొంత వైసీపీలోనూ తీవ్రదుమారం రేపుతోంది.. విమర్శల వరకూ ఓకే కానీ.. మరి ఇలా రాజకీయం కోసం ఇంతలా విమర్శలు చేయాలా అని నేతలు చెవులు కొరుక్కుంటున్నారు.