Begin typing your search above and press return to search.

కచ్చలూరు గోదావరి.. మృత్యుకుహరం

By:  Tupaki Desk   |   15 Sep 2019 11:00 AM GMT
కచ్చలూరు గోదావరి.. మృత్యుకుహరం
X
గోదావరి నదిలో అదో మృత్యుకుహరం.. అక్కడ ఏ బోటు వెళ్లినా ప్రమాదపుటంచుల వరకూ వెళుతుంది. తేడా వస్తే మునిగిపోవడం ఖాయం. గోదారిలో అత్యంత భయంకర భయానక ప్రదేశంగా కచ్చలూరు వద్ద గోదావరిని స్థానిక మత్య్సకారులు పేర్కొంటారు. తాజాగా గోదావరిలో మునిగిన పర్యాటక పడవ కూడా ఇదే కచ్చలూరు గోదావరిలో బోల్తాపడడం గమనార్హం.

దాదాపు 61మందితో పాపికొండలకు వెళుతున్న రాయల్ పున్నమి బోటు ఆదివారం గండి పోచమ్మ ఆలయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే గోదారిలో మునిగిపోయి ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

కచ్చలూరులో గోదావరి ప్రస్తుతం 80 అడుగుల లోతులో నీరు ఉదృతంగా ప్రవహిస్తుంది. ఎగువున పడ్డ వర్షాలతో దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహం గోదావరిలో ఉంది. కచ్చలూరు గోదావరిలో ఎక్కువగా సుడిగుండాలు వస్తుంటాయి. వాటి ధాటికి పడవలు నిలవలేవు. చాలా జాగ్రత్తగా వెళితేనే బతికి బట్టగట్టగలరు..

కచ్చలూరులో గోదావరి నది సుడులు తిరుగుతూ ప్రవహిస్తుందని మత్స్యకారులు చెబుతున్నారు. అందుకే ఇక్కడ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. 1964లో కచ్చలూరులోనే ఉదయ్ భాస్కర్ అనే బోటు మునిగి 60 మంది మృతిచెందారు. గోదావరి ప్రమాదాల్లో ఇదే ఇప్పటివరకు అత్యంత విషాధకరమైనది. ఈ ఘటన తర్వాత ఝన్సీరాణి అనే బోటు మునిగి 8మంది మృతిచెందారు. ఈ రెండు ప్రమాదాలు కచ్చలూరులోనే చోటుచేసుకోవడం గమనార్హం.

ఆది వారం కూడా ఇదే కచ్చలూరులో 61 మంది ప్రయాణిస్తున్న బోటు మునిగింది. 27మంది లైఫ్ జాకెట్లు వేసుకున్న వారిని కాపాడారు. ఐదు మృతదేహాలు లభించాయి.. 41 మంది గల్లంతయ్యారు.ఇలా కచ్చలూరు అనేది గోదావరిలో మృత్యుకుహరంగా మారిపోయింది.