Begin typing your search above and press return to search.

మ‌రింత మార్పు.. టీ20ల‌కే బీసీసీఐ ప్రాధాన్య‌త‌!

By:  Tupaki Desk   |   21 Sep 2021 7:15 AM GMT
మ‌రింత మార్పు.. టీ20ల‌కే బీసీసీఐ ప్రాధాన్య‌త‌!
X
ఇటీవ‌లే ఇంగ్లండ్ తో జ‌ర‌గాల్సిన ఐదో టెస్టు మ్యాచ్ ను అర్ధాంత‌రంగా ర‌ద్దు చేసుకుంది బీసీసీఐ. ఈ విష‌యంలో క‌రోనా ప్ర‌భావం కూడా ఉంద‌న్నా.. మ్యాచ్ ను అలా అర్ధాంత‌రంగా ర‌ద్దు చేయ‌డం వెనుక టెస్టు మ్యాచ్ ల‌పై బీసీసీఐ అనాస‌క్తి కూడా కార‌ణం అనే మాట వినిపిస్తూ ఉంది. ఒక‌వైపు అంత‌ర్జాతీయ స్థాయిలో టెస్టు క్రికెట్ కు ఆద‌ర‌ణ త‌గ్గుతూ ఉంద‌నే విశ్లేష‌ణ‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌స్తుత బిజీ లైఫ్ స్టైల్లో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ల‌ను చూడ‌టానికి కొంద‌రికి అనాస‌క్తి ఉండ‌వ‌చ్చు.

అయితే టెస్టులు కూడా మజాగానే సాగుతున్నాయి. డ్రాల శాతం బాగా త‌గ్గింది. ఫ్యాన్స్ లో టెస్టుల గురించి బాగా చ‌ర్చ జ‌రుగుతూ ఉంది. బీసీసీఐ కూడా ఇన్నాళ్లూ టెస్టుల‌కు బాగానే ప్రాధాన్య‌త‌ను ఇచ్చిన‌ట్టుగా క‌నిపించింది. అయితే.. మొన్న‌టి టెస్టు ర‌ద్దుతో పాటు, తాజాగా ప్ర‌క‌టించిన ఇత‌ర సీరిస్ ల షెడ్యూల్ తో బీసీసీఐకి టెస్టుల‌పై ఆస‌క్తి త‌గ్గిందేమో అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

రానున్న ఏడాదికి సంబంధించి టీమిండియా స్వ‌దేశంలో ఆడే మ్యాచ్ ల వివ‌రాల‌ను బీసీసీఐ ప్ర‌క‌టించింది. ఇందులో కేవ‌లం నాలుగు టెస్టులున్నాయి. ఇక వ‌న్డేలు అయితే మూడే మూడు. అదే టీ20ల విష‌యానికి వ‌స్తే మొత్తం 14 మ్యాచ్ ల‌ను టీమిండియా స్వ‌దేశంలో ఆడ‌నుంది. నాలుగు టెస్టుల్లో రెండు న్యూజిలాండ్ తో , రెండు శ్రీలంక‌తో ఆడ‌నుంద భార‌త జ‌ట్టు. వ‌న్డేలు మూడు వెస్టిండీస్ తో ఉంటాయి. సౌతాఫ్రికాతో కేవ‌లం టీ20 మ్యాచ్ ల‌ను మాత్ర‌మే ఆడ‌నుంది.

ఇలా ఆగ్ర‌తాంబూలం టీ20ల‌కే ఇస్తోంది భార‌త క్రికెట్ బోర్డు. ఇప్ప‌టికే ఐపీఎల్ రూపంలో టీ20ల‌కు బీసీసీఐ అపార‌మైన ప్రాధాన్య‌త‌ను ఇస్తోంది. అంత‌ర్జాతీయ సీరిస్ ల‌ను ర‌ద్దు చేసుకుని అయినా ఐపీఎల్ కు ఎలాగోలా టైమ్ ఇస్తోంది. ఇక విదేశాల‌కు వెళ్లిన‌ప్పుడు ఇండియా ఆడే టీ20లు ఎలాగూ ఉండ‌నే ఉంటాయి. కానీ, ఇండియాకు విదేశీ జ‌ట్లు వ‌చ్చిన‌ప్పుడు కూడా.. టీ20ల‌కే బోర్డు ఎక్కువ ప్రాధాన్య‌త‌ను ఇస్తూ ఉంది. ఏకంగా 14 టీ20లు అంటూ త‌మ ప్రాధాన్య‌త ఏమిటో బీసీసీఐ చాటి చెప్పుకున్న‌ట్టుగా అవుతోంది. మ‌రి ఇప్పుడే ఇలా అయితే.. మ‌రింత ముందున బీసీసీఐ టెస్టుల‌కు మ‌రింత ప్రాధాన్య‌త‌ను త‌గ్గించి వేస్తుందేమో!