Begin typing your search above and press return to search.

జయలలిత మృతిపై మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న ఆ ఆడియో, వీడియోలు!

By:  Tupaki Desk   |   20 Oct 2022 11:55 AM GMT
జయలలిత మృతిపై మరిన్ని అనుమానాలు.. వైరలవుతున్న ఆ ఆడియో, వీడియోలు!
X
తమిళనాడు ముఖ్యమంత్రిగా, అన్నాడీఎంకే అధినేత్రిగా ఉంటూ జయలలిత కన్నుమూసిన సంగతి తెలిసిందే. అనారోగ్యంతో నాడు అపోలో ఆస్పత్రిలో దాదాపు నెల రోజులకుపైగానే జయలలిత చికిత్స తీసుకున్నారు. జయలలిత మరణించిన వ్యవహారానికి సంబంధించి గత అన్నాడీఎంకే ప్రభుత్వం జస్టిస్‌ ఆర్ముగస్వామి కమిషన్‌ను విచారణకు నియమించింది.

ఈ కమిషన్‌ జయలలిత మరణంపై దాదాపు 150 మందిని విచారించి తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు నివేదికను అందజేసిన సంగతి తెలిసిందే. ప్రధానంగా జయ నెచ్చెలి శశికళతోపాటు మరో ముగ్గురిపై అనుమానాలు ఉన్నాయని ఆర్ముగస్వామి కమిషన్‌ రిపోర్టులో పేర్కొంది.

దీంతో తమిళనాడు మాజీ సీఎం, దివంగత జయలలిత మరణంపై కమిషన్‌ ఇచ్చిన రిపోర్టు ఆ రాష్ట్రంలో హీట్‌ పెంచుతోంది. జయ మరణంలో ముఖ్యంగా జయ నెచ్చెలి శశికళ, నాటి ఆరోగ్య శాఖ మంత్రి విజయ్‌భాస్కర్, జయ వ్యక్తిగత వైద్యుడు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్‌రావులపై అనుమానం వ్యక్తం చేసింది. వీరిపై దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వానికి సూచించింది.

ఇప్పుడు ఈ వ్యవహారం తమిళనాడులో కలకలం రేపుతుండగా ఆర్ముగం కమిషన్‌ నివేదికతో మరిన్ని కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. ముఖ్యంగా అపోలో ఆస్పత్రిలో జయలలితకు సరైన చికిత్స అందలేదనే విషయాన్ని అవి నిర్ధారించేలా ఉండటం గమనార్హం. జయలలిత ఆస్పత్రిలో బెడ్‌ పై ఉన్న సమయంలో మాట్లాడినట్లుగా చెబుతున్న కొన్ని మాటలకు సంబంధించిన ఆడియోలు సోషల్‌ మీడియాలో లీక్‌ కావడం సంచలనం సృష్టిస్తోంది.

కాగా సోషల్‌ మీడియాలో పలువురు పోస్టు చేసిన ఆడియోలు ప్రకారం.. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో జయలలిత తన గదిలో ఉన్న డాక్టర్లపై అసహనం వ్యక్తం చేశారు. తాను పిలిస్తే ఎందుకు రావడం లేదని డాక్టర్లపై జయలలిత ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా ఈ ఆడియోల్లో ఉందని అంటున్నారు. మరోవైపు అదే సమయంలో జయలలిత దగ్గుతూ మాట్లాడినట్టు ఉంది. తాను ఇంతలా దగ్గుతూ బాధపడుతుంటే పట్టించుకోవడం లేదంటూ వైద్యులపై మండిమడ్డట్టుగా ఈ ఆడియోల్లో ఉంది.

అలాగే జయలలిత చికిత్సకు సంబంధించి వివరాలు వెల్లడించేందుకు లండన్‌ డాక్టర్‌ రిచర్డ్‌ బేలే మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. అది పూర్తయ్యాక అక్కడే ఉన్న జయలలిత నెచ్చెలి శశికళతో మాట్లాడారు. ఆ వీడియో కూడా ఇప్పుడు వైరల్‌ అవుతుండటం గమనార్హం. ఈ సందర్భంగా రిచర్డ్‌ బేలే చేసిన వ్యాఖ్యలు కూడా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

జయలలిత ఆరోగ్య పరిస్థితిపై రిచర్డ్‌ బేలే వివరిస్తుంటే.. మధ్యలో జోక్యం చేసుకున్న శశికళ జయలలితను విదేశాలకు పంపడం అవసరమా అని ప్రశ్నిస్తున్నట్టు ఆ వీడియో ఉంది. ఆమె ఆరోగ్యం కుదుటపడాలంటే విదేశాలకు వెళ్లాలని చెప్పానని.. ఇందుకు జయలలిత అంగీకరించారని శశికళతో చెబుతున్నట్టు ఈ వీడియో ఉంది. దీంతో జయలలిత మృతిపై మరిన్ని అనుమానాలు ముసురుకుంటున్నాయి. దీంతో ఈ వీడియో కూడా సంచలనం సృష్టిస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.