Begin typing your search above and press return to search.

ఆ ఇర‌వై మీద జీఎస్టీ మోత త‌గ్గించే ప్రోగ్రామ్‌

By:  Tupaki Desk   |   8 Aug 2017 5:05 AM GMT
ఆ ఇర‌వై మీద జీఎస్టీ మోత త‌గ్గించే ప్రోగ్రామ్‌
X
దేశంలో పెను ప‌న్ను సంస్క‌ర‌ణ‌గా అభివ‌ర్ణిస్తున్న జీఎస్టీ వ‌చ్చేసి రెండు నెల‌ల‌కు పైనే అయ్యింది. జీఎస్టీతో ప‌న్నుపోటు త‌గ్గుతుంద‌ని.. గ‌త ప‌న్నుల విదానం కంటే బాదుడు ఉండ‌ద‌న్న ప్ర‌చారం జోరుగా సాగింది. అయితే.. వాస్త‌వ దృక్ఫ‌దంతో చూస్తే.. జీఎస్టీకి ముందు ఎలాంటి ప‌రిస్థితులు ఉన్నాయో.. ఇప్పుడు కూడా ఇంచుమించు అదే విధానాలు అమ‌ల‌వుతున్నాయ‌న్న భావ‌న ప‌లువురిలో వ్య‌క్త‌మ‌వుతోంది.

గ‌తంలో ప‌న్ను లేకుండా బిల్లు ఇచ్చే వారు కాస్తా.. జీఎస్టీ పేరు చెప్పి కుద‌ర‌దంటే కుద‌ర‌దంటూ బాదేస్తున్నార‌న్న విమ‌ర్శలు వినిపిస్తున్నాయి. జీఎస్టీకి ముందు హోట‌ళ్ల‌లో బాదుడు ఓ ప‌ద్ధ‌తిగా ఉంటే.. ఇప్పుడ‌ది మారి.. 18 శాతంగా మారింది. ఇది.. ప్ర‌జ‌ల మీద పెను భారంగా మారింది. పార్శిల్ మీద కూడా 18 శాతం జీఎస్టీ పోటు త‌ప్ప‌ని దుస్థితి.

ఇలా.. వివిధ రంగాల మీద జీఎస్టీ భారం స‌గ‌టు జీవికి చుక్క‌లు చూపిస్తోంది. పార్టీలు చేసుకొని మ‌రీ జీఎస్టీకి వెల్ కం చెప్పినంత సంబరంగా మాత్రం జీఎస్టీ లేద‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. జీఎస్టీ ప‌న్నురేటును నిర్ణ‌యించే విష‌యంలో కొన్ని వ‌స్తువుల మీద అవ‌క‌త‌వ‌క‌లు చోటు చేసుకున్నాయ‌ని వాటిని స‌రిదిద్దాల‌ని జీఎస్టీ ఫిట్ మెంట్ క‌మిటీ జీఎస్టీ మండ‌లికి సూచ‌న చేసింది. ఇందులో భాగంగా దాదాపు 20కి పైగా వ‌స్తువుల‌కు ప‌న్నురేటు త‌గ్గ‌నుంద‌ని చెబుతున్నారు. అదే జ‌రిగితే.. ప‌న్ను భారం త‌గ్గే అవ‌కాశం ఉంది.

ఇదిలా ఉంటే.. బ్రాండెడ్ ఆహార‌ప‌దార్థాల‌పై జీఎస్టీలో ప‌న్ను లేని విష‌యం తెలిసిందే. దీన్ని అస‌రా చేసుకొని కొంద‌రు ప‌న్ను ఎగ్గొట్టేందుకు వీలుగా బ్రాండెడ్ ఆహార‌పదార్థాల్నిఉప‌సంహ‌రించుకొని నాన్ బ్రాండెడ్ గా తీసుకొస్తున్నాయి. దీన్ని గుర్తించిన జీఎస్టీ క‌మిటీ.. అలాంటి ప‌ప్పులు ఉడ‌క‌కుండా చ‌ర్య‌లు షురూ చేసింది.

మే 15 నాటికి ఏ ఆహార ఉత్ప‌త్తులు బ్రాండెడ్ జాబితాలో ఉండేవో వాటిని అదే రీతిలో కంటిన్యూ చేయాల‌ని.. ఒక‌వేళ చేయ‌కున్నా 5 శాతం ప‌న్ను ప‌క్కా చేయాలంటూ ఫిట్ మెంట్ క‌మిటీ.. జీఎస్టీ మండ‌లికి సిఫార్సు చేసింది. దీనిపై అధికారిక నిర్ణ‌యం తీసుకోవాల్సి ఉంది. ఏమైనా.. దాదాపు 20 వ‌స్తువ‌ల‌పైనా.. వ‌స్తు ఉత్పత్తుల‌పైనా జీఎస్టీ పోటు కొంత‌లో కొంత త‌గ్గే అవ‌కాశ‌మైతే ఉంద‌ని చెబుతున్నారు. బాదుడు జాబితా నుంచి కొన్ని వ‌స్తువులు.. వ‌స్తు ఉత్ప‌త్తులైనా బ‌య‌ట‌కు రానున్నాయ‌న్న మాట‌.