Begin typing your search above and press return to search.

దాయాది దేశంలో మనోళ్లు ఎంతమందో తెలిస్తే షాకే

By:  Tupaki Desk   |   8 March 2017 5:21 PM GMT
దాయాది దేశంలో మనోళ్లు ఎంతమందో తెలిస్తే షాకే
X
వెళ్లాలని అనుకుంటే.. అమెరికాకు వెళతారు. అవకాశం లేకుంటే ఇంకో దేశానికి వెళతారు. బతకటానికి ఏ దేశానికి వెళితే మాత్రం తప్పేముంది? అనుకోవటం కామన్. ఆ మాటకు వస్తే.. నిత్యం అతలాకుతలం అయ్యే అప్ఘనిస్థాన్ కు కూడా వెళ్లే భారతీయులకు కొదవ ఉండదు. మిగిలిన దేశాలన్నీ ఒక ఎత్తు అయితే.. దాయాది పాకిస్థాన్ ముచ్చటం కాస్త భిన్నమని చెప్పాలి. అసలు పాకిస్థాన్ కు వెళ్లే భారతీయులు ఉంటారా? అని కొందరు ప్రశ్నిస్తారు కూడా. అయితే.. తాజా ముచ్చట తెలిస్తే షాక్ తినాల్సిందే. నిజమా అని నోరు వెళ్లబెట్టాల్సిందే.

తాజా అధికారిక సమాచారం ప్రకారం.. అమెరికాలో కంటే మనోళ్లు పొరుగున ఉన్న దాయాది దేశమైన పాకిస్థాన్ లో ఉంటున్న కొత్త విషయం బయటకు వచ్చింది. అగ్రరాజ్యమైన అమెరికాలో కంటే ఎక్కువమంది వలసదారులు పాక్ లో ఉన్నట్లుగా ‘‘ప్యూ’’ పరిశోధక కేంద్రం తన తాజా నివేదికలో వెల్లడించింది. భారతదేశం నుంచి వేర్వేరుదేశాలకు వెళ్లే వలసదారుల్లో ఏకంగా యాభై శాతం మంది యూఏఈ.. పాకిస్థాన్.. అమెరికాల్లోనే ఉన్నారని పేర్కొంది.

అత్యధికంగా యూఏఈలో 35 లక్షల మంది భారతీయులు నివసిస్తుండగా.. అమెరికా కంటే ఎక్కువ మంది పాకిస్థాన్ లోనే ఎక్కువ మంది ఉంటున్నట్లుగా పేర్కొంది. పాకిస్థాన్ లో భారత వలసదారులు 20 లక్షల మంది ఉన్నట్లుగా వెల్లడించింది. పాకిస్థాన్ కు ఇంత మంది భారతీయులు వలస వెళుతున్నారన్న సందేహం కలగొచ్చు కానీ.. అది నిజమని సదరు సంస్థ పేర్కొంటోంది.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వలసదారుల్లో ప్రతి 20 మందిలో ఒకరు కచ్ఛితంగా భారతీయులేనన్న కొత్త విషయాన్ని కూడా పేర్కొంది. భారత్ లో పుట్టిన వారిలో ఒక శాతం మంది మాత్రమే భారత్ కు బయట దేశాల్లో నివసిస్తున్నట్లుగా పేర్కొంది. చూసేందుకు ఒక శాతం చాలా తక్కువగా అనిపిస్తున్నా.. 132 కోట్ల మంది ప్రజలున్న దేశంలో ఒక శాతం అంటే.. చాలా భారీ సంఖ్య అనే చెప్పాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/