Begin typing your search above and press return to search.

తాడేపల్లి దారుణంపై మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు

By:  Tupaki Desk   |   21 Jun 2021 3:34 AM GMT
తాడేపల్లి దారుణంపై మరిన్ని షాకింగ్ నిజాలు బయటకు
X
పెను సంచలనంగా మారిన తాడేపల్లి అత్యాచార ఉదంతానికి సంబంధించి మరిన్ని షాకింగ్ అంశాలు బయటకు వచ్చాయి. ఈ దారుణంలో పాలు పంచుకున్నది ఎంతమంది? వారేం చేశారు? బాధిత మహిళ పోలీసులకు ఏం చెప్పారు? లాంటి అంశాలు వెల్లడయ్యాయి. తమను ఎంతలా హింసించింది కూడా బాధితులు ఇద్దరూ చెప్పారు. షాకింగ్ గా ఉన్న వారి మాటలు తెలిసినంతనే.. నిందితుల్ని దారుణంగా శిక్షించాల్సిందేనన్న మాట అందరి నోట వినిపిస్తోంది.

బాధితురాలు నర్సింగ్ విద్యార్థినిగా గుర్తించారు. ట్రైనింగ్ లో భాగంగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నారు. తనకు కాబోయే భర్తతో కలిసి విజయవాడ నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా సీతానగరం పుష్కర ఘాట్ వైపునకు వచ్చారు. లోపలకు వెళ్లి ఇసుక తిన్నెలపై కూర్చున్నారు. అప్పటికే అక్కడ ఉన్న ఇద్దరు దుండగులు వీరిని బెదిరించారు. భౌతిక దాడికి దిగినట్లుగా చెబుతున్నారు.

కాబోయే భర్త మెడపై బ్లేడ్ ఉంచి.. బాధితురాలిని ఈడ్చుకెళ్లారు. ఆమెను బెదిరించారు. ఆమె చున్నీతో కాళ్లు చేతులు కట్టేశారు. ఇసుకలో ఆమె ముఖాన్ని కుక్కేసి దారుణానికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. మొదట ఒకడు ఆమెపై బలవంతంగా అత్యాచారం చేయగా.. అనంతరం మరొకరుడు అత్యాచారం చేశాడు. ఆమెను అత్యాచారం చేసే సమయంలో.. కాబోయే భర్త మెడ మీద బ్లేడ్ ఉంచి చంపేస్తానని బెదిరించారు. ఈ ఉదంతంలో బాధితురాలు పెద్ద ఎత్తున కేకలు వేసినప్పటికీ.. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా ఉండటంతో ఎవరికి వినిపించలేదని చెబుతున్నారు.

యువ జంట వద్ద ఉన్న పర్సు.. సెల్ ఫోన్ తో పాటు బాధితురాలి చెవిదిద్దులు దోచుకొని నిందితులు పారిపోయారు. నాటు పడవలో వారు వెళ్లినట్లుగా చెబుతున్నారు. దారుణ ఉదంతం జరిగిన కాసేపటికి తేరుకున్న వీరు పోలీసులకు జరిగిన దారుణం గురించి చెప్పారు. వైద్య పరీక్షల కోసం బాధితురాలిని గుంటూరు జేజేహెచ్ కు తరలించారు. ప్రస్తుతం ఆమె గొంతు నొప్పితో బాధ పడుతుందని.. ఆమె మాట్లాడలేకపోతున్నట్లు చెబుతున్నారు.

ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం నిందితులు బ్లేడ్ బ్యాచ్ అయి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. బాధితురాలి ఫోన్ కు పలువురు అనుమానితుల ఫోటోల్ని పంపుతూ.. నిందితుడు ఎవరన్నది గుర్తించే ప్రయత్నంలో పోలీసులు ఉన్నారు. ఈ దారుణానికి కారణమైన వారిని పట్టుకునేందుకు పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. రక్తం ఉడికేలా సాగిన ఈ దారుణానికి కారణమైన నిందితుల్ని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని.. వారిని తీవ్రంగా శిక్షించాలన్న డిమాండ్ పలువురు నోట వినిపిస్తోంది.