Begin typing your search above and press return to search.

ఏపీలో 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్ ...కారణం ఇదే !

By:  Tupaki Desk   |   30 Jan 2020 5:59 AM GMT
ఏపీలో 7 లక్షలకి పైగా పెన్షన్లు కట్ ...కారణం ఇదే !
X
ఏపీ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఎవరికీ అర్థంకావడం లేదు. ఒక్కొక్కసారి ప్రజల సంక్షేమమే మా ప్రభుత్వం యొక్క ప్రధాన లక్ష్యం అంటుంది..అంతలోనే ప్రజలకి షాకులిస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది. గత ఏడూ నెలల కాలంలో ఇటువంటి ఘటనలు ఎన్నో జరిగాయి. తాజాగా మరోసారి జగన్ సర్కార్ ఇదే వ్యవహారశైలితో ముందుకుపోతుంది. కొత్తగా ఏపీ ప్రభుత్వం పింఛన్ పథకం పై సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. సామాజిక పింఛన్లు పొందేవారి వయోపరిమితిని ప్రభుత్వం 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించింది. ఈ నేపథ్యంలో కొత్తగా ఆరు లక్షలమందిని ఈ పథకంలో చేర్చింది. కొత్తగా ఆరు లక్షల మందికి పింఛన్ మంజూరు చేసినట్టే చేసి ..ఏవో కొన్ని కారణాలతో పాతవారిలో ఏకంగా ఏడులక్షలమందికి పింఛన్ కట్ చేయబోతున్నట్టు వార్తలు వినిపిస్తుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాలలో దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.

ఇందులో భాగంగా.. పింఛను పొందేందుకు నిబంధనల ప్రకారం మీకు అర్హత లేదు. మీ పేర్లు అర్హుల జాబితా నుంచి ఎందుకు తొలగించరాదో చెప్పండి అంటూ గ్రామ సచివాలయాల్లో నోటీసు బోర్డులు అతికిస్తున్నారు. బోరులో పేర్లు చూసుకొని లబ్ధిదారులు ఆలోచనల్లో పడి బెంబేలెత్తిపోతున్నారు. గ్రామ సచివాలయంలోని సిబ్బందిని కలిసి.. ఏదో ఒకటి చేసి తమ పేరు తీసేయకుండా చూడాలని అభ్యర్థిస్తున్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీన ప్రకటించే తుది జాబితాలో ఉంటామో లేదోనని భయపడుతున్నారు. అలాగే సీఎం జగన్‌ వచ్చి పెన్షన్‌ మొత్తం 3000 కి పెంచుతారని భావిస్తే.... ఉన్న పెన్షన్లను తొలగిస్తున్నారని నోటీసుల్లో పేర్లు ఉన్న కొందరు లబ్ధిదారులు తమ ఆవేదనని తెలియజేస్తున్నారు.

గత నెల 13వ తేదీన జగన్‌ ప్రభుత్వం తెచ్చిన కొత్త మార్గదర్శకాలతో ఒక్కసారిగా చాలామంది పింఛన్ పథకానికి అనర్హులుగా మారారు. సాధారణంగా మార్గదర్శకాలను కొత్తగా లబ్ధిదారుల లిస్ట్ లోకి చేరే వారికీ వర్తింపజేయాలి. కానీ, కొత్త, పాత అన్నింటికీ కలిపి ఒకే నిబంధనలు అమలులోకి తీసుకురావడంతో సామాజిక పింఛనుదారులకు పెద్ద చిక్కే వచ్చిపడింది. కడప జిల్లాలో 40 వేలు, నెల్లూరు జిల్లాలో 50 వేలకుపైగా, పశ్చిమగోదావరిలో 20 వేలు, కృష్ణా జిల్లాలో 90 వేలు, ప్రకాశం లో 70 వేలు, అనంతపురం జిల్లా లో లక్ష మందికి పైగా పేర్లు అనర్హత లిస్ట్ లో ఉన్నట్టు తెలుస్తుంది.

గతంలో వారి విషయంలో నిబంధనలు పెద్దగా పట్టించుకోకుండా పెన్షన్లు మంజూరు చేశారు. ఇప్పుడు వాటిని తొలగిస్తున్నారు. సొంత కారు ఉన్నా, నెలవారీ విద్యుత్‌చార్జీలు 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉన్నా అనర్హులే. పట్టణాల్లో చిన్న ఇల్లున్న వారికి గతంలో పెన్షన్లు ఇచ్చారు. ఇప్పుడు 750 చదరపు అడుగుల కంటే ఎక్కువ ఉన్న కుటుంబాలకు తొలగించడంతో వారి పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రాష్ట్రంలో కొత్తగా పెద్ద పంచాయతీలను కూడా మున్సిపాలిటీలు గా మార్చారు. అవి దాదాపుగా గ్రామీణ ప్రాంతాలను పోలి ఉంటాయి. అలాంటి మునిసిపల్‌ ప్రాంతంలో అందరికీ స్థలాలు ఉంటాయి. ఈ సమయం లో వాళ్లంతా పెన్షన్‌ అర్హతను కోల్పోతున్నారు. అదే సమయంలో వికలాంగులు తప్ప ఒక కుటుంబంలో ఒకటి కంటే ఎక్కువ పెన్షన్లు ఇవ్వరాదని నిర్దేశించడం గమనార్హం. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బందికి, అంగన్‌వాడీ వర్కర్లు, వీవోఏలు, ఆశావర్కర్లుతో పాటు రూ.10 వేలకు పైబడిన వేతనాలు పొందుతున్న సిబ్బంది ఇళ్లల్లో ఎవరైనా పింఛన్ కి అర్హులు ఉంటే ..వారిని కూడా అనర్హులు గా ప్రకటించనున్నారు.