Begin typing your search above and press return to search.

వందకు పైగా రివ్యూస్.... బాబు తేల్చిందేంటి ...?

By:  Tupaki Desk   |   11 Nov 2022 8:58 AM GMT
వందకు పైగా రివ్యూస్.... బాబు తేల్చిందేంటి ...?
X
చంద్రబాబు పని రాక్షసుడు. ఆయన అధికారంలో ఉన్నా లేకున్నా కూడా రిలాక్స్ అయ్యే చాన్సే లేదు. ఆయన వరసబెట్టి అలా పార్టీ నేతలతో మీటింగులు పెడుతూంటారు. రివ్యూస్ గంటల తరబడి చేస్తూంటారు. దాని ఫలాలు ఫలితాలు ఏమిటి అన్నది పక్కన పెడితే బాబుకు ఉన్న కమిట్మెంట్ అందులో కనిపిస్తుంది.

సరే చంద్రబాబు ఏడు పదుల వయసులో ఇంతలా కష్టపడుతున్నారు కదా మరి తమ్ముళ్ల మాటేంటి అంటే వారు మాత్రం యధా ప్రకారం అన్నట్లుగానే ఉన్నారని అంటున్నారు. అందరూ కాదు కానీ చాలా మంది ఇప్పటికీ ఓటమి హ్యాంగోవర్ నుంచి తేరుకోలేదని ఈ రివ్యూస్ ద్వారా తెలుసుతున్న విషయం.

అదే టైం లో చాలా మంది ఇంకా కాళ్ళు జాపేసి కూర్చున్నారు అని అంటున్నారు. పార్టీ పటిష్టత గెలుపు అవకాశాలు ఏవీ వారికి అసలు ఏ మాత్రం పట్టడం లేదని అంటున్నారు. వారు ఎంతసేపూ తమ సొంత పనులు వ్యాపారాలు వ్యవహారాలో మునిగితేలుతున్నారని అంటున్నారు. బాబు ఒకటికి పదిసార్లు హెడ్మాస్టర్ మాదిరిగా క్లాస్ తీసుకుంటున్నా చాలా చోట్ల మార్పు రావడంలేదు అని అంటున్నారు.

ఎన్నికలకు ఏడాదిన్నర సమయం ఉండగానే చంద్రబాబు ఇప్పటికైతే 126 నియోజకవర్గాలలో రివ్యూస్ చేశారు. ఈ సందర్భంగా అందుబాటులోకి వచ్చిన నేతలకు బాగా పనిచేయాలని కోరారు. అదే టైం లో పనిచేసే వారికే టికెట్లు అని హెచ్చరికలు జారీ చేశారు. ఎన్ని చేసినా చాలా మంది సీనియర్ నాయకులు అయితే బాబు సమీక్షలకు హాజరు కాలేదని తేలుతున్న విషయం.

కొందరైతే ఏం జరుగుతుందిలే అన్న నిబ్బరంతో ఉన్నారా అన్న మాట కూడా వినిపిస్తోంది. చంద్రబాబు ఆవేశంతో చెబుతున్న మాటలు కానీ పార్టీ కోసం ఎంతటి కఠిన నిర్ణయం అయినా తీసుకుంటాను అని చెబుతున్న మ్యాటర్ కానీ వారికి అసలు బుర్రలకు ఎక్కడంలేదు అని అంటున్నారు.

దీనికి కారణం గతంలో చంద్రబాబు ఇలాగే చెప్పి చివరి నిముషంలో మళ్ళీ వాళ్లకే టికెట్లు ఇచ్చారు. ఇపుడు కూడా అలాగే జరుగుతుందని, జరగాలని వారు కోరుకుంటున్నారు. అందుకే ఏమవుతుంది, మనకే మళ్ళీ టికెట్లు అని ధీమాతో ఉండడం చేతనే బాబు హెచ్చరికలను లైట్ తీసుకుంటున్నారు అని అంటున్నారు.

ఇటీవల అనంతపురం నియోజకవర్గం సమీక్షను బాబు చేస్తే రెండు నియోజకవర్గాలలో సీనియర్లు డుమ్మా కొట్టారుట. ఒక చోట అయితే తమ వారసుడిని చంద్రబాబు మీటింగుకు పంపి ఊరుకున్నారట. ఇదీ ప్రస్తుతం పార్టీలో ఉన్న పరిస్థితి అని అంటున్నారు. ఇంకో వైపు చూస్తే ప్రతీ నియోజకవర్గంలోనూ కనీసంగా ఇద్దరేసి టికెట్ల కోసం పోటీ పడుతున్నారుట. మరి వారికి సర్ది చెప్పి ఎవరికి టికెట్ ని చంద్రబాబు ఇస్తారు అన్నది చూడాల్సి ఉంది అంటున్నారు.

ఇంకో వైపు నిద్రాణంలో ఉన్న పార్టీని పైకి లేపడానికి చంద్రబాబు ఏ రకమైన యాక్షన్ ప్లాన్ తో ఉన్నారు అన్నదే ఇపుడు ఆసక్తికరంగా ఉంది అంటున్నారు. మొత్తానికి చూస్తే ఈ రివ్యూస్ ద్వారా నాయకులు ఏమి అర్ధం చేసుకున్నారో తెలియదు కానీ చంద్రబాబుకు మాత్రం పార్టీ టోటల్ పిక్చర్ అయితే కళ్ల ముందు కనిపించింది అని అంటున్నారు.

ఈసారి ఎన్నికలు చావో రేవో అన్నట్లుగా ఉన్నాయి. దీంతో చంద్రబాబు ఈ ఎన్నికలను ఆషామాషీగా అసలు తీసుకోవడంలేదు. అందుకే ఆయన కఠిన నిర్ణయాల దిశగా వెళ్తారు అని అంటున్నారు. అదే సమయంలో ఆయన జిల్లా టూర్లకు కూడా ప్లాన్ చేసుకుంటున్నారుట.

మరి మాటల వరకూ ఇప్పటిదాకా చెబుతూ వస్తున్న చంద్రబాబు ఇక మీదట కొన్ని కఠిన నిర్ణయాలతో చేతలకు దిగితేనే తప్ప పార్టీ పరిస్థితిలో మార్పు రాదని అంటున్నారు. మరి చంద్రబాబు ఆ డైరెక్షన్ లో వెళ్తారా. చూడాలి. ఆయన కనుక వెళ్తేనే తప్ప పార్టీకి మంచి రోజులు రావు అని అంటున్న వారు ఉన్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.