Begin typing your search above and press return to search.

అమెరికాలో కరోనా జోరు..లక్ష దాటిన హాస్పిటల్ బాధితులు

By:  Tupaki Desk   |   27 Aug 2021 8:41 AM GMT
అమెరికాలో కరోనా జోరు..లక్ష దాటిన హాస్పిటల్ బాధితులు
X
కరోనా వైరస్ మహమ్మారి దెబ్బకు తీవ్రంగా నష్టపోయిన అగ్రరాజ్యం అమెరికా, కరోనా మహమ్మారి విజృంభణతో మరోసారి అల్లాడిపోతోంది. ఆస్పత్రుల్లో చేరుతున్న కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య మళ్లీ ఎక్కువ అవుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. గత రెండు వారాల్లోనే ఆస్పత్రుల్లో చేరిన కరోనా రోగుల సంఖ్య ఏకంగా 70 శాతానికి పైగా పెరిగింది. అలాగే ఇప్పుడు హాస్పిటల్ లో చేరిన కరోనా బాధితుల సంఖ్య లక్ష కి చేరింది. ఈ మార్క్ జనవరి తర్వాత ఈ ఏడాదిలో మొదటిసారి చేరుకోవడం గమనార్హం. మరణాలు కూడా క్రమంగా పెరుగుతూ ఉన్నాయి.

వ్యాక్సినేషన్‌ వేగంగా జరగడంతో అమెరికాలో కరోనా వైరస్ కాస్త అదుపులోకి వచ్చినట్లే కనిపించినా, డెల్టా తరహా కొత్త వేరియంట్ల వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతోంది. వైరస్‌ తీవ్రత తగ్గాక చాలా ప్రాంతాల్లో మాస్కులు ధరించడంపై ప్రభుత్వం ఆంక్షలు సడలించింది.చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చినట్లు కనిపిస్తోంది. గత నెల రోజులుగా అమెరికాలో కరోనా కేసులు, మరణాలు అనూహ్యంగా పెరిగాయి. రోజూ సగటున వెయ్యి మంది వరకు కరోనా కారణంగా మృతి చెందుతున్నారు. కరోనా వైరస్‌ తీవ్రత పెరగడంతో మున్ముందు మరింత ప్రమాదకర పరిస్థితులు తలెత్తవచ్చని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెల్త్‌ హెచ్చరించింది.

ఫ్లోరిడాలో 17,000 మందికి పైగా కరోనా వైరస్ మహమ్మారి తో ఆసుపత్రి పాలయ్యారు. అమెరికా లో ఉన్న అన్ని రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఇదే అత్యధికం. ఆ తర్వాత టెక్సాస్ లో 14,000 మంది కరోనా మహమ్మారి బాధితులు హాస్పిటల్ లో ఉన్నారు. అమెరికా వ్యాప్తంగా వస్తున్న కొత్త కేసుల్లో మూడో వంతు ఈ రాష్ట్రాల్లోనే ఉండ‌టం గమనార్హం. జనవరి చివరి నాటికి రోజువారీ మరణాల సగటు 3,100 మరియు బుధవారం నాటికి దాదాపు 1,100 అని నివేదిక వెల్లడించింది. జాన్స్ హాప్‌ కిన్స్ విశ్వవిద్యాలయం ప్రకారం, శుక్రవారం నాటికి, అమెరికా అత్యధికంగా 38,374,252 కరోనా పాజిటివ్ కేసులతో , అలాగే 633,479 మరణాలతో ప్రపంచంలోనే అత్యధికంగా దెబ్బతిన్న దేశంగా కొనసాగుతోంది.అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్‌ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియెంట్‌ వ్యాప్తి చెందడమే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. మరోవైపు, ఈ కేసుల పెరుగుదలతో అగ్రరాజ్యం అప్రమత్తమైంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆదేశాలతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను మరింత వేగంగా ముందుకు తీసుకుపోతున్నారు.