Begin typing your search above and press return to search.

మొరాకో కథ ముగిసింది.. ఫైనల్ కు ఫ్రాన్స్.. ఒక లొల్లి పోయినట్లేనా?

By:  Tupaki Desk   |   15 Dec 2022 3:51 AM GMT
మొరాకో కథ ముగిసింది.. ఫైనల్ కు ఫ్రాన్స్.. ఒక లొల్లి పోయినట్లేనా?
X
రోజులు గడిచే కొద్దీ మనుషుల్లో వస్తున్న చిత్ర విచిత్ర భావజాలాల్ని చూస్తున్న చాలామందికి విస్మయాన్ని కలిగిస్తున్నాయి. గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు అందరూ తమదైన సర్కిల్స్ లోనే బతికేస్తున్నారు. చాలా విషయాల్ని విశాలంగా చూడాల్సిన వారు.. అందుకు భిన్నంగా మతం, కులం, ప్రాంతం లాంటి ఇరుకు మనస్తత్వానికి అలవాటు పడిపోయారు. దీనికి నిలువెత్తు నిదర్శనంగా ప్రపంచ ఫుట్ బాల్ టోర్నీలో ఒక జట్టు అద్భుత ప్రతిభను ప్రదర్శించి విజయాన్ని సాధిస్తే దానికి మతం అంటకట్టటం దేనికి నిదర్శనం?

ప్రధాన మీడియాను ఫాలో అయ్యే వారికి చాలా విషయాలు అర్థం కాని పరిస్థితి. అందుకు భిన్నంగా ఓవైపు ప్రధాన మీడియాను ఫాలో అవుతూ.. మరోవైపు సోషల్ మీడియాను.. బ్లాగులను ఫాలో అవుతున్న వేళ.. కొత్త విషయాలు.. కొత్త అంశాల చర్చ కనిపిస్తూ ఉంటుంది. ప్రపంచ కప్ ఫుట్ బాల్ టోర్నీలో ఆఫ్రికా జట్టు అయిన మొరాకో పోరాటం ముగిసింది. నాకౌట్ మ్యాచుల్లో అద్భుతమైన ఆటతీరును ప్రదర్శిస్తూ బెల్జియం.. స్పెయిన్.. పోర్చుగల్ లాంటి బలమైన జట్లను ఓడించిన సెమీస్ లో మాత్రం తాను అనుకున్న ఫలితాన్ని నమోదు చేయలేకపోయింది.

డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్రాన్స్ చేతిలో ఓడింది. అయితే మాత్రం.. తన పోరాట పటిమతో ఎంతోమంది మనసుల్ని గెలుచుకోవటమే కాదు.. ఒక ఆఫ్రికా జట్టు సెమీస్ వరకు వెళ్లగలిగిన గొప్పను సొంతం చేసుకుంది. సెమీస్ కు చేరుకున్న తొలి ఆఫ్రికా జట్టుగా నిలిచింది. ఇక్కడ ప్రస్తావించాల్సిన అంశం మరొకటి ఉంది. క్వార్టర్ ఫైనల్స్ లో విజయం సాధించి.. సెమీస్ కు అడుగు పెట్టినంతనే మొరాకా జట్టు ఆట తీరును పొగిడే కంటే కూడా.. ఆ దేశ ప్రజల్లో అత్యధికులుగా ఉండే ముస్లిం కోణాన్ని బయటకు తీయటం.. దాని చుట్టూనే తిరగటం చాలామందిని ఇబ్బందికి గురి చేసింది.

బ్రహ్మండమైన ఆట తీరును ప్రదర్శించే జట్టు ఏదైనా విజేతగా అవతరించే అవకాశం ఉంది. అంతే తప్పించి.. ఒక జట్టు విజయం సాధించిన వెంటనే ఆ దేశంలోని మెజార్టీ మతస్తులతో ముడిపెట్టి.. దాన్ని ఆ జట్టుకు ఆపాదించటం.. మతం చుట్టూ వారి విజయం తిరగటం చాలామందిని ఇబ్బందికి గురి చేసేలా మారింది.

చివరకు రాజకీయ నాయకులు సైతం ఇదే తీరును ప్రదర్శించటం చూస్తే.. ఈ లోకం ఏ దిశగా పరుగులు తీస్తోందన్నది పెద్ద ప్రశ్నగా మారింది. సోషల్ మీడియాలో దీనిపై జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. ప్రతిభను మతం కోణంలో చూడటం.. ఆ దిశగానే చర్చలు జరపటం.. తమ ఆనందాన్ని వెళ్లబుచ్చటం అన్నీనూ మతం చుట్టూనే సాగటం పలువురికి నచ్చలేదు.

సెమీస్ కు చేరినంతనే ఇంత హడావుడి చేసి.. టోర్నీకి మతాన్ని చుట్టేసే ఈ ప్రక్రియ.. మొరాకో జట్టు ఫైనల్ కు చేరితే పరిస్థితి ఏమవుతుందన్న ఆందోళన కలిగించిన పరిస్థితి. ఇక.. ఆట విషయానికి వస్తే.. సెమీస్ లో మొరాకో ఓటమి పాలైంది. మ్యాచ్ ముప్పాతిక భాగం బంతిని తమ నియంత్రణలో ఉంచుకున్నప్పటికీ గోల్స్ చేసే విషయంలో మొరాకో జట్టు ఫెయిల్ అయ్యిందనే చెప్పాలి. టార్గెట్ దిశగా దూసుకెళ్లినప్పటికీ ఫ్రాన్స్ రక్షణ శ్రేణిని దాటుకొని గోల్స్ చేయలేకపోవటంతో జట్టుకు ఓటమి తప్పలేదు.

మ్యాచ్ ప్రారంభమైన ఐదో నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు థియో హెర్నాండెజ్ అద్భుత రీతిలో గోల్ చేయటం.. అదే చివరకు ఫ్రాన్స్ జట్టు విజయానికి మొదటి అడుగుగా మారింది. మొదటి గోల్ సాధించిన తర్వాత ఫ్రాన్స్ ఆటగాళ్లు పదే పదే మొరాకో గోల్ పోస్టుపై దాడులు చేసినా ఫలితం లేకపోయింది. ఆట డెబ్భై తొమ్మిదో నిమిషంలో ఫ్రాన్స్ ఆటగాడు రాండల్ కోలో మువానీ అద్భుత రీతిలో రెండో గోల్ చేయటం.. ఆ స్కోర్ ను మొరాకో సాధించలేకపోవటంతో.. 2-0 తేడాతో ఫ్రాన్స్ విజయాన్ని సాధించి ఫైనల్ పోరుకు దూసుకెళ్లింది. పోరాడి ఓడిన మొరాకో జట్టు టోర్నీ నుంచి నిష్క్రమించింది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.