Begin typing your search above and press return to search.

నిండిపోతున్న చెన్నై మార్చురీలు

By:  Tupaki Desk   |   8 Dec 2015 4:05 AM GMT
నిండిపోతున్న చెన్నై మార్చురీలు
X
చెన్నైను భారీగా దెబ్బ తీసి.. సమీప భవిష్యత్తులో కోలుకోకుండా చేసిన భారీ వర్షాలు.. వరదల కారణంగా ఒక ఇబ్బందికర పరిస్థితి చోటు చేసుకుంది. ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలో అర్థం కాక తలపట్టుకుంటున్నారు. పగోడికి కూడా ఇలాంటి బాధలు వద్దన్నట్లుగా పరిస్థితి ఉంది.

చెన్నై వరదల కారణంగా అధికారిక లెక్కల ప్రకారం 500 మందికి పైనే మృత్యువాత పడ్డారు. భారీ వర్షాలు.. వరద పోటెత్తిన నేపథ్యంలో వారిని శ్మశానానికి తీసుకెళ్లని పరిస్థితి. ఆది.. సోమవారాల్లో వర్షం కాస్త తెరపినివ్వటం.. బయటకు అడుగు పెట్టే అవకాశం రావటంతో.. మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే.. చెన్నైలోని 211 శశ్మాన వాటికల్లో 25 శశ్మానవాటికకు మినహా మిగిలినవి ఇంకా వరద నీటిలోనే ఉండటంతోనే అంత్యక్రియలకు ఆటంకాలు ఎదురవుతున్నాయి.

దీంతో.. అంత్యక్రియలకు క్యూకట్టాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు.. రోజుల తరబడి మృతదేహాలు బయట ఉంచలేక ఆసుపత్రుల్లోని మార్చురీల్లో ఉంచుతున్నారు. అధికారిక మృతుల సంఖ్యకు భిన్నంగా అనధికార మృతులు భారీగా ఉండటం.. మృతదేహాలతో మార్చురీలు నిండిపోతున్నాయి. బతకటానికి.. ప్రాణం నిలుపుకోవటానికి గుక్కెడు నీళ్లు.. కాస్తంత ఆహారం కోసం క్యూలు తప్పనట్లే.. చనిపోయిన వారికి అంతిమ సంస్కారాలకూ క్యూలో ఉండాల్సి రావటం.. బాధితులకు మరింత ఆవేదనను కలిగిస్తోంది.