Begin typing your search above and press return to search.

రాజ్యసభలో ఎంపీలకు వాటితో తెగ ఇబ్బంది!

By:  Tupaki Desk   |   19 March 2015 5:18 AM GMT
రాజ్యసభలో ఎంపీలకు వాటితో తెగ ఇబ్బంది!
X
చట్టసభల్లో ఎంపీలకు సామాన్యంగా వైరి పక్షాల నుంచి ఇబ్బందులొస్తూ ఉంటాయి. అధికార పక్షంలో ఉన్న సభ్యులను ప్రతిపక్ష సభ్యులు.. ప్రతిపక్ష సభ్యులను అధికార పక్ష సభ్యులు విమర్శలు, వాడీవేడీ మాటలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు.

ఇలా మాటల తూటాలతోనే కాదు.. ఇప్పుడు రాజ్యసభ సభ్యులకు దోమలతోకూడా తీవ్రమైన ఇబ్బంది కలుగుతోంది. ఈ విషయం గురించి సభ్యులే స్పీకర్‌కు మొరపెట్టుకొన్నారు.

కీలకమైన బిల్లులు పాస్‌ కావాల్సి ఉన్న తరుణంలో రాజ్యసభను సాయంత్రం ఆరు తర్వాత కూడా కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. సభ ఇక ఎక్కువ రోజులు కొనసాగే అవకాశం లేని తరుణంలో ఏడింటి తర్వాత కూడా సమావేశాలు కొనసాగుతున్నాయి. చర్చలు జరుగుతున్నాయి.

అయితే సాయంత్రం అయ్యే సరికి సభలో దోమల బెడదపెరుగుతోంది. ఈ అంశం గురించి వారు స్పీకర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. దోమలు కుట్టి చంపుతున్నాయని.. వాటి నివారణ కు చర్యలు తీసుకోవాలని ఎంపీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌ కురియన్‌కు వారు ఫిర్యాదు చేశారు. తాము ఎన్నికై రాజ్యసభకు వచ్చామని..అవి మాత్రం యధేచ్చగా వచ్చేస్తున్నాయని కూడా సభ్యులు చమత్కరించారు.

సభ్యుల ఇబ్బందిని పరిగణనలోకి తీసుకొని.. దోమల నివారణకు చర్యలు తీసుకొంటామని కురియన్‌ హామీ ఇవ్వడంతో సభ్యులు శాంతించారు.