Begin typing your search above and press return to search.

మ‌న‌దేశంలో అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

By:  Tupaki Desk   |   26 Jan 2019 7:59 AM GMT
మ‌న‌దేశంలో అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?
X
మ‌న‌దేశంలో అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తి ఎవ‌రు? ఎవ‌రి చేతుల్లో దేశం సుర‌క్షితంగా ఉంటుంద‌ని ప్ర‌జ‌లు భావిస్తున్నారు? ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పింది ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సర్వే. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ భార‌త్ లో అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తి అని.. కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీకి ఆయన‌కు మ‌ధ్య వ్య‌త్యాసం చాలా ఎక్కువగానే ఉంద‌ని ఈ స‌ర్వేలో తేలింది.

దేశ‌వ్యాప్తంగా 291 అర్బ‌న్ వార్డులు, 690 గ్రామాల్లో ఫస్ట్ పోస్ట్ - ఐపీఎస్ ఓఎస్ నేషనల్ ట్రస్ట్ సంయుక్తంగా ఈ స‌ర్వేను నిర్వ‌హించాయి. ఇందులో భాగంగా మొత్తం 34,470 మంది అభిప్రాయాల‌ను తెలుసుకున్నాయి. అత్యంత విశ్వసించదగిన వ్యక్తిగా మోదీకి 53 శాతం మంది ఓటు వేశారు. ఈ విష‌యంలో రాహుల్ గాంధీకి కేవలం 26.9 శాతం ఓట్లు ద‌క్కాయి.
తాజా స‌ర్వేలో ఉత్త‌ర భార‌త‌దేశంలో మోదీ ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపించింది. ఉత్త‌రాదిన చాలా రాష్ట్రాల ప్ర‌జ‌లు మోదీపై అధిక విశ్వాసం వ్య‌క్తం చేశారు. ద‌క్షిణాదిన మాత్రం మోదీ కంటే రాహుల్ గాంధీ వైపే ప్ర‌జ‌లు మొగ్గుచూపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడుల్లో రాహుల్ గాంధీపై ప్ర‌జ‌లు ఎక్కువ విశ్వాసముంచారు. విశ్వ‌సనీయ వ్య‌క్తుల జాబితాలో మోదీ, రాహుల్ త‌ర్వాత ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీకి నాలుగు శాతం ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అధినేత్రి మాయావ‌తిని రెండు శాతం మంది అత్యంత విశ్వ‌స‌నీయ వ్య‌క్తిగా అభిప్రాయ‌ప‌డ్డారు.

పార్టీల విష‌యానికొస్తే.. దక్షిణాదిన ప్రాంతీయ పార్టీల హవా న‌డిచింది. త‌మిళ‌నాడు(డీఎంకే, అన్నాడీఎంకే), ఒడిశా(బీజేడీ), ఆంధ్ర‌ప్ర‌దేశ్‌(టీడీపీ, వైసీపీ, జ‌న‌సేన‌), తెలంగాణ‌ల్లో ప్ర‌జ‌లు ప్రాంతీయ పార్టీల వైపే మొగ్గు చూపారు. ఉత్త‌రాది రాష్ట్రాల ప్ర‌జ‌లు బీజేపీపై ఎక్కువ విశ్వాసం వ్య‌క్తం చేశారు. ప్ర‌భుత్వ సంస్థ‌లు-కార్యాల‌యాల ప‌రంగా చూస్తే.. ప్రధానమంత్రి కార్యాలయం పట్ల 75 శాతం మంది విశ్వాసం వ్యక్తం చేశారు. భారత అత్యున్నత న్యాయస్థాన‌మైన‌ సుప్రీం కోర్టు పైన 73 శాతం మంది, పార్లమెంటుపై 72 శాతం మంది విశ్వాసం వెలిబుచ్చారు. ప్రధాన ప్రతిపక్షంపై 53 శాతం మంది మాత్రమే విశ్వాసముంచారు. ప్ర‌ధాని కార్యాల‌యంతో పోలిస్తే సుప్రీంకోర్టుపై త‌క్కువ మంది విశ్వాస‌ముంచిన‌ట్లు స‌ర్వేలో తేల‌డంపై విశ్లేష‌కులు ముక్కున వేలేసుకుంటున్నారు!