Begin typing your search above and press return to search.

గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్

By:  Tupaki Desk   |   8 Aug 2016 7:52 AM GMT
గ్యాంగ్ స్టర్ నయీం ఎన్ కౌంటర్
X
తెలుగు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్ నేరగాడు.. గ్యాంగ్ స్టర్ - సుపారీ కిల్లర్ గ్యాంగ్ అధినేత - మాజీ మావోయిస్టు.. ఒకటా రెండా ఎన్నో విశేషణాలున్న కరడుగట్టిన నేరగాడు నయీం హతమయ్యాడు. పోలీసుల కాల్పుల్లో ఈ ఉదయం ఎన్ కౌంటర్ అయ్యాడు. తెలంగాణ గ్రేహౌండ్స్ పోలీసులు అతణ్ని కాల్చిచంపారు. మహబూబ్‌ నగర్ జిల్లా షాద్ నగర్‌ శివారులో నయూమ్‌ ఉన్న ఇంటిని ఈ ఉదయం గ్రేహౌండ్స్ దళాలు చుట్టుముట్టగా నయీం గన్ మెన్ తొలుత కాల్పులు జరిపాడు. దీంతో పోలీసులు కాల్పులు జరిపి నయీంను తుదముట్టించారు.

నయీమ్‌ ఒకప్పుడు మావోయిస్టుల్లో పనిచేశాడు. ఆ సమయంలో జరిగిన ఐపీఎస్ వ్యాస్‌ హత్య కేసులో, పౌరహక్కుల నేత పురుషోత్తం హత్యకేసులోనూ నిందితుడిగా ఉన్నాడు. బెల్లి లలిత హత్య కేసు తరువాత నయూమ్ అంటే అందరిలో భయం పెరిగిపోయింది. అనంతరం మావోయిస్ట్ గ్రూప్‌ నుంచి బయటకు వచ్చిన నయీమ్ సొంతంగా గ్యాంగ్‌ ను స్థాపించి అనేక హత్యలకు పాల్పడ్డాడు. సెటిల్మెంట్లు - దందాలు - హత్యలతో బెదరగొట్టాడు. తెలుగు రాష్ట్రాల్లోని పలువురు ఇతర గ్యాంగ్ స్టర్లను కూడా నయీం ముఠా చంపేసింది. పోలీసులకు ఇన్ఫార్మర్ గానూ పనిచేయడంతో నయీంకు చాలాకాలం అడ్డు లేకుండా పోయింది. అధికారం - అధికారులు మారిన తరువాత నయీం ముఠా ఆగడాలకు చాలావరకు కళ్లెం పడింది. పోలీసుల సహకారం కొరవడడంతో నయీంకు కష్టాలు మొదలై ఇప్పుడు ఎన్ కౌంటర్ అయ్యాడు.

గడాఫీ అభిమాని..

నల్గొండ జిల్లాకు భువనగిరికి చెందిన నయీం గ్యాంగ్ స్టర్ గా మారిన తరువాత కొద్దికాలం దావూద్ ఇబ్రహీంను అనుకరించేవాడు. వేషధారణ అలా ఉండేది. ఆ తరువాత ఆయన లిబియా అధినేత కల్నల్ గఢాఫీని అనుకరించేవాడు. గడాఫీ మాదిరిగానే తలకు వస్త్రం కట్టుకుని - కళ్లకు అద్దాలు పెట్టుకుని ఉండడంతో పాటు గడాఫీకి ఉన్నట్లే మహిళా గన్ మెన్లను కూడా పెట్టుకున్నాడు.

నయీం చేతిలో హతమైన ముఖ్యులు

- వ్యాస్(పోలీస్ ఉన్నతాధికారి)

- పురుషోత్తం(పౌరహక్కులు కార్యకర్త)

- బెల్లి లలిత(పౌరహక్కుల నేత - గాయని - మావోయిస్టులతో సంబంధం ఉన్న వ్యక్తి - మాజీ హోం మంత్రి మాధవరెడ్డి హత్యకేసులో ఆరోపణలున్నాయి... ఈమెను అత్యంత కిరాతకంగా చంపి 17 ముక్కలుగా చేసి ఎక్కడెక్కడో విసిరేశారు)

- సాంబశివుడు(మాజీ మావోయిస్టు - లొంగిపోయిన తరువాత టీఆర్‌ ఎస్ నేత)

- పటోళ్ల గోవర్దన్ రెడ్డి(గ్యాంగ్ స్టర్ - పరిటాల రవి హత్యకేసులో ప్రమేయం ఉన్న వ్యక్తి)

- నయీంపై 25 హత్య కేసులు సహా 132కి పైగా క్రిమినల్ కేసులున్నాయి.

మొదటి నుంచి నేరగాడే..

నల్గొండ జిల్లా భువనగిరికి చెందిన నయీమ్ హైదరాబాద్ లోని పాతబస్తీలోని యాకత్ పురాలో 18 ఏళ్ల వయసులో కారు మెకానిక్ గా పనిచేస్తున్న వయసులోనే నేరాల బాట పట్టాడు. చిన్న చిన్న దొంగతనాలతో ప్రారంభించి, ఆపై హత్యలు మొదలుపెట్టాడు. 1989లో పీపుల్స్ వార్ లో చేరి - నక్సలైట్ గా కొత్త జీవితం ప్రారంభించాడు. అయితే.. అక్కడా మోసకారిగా మారాడు. పోలీసుల కోవర్టుగా మారి అనేకమంది నక్సల్స్ నాయకులను స్వయంగా హతమార్చడమే కాకుండా, వారి రహస్యాలను పోలీసులకు చేరవేశాడు. ఆపై పోలీసులతో సంబంధాలు చెడడంతో గ్యాంగ్ ఏర్పాటు చేసి సభ్యులను పెంచుకుంటూపోయాడు. చిన్నచిన్న గ్యాంగ్ స్టర్లను తన గ్యాంగులో కలుపుకొంటూ నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు రాష్ట్రాల్లో రెండు దశాబ్దాలుగా నయీం కంటే పెద్ద గ్యాంగ్ స్టర్ లేడు.

ఎస్కేపింగ్ లో ఎక్సుపర్టు..

నయీమ్ పై 132 పోలీసు కేసులుండగా, చానాళ్లుగా తప్పించుకు తిరుగుతున్నాడు. పోలీసులకు పట్టుబడితే - వారి నుంచి తప్పించుకోవడం నయీమ్ కు వెన్నతో పెట్టిన విద్య. 11 సార్లు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకున్న చరిత్ర నయీమ్ ది. అతనిపై ఉన్న కేసుల్లో పలు హత్యాభియోగాలు సైతం ఉన్నాయి. మావోయిస్టు కార్యకర్త బెల్లి లలిత హత్య కేసులో నయీమ్ ప్రధాన నిందితుడు. ఈ హత్యతోనే నయీమ్ పేరు తొలిసారిగా వినిపించింది. 1993 జనవరి 27న మార్నింగ్ వాక్ చేస్తున్న ఐపీఎస్ అధికారి కేఎస్ వ్యాస్ ను హత్య చేశాడు. వెంటనే పోలీసులకు లొంగిపోయి అనారోగ్యం పేరిట ఆసుపత్రిలో చేరి అక్కడ రక్షణగా ఉన్న పోలీసులను మస్కాక కొట్టి తప్పించుకున్నాడు. సెటిల్మెంట్లు, దందాలతో కోట్లకు పడగలెత్తిన నయీం ఒకచోట స్థిరంగా ఉండకుండా దేశంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ తన గుట్టును పోలీసులకు దొరక్కుండా తప్పించుకుంటుంటాడు.

చాలాకాలంగా వెటే..

నయీమ్ ను పట్టుకునేందుకు కొన్ని నెలల క్రితమే గ్రేహౌండ్స్ పోలీసులు రంగంలోకి దిగారు. ఇటీవలే నయీమ్ మహారాష్ట్రలో ఉన్నాడన్న సమాచారంతో గ్రేహౌండ్స్ బలగాలు అక్కడికి కూడా వెళ్లాయి. అయితే నయీమ్ వారికి చిక్కలేదు. దీంతో నిరాశగా తిరిగివచ్చిన గ్రేహౌండ్స్ బలగాలు పక్కా సమాచారం కోసం ఎదురుచూశాయి. ఈ క్రమంలో షాద్ నగర్ కు నయీమ్ వచ్చాడన్న పక్కా సమాచారం రావడంతో గ్రేహౌండ్స్ వెనువెంటనే రంగంలోకి దిగిపోయాయి. నయీమ్ తలదాచుకున్న భవనాన్ని గ్రేహౌండ్స్ పోలీసులు చుట్టుముట్టారు. అయితే అప్పటికే పోలీసుల అలికిడి నయీమ్ చెవిన పడిపోయింది. దీంతో అతడి గన్ మన్ పోలీసులపైకి కాల్పులకు దిగాడు. నయీమ్ ను అరెస్ట్ చేసేందుకే పోలీసులు అక్కడికి వెళ్లినప్పటికీ... అతడి గన్ మన్ కాల్పులకు దిగడంతో పోలీసులుకాల్పులు జరిపి హతమార్చినట్లు డీజీపీ వెల్లడించారు.