Begin typing your search above and press return to search.

నరరూప రాక్షసుడు అబు బకర్ అరెస్ట్.. భారత్ కు ఎప్పుడంటే?

By:  Tupaki Desk   |   5 Feb 2022 2:30 PM GMT
నరరూప రాక్షసుడు అబు బకర్ అరెస్ట్.. భారత్ కు ఎప్పుడంటే?
X
భారత్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ లిస్ట్ లో కీలక వ్యక్తిగా ఉన్న అబు బకర్ ను మన దేశ ఏజెన్సీ ఎట్టకేలకు పట్టుకున్నాయి. అబు బకర్ అండర్ వరల్డ్ మాఫియా డాన్ అయిన దావూద్ ఇబ్రహీంకు కుడి భుజంగా ఉండేవాడు. లాంటి ఈ వ్యక్తి గత మూడు దశాబ్దాలకు పైగా అండర్ గ్రౌండ్ లో ఉండి తప్పించుకుని తిరుగుతున్నాడు. అయితే ఎట్టకేలకు భారత అధికారులకు చిక్కాడు. ఇప్పటివరకు పాకిస్తాన్ తో పాటు సౌదీ, కువైట్, కత్తార్ లాంటి అరేబియా దేశాల్లో తలదాచుకున్న అబు బకర్ ను పక్కా సమాచారం మేరకు భారత భద్రతా దళాలు అరెస్ట్ చేశాయి. అబు బకర్ 1993లో జరిగిన ముంబయి బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన పాత్రధారిగా ఉన్నాడు. అప్పటి నుంచి ఆయనను పట్టుకునేందుకు అధికారులు చాలా దేశాల్లో సెర్చ్ ఆపరేషన్స్ ను చేపట్టాయి. కానీ దొరకలేదు. చివరికి ఇలా ఏళ్ల తర్వాత అతన్ని భారత్ అధికారుల బృందం చేజిక్కించుకుంది.

అయితే అబు బకర్ ను భారత్ కు తీసుకుని వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించినట్లు పేర్కొన్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అబును ఇండియాకు తీసుకొని వచ్చి చట్టపరమైన చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. అయితే ఇతనికి అన్ని విధాల మద్దతు ఇచ్చి నిలబడే మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం మాత్రం దొరకలేదని తెలిపారు. అంతేగాకుండా దావుద్ అనుచరుల్లో మరో కీలక వ్యక్తి అయిన టైగర్ మెమన్ కూడా దొరకలేదని చెప్పారు.

1993లో ముంబయిలో అప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో బాంబు పేలుళ్లు జరిగాయి. అందులోనూ వరుసగా జరిగాయి. దీనితో దేశం మొత్తం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ దాడుల్లో అభంశుభం తెలియని సుమారు 257 మంది చనిపోయారు. ఇంకా 1,400 మందికి పైగా క్షతగాత్రులు అయ్యారు. ఇలా వందల మందిని పొట్టన పెట్టుకున్నారు దావుద్ ఇబ్రహీం అండ్ కో. అప్పటి నుంచి వీరు పరారీలో ఉన్నారు. అయితే తాజాగా అబు బకర్ ను మన అధికారులు యూఏఈలో పట్టుకున్నారు. గతంలో కూడా అబు బకర్ 2019లో మన ఏజెన్సీ లకు చిక్కాడు కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల అతన్ని భారత్ కు తీసుకు రావడం కుదరలేదు. అయితే ఈ సారి ఎట్టకేలకు అతడిని పట్టుకుని డాక్యుమెంటేషన్ వర్క్ పూర్తి చేసి భారత్ కు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు.