Begin typing your search above and press return to search.

ఆడపిల్ల పుట్టిందని శిశువును చంపేసిన అమ్మమ్మలు

By:  Tupaki Desk   |   22 Jun 2020 5:30 PM GMT
ఆడపిల్ల పుట్టిందని శిశువును చంపేసిన అమ్మమ్మలు
X
ఆడపిల్ల భారం అనే సామాజిక జఢ్యం ఇంకా తొలగిపోవడం లేదు. ఆశ్చర్యంగా ఆడపిల్ల పుట్టిందని ఆడవారే చంపేస్తున్న ఘటనలు ఎన్నో చూస్తున్నాం. తాజాగా విశాఖపట్టణంలో ఇద్దరు వృద్ధ మహిళలు కలిసి కూతురికి పుట్టిన బిడ్డ ను చంపేశారు. ఈ దారుణ ఘటన ఆంధ్రప్రదేశ్ లో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి..

సీతానగరం మండలంలో చినకొండేపూడి గ్రామానికి చెందిన కాళ్ల సతీశ్, అదే గ్రామానికి చెందిన సృజన దంపతులు 2019 మే నెలలో వివాహమైంది. భార్య సృజనకు నెలలు నిండటంతో భర్త ఆమెను రాజమండ్రిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. ఈనెల 4వ తేదీన ఆమె ఆడపిల్లకు జన్మనిచ్చింది. దీంతో తల్లిదండ్రులు పరమానందం పొందారు. ఆస్పత్రి నుంచి తల్లీబిడ్డలు చినకొండేపూడి గ్రామానికి చేరుకున్నారు. అయితే ఆడపిల్లకు జన్మనివ్వడం సృజనకు తల్లి మహాలక్ష్మికి నచ్చలేదు. ఆడపిల్లకు జన్మనిచ్చావని సృజనను సూటిపోటి మాటలు అన్నారు. ఈ విషయం సృజన అమ్మమ్మ కనకరత్నంకు సృజన తల్లి చెప్పింది. అంటే మహాలక్ష్మి, కనకరత్నం తల్లీబిడ్డలు. పాప పుట్టడంతో ఆమె కూడా చిర్రుబుర్రూలాడింది.

తమ వంశంలో తరాలుగా ఆడపిల్లలు జన్మిస్తున్నారని తల్లీకూతుళ్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆడబిడ్డ భారమని, పెరిగే కొద్దీ ఖర్చులం పెరుగుతాయని ఇద్దరు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలోనే ఆడపిల్లగా పుట్టడం పసికందు చేసిన నేరం. దీంతో పాపను చంపుదామని ప్లానేసి కనకరత్నం, మహాలక్ష్మి ఈనెల 18వ తేదీ అర్ధరాత్రి వారి ఇంటికి సమీపంలో ఉన్న బావిలో ఆడశిశువును హత్య చేసి పడేశారు.

ఇదేమీ తెలియనట్టు నటిస్తూ కొత్త నాటకం మొదలుపెట్టారు. ప్లాన్ లో భాగంగా బిడ్డను ఎవరో ఎత్తుకుపోయారని కేకలు వేస్తూ కపట నాటకం ఆడడం మొదలుపెట్టారు. దీంతో సీతానగరం ఇన్‌చార్జి ఎస్సై పి. విజయ్‌కుమార్‌కు ఫిర్యాదు చేయగా కోరుకొండ సర్కిల్‌ సీఐ పవన్‌కుమార్‌రెడ్డి కేసు నమోదు చేసి రంగంలోకి దిగారు. శుక్రవారం తెల్లవారుజామున నవజాత శిశువు కిడ్నాప్‌ సంఘటన గ్రామంలో కలకలం రేపింది. చిన్నారి ఆచూకీ కోసం గ్రామస్తులు సైతం గాలింపు చర్యలు చేపట్టారు.

శుక్రవారం సాయంత్రం సుమారు నాలుగు గంటలు దాటిన తరువాత సమీపంలో ఉన్న పాడుబడ్డ బావిలో చిన్నారి చనిపోయి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. శిశువు మృతదేహాన్ని పోస్టుమారామార్టానికి తరలించారు. అయితే ఈ సంఘటనలో లోతైన దర్యాప్తు చేసిన పోలీసులు కీలక అంశాలను సేకరించారు. ఆడశిశువును ఆమె తల్లి సృజన, అమ్మమ్మ మహాలక్ష్మి, ముత్తమ్మ కనకరత్నం హత్యచేసినట్టుగా గుర్తించి వారిని అరెస్టు చేశారు. ఆదివారం కోరుకొండ పోలీసు స్టేషన్‌ వద్ద రాజమహేంద్రవరం అర్బన్‌ జిల్లా ఉత్తర మండలం డీఎస్పీ పి.సత్యనారాయణరావు, సీఐ పవన్‌కుమార్‌రెడ్డి, ఎస్సై విజయ్‌కుమార్‌ వారిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు. డీఎస్పీ సత్యనారాయణరావు మాట్లాడుతూ ఆడబిడ్డ భారమనే భావంతోనే రక్త సంబంధులైన ముగ్గురు మహిళలు కలిపి హత్యకు పాల్పడ్డారన్నారు. ముక్కుపచ్చలారని చిన్నారని మొగ్గలోనే చిదిమేశారని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని డీఎస్పీ తెలిపారు.