Begin typing your search above and press return to search.

వ్యభిచార కూపంలో చిక్కుకున్న తల్లి..! విడిపించిన కొడుకు..!

By:  Tupaki Desk   |   7 March 2021 2:30 PM GMT
వ్యభిచార కూపంలో చిక్కుకున్న తల్లి..! విడిపించిన కొడుకు..!
X
ప్రపంచంలో ఏ కొడుకు అనుభవించలేని ఓ నరకం.. ఏ తల్లికి రాకూడని ఓ కష్టం ఇది. కన్నతల్లి వ్యభిచారం కూపంలో కూరుకుపోయింది. తల్లిని ఎలాగైనా ఆ నరకం నుంచి విడిపించాలనుకున్నాడు కొడుకు. ఇందుకోసం ఎంతో ప్రయత్నించాడు. చివరకు తన తల్లికి విముక్తి కల్పించాడు. ఫైనల్​గా ఆ తల్లి కొడుకు వద్దకు చేరుకున్నది. మాటలకందని ఈ విషాద ఘటన పూణేలో జరిగింది.

కోల్​కతాకు చెందిన ఓ మహిళ అదే పట్టణంలో ఇంటి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. అయితే ఆమెకు ఓ వ్యక్తి పరిచమయ్యాడు. మంచి ఉద్యోగం ఇప్పిస్తానంటూ పూణేకు తీసుకెళ్లి .. బలవంతంగా బుధ్వార్​పేట్​లోని రెడ్​ లైట్​ ఏరియాలోని ఓ వ్యభిచార ముఠాకు అప్పగించాడు. 2019లో ఆమె వ్యభిచార కూపంలో కూరుకుపోయింది. దీంతో ఆమె కుమారుడు తన తల్లి కోసం అనేక ప్రాంతాలు తిరిగాడు. ఆమె ఎక్కడా కనిపించలేదు.

అయితే చివరకు సదరు మహిళకు తెలిసిన వ్యక్తి బ్రోతల్​ హౌస్​కు వెళ్లాడు. దీంతో ఆమె అతడి ఫోన్​ నుంచి తన కుటుంబసభ్యులకు ఫోన్​ చేసి విషయం చెప్పింది. ఆ తర్వాత బ్రోతల్ హౌజ్ కు వెళ్లి వచ్చిన వ్యక్తి కుటుంబసభ్యులకు అడ్రస్​ చెప్పాడు.

దీంతో ఆమె కుమారుడు గౌరవ్​ పూణే సిటీ పోలీసులకు విషయం చెప్పాడు. చివరకు 2020 సెప్టెంబర్ 18న పోలీసులు సదరు బ్రోతల్​ హౌస్​లో తనిఖీలు జరిపి ఆ మహిళలను కాపాడారు. ఈ ఘటనతో సంబంధం ఉన్నవారిపై మొత్తం నాలుగు రేప్​ కేసులు నమోదయ్యాయి.

ఆ తర్వాత గౌరవ్ తల్లిని పూణేలోని గవర్నమెంట్ అబ్జర్వేషన్ హోంలో ఉంచారు. చివరకు అన్ని ప్రాసెస్​లు పూర్తి చేసుకొని మార్చి 2న సదరు మహిళ తన కుమారుడి వద్దకు చేరుకున్నది.

‘ ఇటువంటి కష్టం లోకంలో మరెవరికి రాకూడదు. ఇటువంటి ముఠాలపై పోలీసులు, ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. నా లాంటి అమాయకులు చాలా మంది వ్యభిచార కూపాల్లో కూరుకుపోతున్నారు. కొంతమంది తప్పనిసరై.. మరికొంత మంది అనుకోకుండా ఇటువంటి ముఠాల్లో చేరిపోతున్నారు’ అంటూ ఆ మహిళ కన్నీళ్లు పెట్టుకున్నది.