Begin typing your search above and press return to search.

ఎన్నికల వేళ ‘రేప్’ జరిగితే రియాక్షన్ ఇదీ..

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:39 AM GMT
ఎన్నికల వేళ ‘రేప్’ జరిగితే రియాక్షన్ ఇదీ..
X
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం పేరు విన్న వెంటనే దారుణమైన నేరాలకు.. ఒళ్లు జలదరించే అత్యాచారాలు ఇట్టే గుర్తుకు వస్తాయి. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ ను పలువురు గుండా రాజ్యంగా అభివర్ణిస్తారు. దారుణ నేరాలు తరచూ జరిగే ఆ రాష్ట్రంలో తాజాగా ఒక దారుణం చోటు చేసుకుంది. ఇనుపరాడ్ తో కారును అడ్డుకొని.. కారులో ప్రయాణిస్తున్న తల్లీకూతుళ్లపై సామూహిక అత్యాచారం చేసిన ఉదంతం ఇప్పుడా రాష్ట్రాన్ని ఊపేస్తుంది. అత్యంత అనాగరికంగా వ్యవహరించిన ఈ ఘటనపై యూపీలోని అఖిలేశ్ సర్కారుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి.

గడిచిన నాలుగేళ్ల వ్యవధిలో అఖిలేశ్ సర్కారు ఇలాంటి దారుణాల్నిఎన్నింటినో చూసింది. కానీ.. నెలల వ్యవధిలోనే అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ.. చోటు చేసుకున్న ఈ సామూహిక అత్యాచారంపై తీవ్రంగా రియాక్ట్ అయ్యింది. ఘటన జరిగిన తర్వాత బాధిత కుటుంబ సభ్యులు పోలీసుల అత్యవసర నెంబరుకు ఫోన్ చేసినా స్పందించకపోవటాన్ని ముఖ్యమంత్రి అఖిలేశ్ తీవ్రంగా పరిగణించారు.

ఘటన జరిగిన ప్రాంతంలో భద్రత వ్యవహారాల్ని పర్యవేక్షించే ఎస్ ఎస్ పీ.. నగర ఎస్పీ.. స్థానిక ఏఎస్పీ.. సీఐ.. ఎస్ ఐలు అందరిని సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన కుటుంబం కారులో బులంద్ షహర్ పట్టణ శివారుకు చేరుకున్న సమయంలో ఇనుప రాడ్ ను కారు మీదకు విసరటం.. ఏదో ప్రమాదం జరిగిందని కారు ఆపిన వెంటనే.. ఆగంతుకులు కారు మీద దాడికి పాల్పడి.. కారులోని వారి దగ్గర నుంచి నగదు.. బంగారం తీసుకోవటంతో పాటు.. కారులో ప్రయాణిస్తున్న తల్లీ కూతుళ్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. కూతురు వయసు కేవలం పదమూడేళ్లు. ​

ఈ ఘటనకు బాధ్యులైన వారిని 24 గంటల్లో అదుపులోకి తీసుకోవాలంటూ సీఎం అఖిలేశ్ యాదవ్ ఆదేశాలతో రాష్ట్ర డీజీపీ నేరుగా ఘటనాస్థలానికి చేరుకొని.. అక్కడే ఉండి.. విచారణ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన వైనం చూస్తే.. రాష్ట్ర సర్కారు జరిగిన ఉదంతంపై ఎంత సీరియస్ గా ఉందో ఇట్టే తెలుస్తోంది. పోలీసులు తలుచుకుంటే నిందితులు తప్పించుకోవటం అసాధ్యమన్న మాటకు బలం చేకూరేలా జరిగిన దారుణంతో​ ​సంబంధం ఉందని భావిస్తున్న పదిహేను మంది పాత నేరస్థులను అరెస్ట్ చేశారు. జరిగిన అత్యాచార కాండలో భావరియా సంచార జాతికి చెందిన వారే బాధ్యులుగా భావిస్తున్నారు. మరోవైపు.. అదుపులోకి తీసుకున్న 15 మందికి జరిగిన నేరంతో ఏ మాత్రం సంబంధం లేదని.. ఇదంతా ప్రభుత్వం ఏదో చేశామన్న భావన కలిగించేందుకేనన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మొత్తంగా ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలనం సృష్టించటంతో పాటు.. రాజకీయంగా పెను దుమారాన్నే రేపుతోంది.