Begin typing your search above and press return to search.

ఆడపిల్ల కోసం అంత దారుణానికి పాల్పడింది

By:  Tupaki Desk   |   7 April 2016 4:34 AM GMT
ఆడపిల్ల కోసం అంత దారుణానికి పాల్పడింది
X
అమ్మతనం సైతం అనుమానంగా మారిన పాడు రోజులు వచ్చేశాయి. కనురెప్పేకంటిని కాటేస్తుందన్న ఆలోచన లేని వారికి.. తాజాగా చోటు చేసుకుంటున్న కొన్ని ఉదంతాలు చూస్తే.. ఏమో.. అలా ఎందుకు అనుకోవాలన్నట్లుగా ఉండటం గమనార్హం. కన్నబిడ్డను చంపేసుకునేందుకు బరి తెగిస్తున్న తల్లుల్ని ఈ మధ్యన తరచూ చూస్తున్నాం. కానీ.. తాజాగా బయటకు వచ్చిన ఈ ఉదంతం గురించి వింటే.. ఒళ్లు జలదరించటమే కాదు.. భవిష్యత్తు మరెంత భయానక వాతావరణం ఉంటుందన్న భావన కలగటం ఖాయం.

రెండు రోజుల క్రితం చైన్ స్నాచర్ దొంగల కారణంగా ఒక మహిళ తన పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయిందంటూ టీవీ ఛానల్స్ ఉదరగొట్టేయటం తెలిసిందే. అయితే.. పోలీసుల విచారణలో అదంతా అబద్ధమని తేలటమే కాదు.. తమపై చైన్ స్నాచర్లు దాడి చేశారన్న సదరు మహిళ మాటల్లో నిజం లేదని.. 25 రోజుల పసికందును తానే చంపుకుందన్న విషయం తెలిసిన వారంతా నిర్ఘాంతపోతున్నారు. పాతిక రోజుల బాబును ఇంతకీ ఆ అమ్మ (ఆ మాటను అవమానించటమే అవుతుంది) ఎందుకన్న కారణం చూస్తే.. సదరు మహిళ మానసిక స్థితి మీద సందేహాలు కలగటం ఖాయం.

హైదారాబాద్ లోని రామకృష్ణా పురం ప్రాంతానికి చెందిన శ్రీధర్ రాజు.. పూర్ణిమల దంపతులకు ఒక భాబు ఉన్నాడు. భర్త బ్యాంగిల్స్ షాపు నిర్వహిస్తుంటాడు. వీరికి గతంలో ఒక మగబిడ్డ పుట్టి చనిపోయాడు. తర్వాత మరో మగ పిల్లాడు పుట్టాడు. ప్రస్తుతం ఆ పిల్లాడికి నాలుగేళ్లు. తాజాగా మళ్లీ గర్భవతి అయిన పూర్ణిమ 25 రోజుల క్రితం పండంటి మగబిడ్డను ప్రసవించింది. కానీ.. ఆమెకు ఆడపిల్ల కావాలన్నది బలమైన కోరిక.

మరోవైపు.. ఇద్దరు పిల్లలు కావటంతో.. ఆమెకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించాలని భర్త నిర్ణయించాడు. తనకు కూతుర్ని కనాలన్నకోరిక తీరని నేపథ్యంలో.. తాజాగా పుట్టిన పిల్లాడ్ని అంతం చేస్తే మరో బిడ్డను కనేందుకు అవకాశం ఉంటుందన్న భావనతో పెద్ద నాటకానికి తెర తీసింది. తనపై చైన్ స్నాచర్లు దాడి చేశారని.. ఆ దాడిలో తాను పిల్లాడికి గాయమై చనిపోయాని పేర్కొంది. ఈ వార్తకు మీడియాలో భారీగా ప్రచారం రావటం.. హుటాహుటిన పోలీసులు రంగంలోకి దిగారు. పూర్ణిమ చెప్పిన ఘటనాస్థలానికి చేరుకొని పరిశీలించి.. ఆమె ఇంటికి వెళ్లిన పోలీసులకు ఎక్కడో ఏదో సందేహం కలిగింది.

మరింత లోతుగా విచారించిన పోలీసులు.. అసలు విషయం తెలిసేసరికి కంగు తిన్నారు. తనకు ఆడపిల్ల అంటే ఇష్టమని.. ఇప్పుడు పుట్టిన పిల్లాడి కారణంగా తాను ఆడపిల్లను కనే అవకాశం పోగొట్టుకుంటానన్న ఉద్దేశంతో.. నవ మాసాలు మోసి కన్న బిడ్డను అత్యంత పాశవికంగా గొంతు దగ్గర బ్లేడ్ తో కోసి చంపేసింది. తాను చేసిన వెధవ పనిని కవర్ చేసుకునేందుకు ఆమె అల్లిన నాటకం చూస్తే షాక్ తినాల్సిందే. పిల్లాడికి వాంతులు.. విరోచనాలు అవుతున్నాయని.. ఆసుపత్రికి వెళుతున్నట్లు షాపులో ఉన్న భర్తకు చెప్పి బయలుదేరి.. తాను బజార్లో వెళుతుండగా చైన్ స్నాచర్లు తనపై మత్తు మందు చల్లారని.. స్పృహలోకి వచ్చేసరికి తన బిడ్డ తీవ్ర గాయాలతో ఉన్నాడని.. తన మెడలో తాళిబొట్టు కనిపించటం లేదని చెప్పుకొంది. పూర్ణిమ చెప్పిన ఘటనాస్థలంలో ఎలాంటి ఆనవాళ్లు లేకపోవటం.. ఆమె ఇంట్లో రక్తపు మరకలున్న నేపథ్యంలో.. లోతుగా పరిశోధించిన పోలీసులు.. పూర్ణిమ అసలు నాటకానికి చెక్ చెబుతూ.. నిజం కక్కించారు. కేవలం ఆడపిల్లను కనాలన్న కోరికతో ఇంతకు బరి తెగించిన పూర్ణిమను ఏమందాం..?