Begin typing your search above and press return to search.

పోయే కాలం కాకుంటే దీన్నేమనాలి? కూతుర్ని చంపేసిన తల్లి

By:  Tupaki Desk   |   12 Nov 2019 6:47 AM GMT
పోయే కాలం కాకుంటే దీన్నేమనాలి? కూతుర్ని చంపేసిన తల్లి
X
ప్రేమ మరొకరికి బతుకునివ్వాలి. కానీ.. ఇప్పటి ప్రేమ కన్నవాళ్లను చంపుకునే వరకూ వెళుతోంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో ప్రియుడి మోజులో కన్నతల్లినే మట్టుబెట్టిన కుమార్తె వైనం సంచనలంగా మారితే.. తాజాగా విజయవాడ సమీపంలోని గొల్లపూడిలో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తుందన్న ఉద్దేశంతో కన్నకూతుర్ని చంపించిన కన్నతల్లి వ్యవహారం చూస్తే అమ్మతనానికే మాయని మచ్చను తెచ్చిందని చెప్పాలి.

విన్నంతనే మనసు వికలమయ్యే ఈ ఉదంతంలోకి వెళితే.. విజయవాడ శివారులోని గొల్లపూడిలో అనిల్.. వెంకట రమణలు భార్యభర్తలు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇద్దరు పిల్లల్ని బంధువుల ఇంట్లో ఉంచి చదివిస్తుంటే.. ఎనిమిదేళ్ల కుమార్తె ద్వారకను మాత్రం తమ వద్దే ఉంచుకొని చదివిస్తున్నారు. అనిల్ ప్రభుత్వ మద్యం సరఫరా గోదాంలో పని చేస్తుంటే.. వెంకటరమణ ఒక ప్రైవేటు కాలేజీలో స్వీపర్ గా పని చేస్తూ ఉంటుంది.

వీరి ఇంటిపక్కనే ప్రకాశ్ కుటుంబం అద్దెకు ఉంటున్నారు. అతడి భార్య ఈ మధ్యనే పుట్టింటికి వెళ్లింది. ఆదివారం ద్వారక ప్రకాశ్ అంకుల్ ఇంటికి టీవీ చూసేందుకు వెళ్లింది. అదే సమయంలో.. అక్కడ తన తల్లి ప్రకాశ్ అంకుల్ తో సన్నిహితంగా ఉండటాన్ని నిలదీసింది. తండ్రికి చెబుతానని బెదిరించింది. దీంతో భయపడిన వెంకటరమణ.. ఏదో ఒకటి చేయాలని ప్రియుడికి చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింది.

దీంతో.. ద్వారకను చంపేసి.. బ్యాగులో కట్టేసి ఇంట్లోనే ఒక పక్కన దాచాడు. డెడ్ బాడీని ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్లేందుకు అవకాశం లేకపోవటంతో అలానే ఉంచేశాడు. భర్త వచ్చే వరకూ వెయిట్ చేసిన వెంకటరమణ.. కుమార్తె బయటకు వెళ్లి మళ్లీ రాలేదని చెప్పింది. ఆడుకోవటానికి వెళ్లి ఉంటుందని భర్త చెప్పటంతో ఏమీ తెలీనట్లే నటించింది. రాత్రి అవుతున్నా రాకపోవటంతో.. వెతకటం మొదలెట్టారు. గ్రామస్తులంతా కలిసి ద్వారకను వెతికే పనిలో పడ్డారు.

పోలీసులకు ఈ విషయం వెళ్లటంతో వారు గ్రామంలోని ప్రతి ఇంటిని తనిఖీ చేశారు. ద్వారక కోసం వెతుకుతున్న ప్రకాశ్ ఇంటిని మాత్రం చెక్ చేయలేదు. తన చేతులతో తాను చంపేసి.. ఏమీ తెలియని వాడిగా ద్వారక కోసం వెతుకుతూ స్థానికుల్ని నమ్మించాడు. అయితే.. ప్రకాశ్ భార్య పుట్టింటి నుంచి ఇంటికి వచ్చి.. ఆమె కూడా వెతకటం మొదలెట్టింది. ఎంత వెతికినా ప్రయోజనం కలుగలేదు. ఇంటికి వచ్చిన ఆమె.. బీరువా పక్కనున్న మూటను చూసి షాక్ తింది. తాము వెతుకుతున్న ద్వారక డెడ్ బాడీ.. మూట రూపంలో ఉండటాన్ని స్థానికులకు చెప్పేసింది.

దీంతో.. రంగప్రవేశం చేసిన పోలీసులు ప్రకాశ్ ను అదుపులోకి తీసుకొని విచారించగా.. జరిగిన విషయాన్ని చెప్పేశారు. దీంతో.. వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. ప్రియుడి మోజులో కన్న పేగు బంధాన్ని కాటికి పంపిన ఈ వైనం స్థానికుల్లో షాకింగ్ గా మారింది. అమ్మతానికి మచ్చ తెచ్చిన వెంకటరమణ లాంటి వారిని కఠినంగా శిక్షించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.