Begin typing your search above and press return to search.

మోత్కుపల్లికి మళ్లీ నిరాశ

By:  Tupaki Desk   |   1 Sep 2016 9:04 AM GMT
మోత్కుపల్లికి మళ్లీ నిరాశ
X
తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు ఆశలపై మరోసారి నీళ్లు పడ్డాయి. గవర్నరు గిరీ కోసం చాలా కాలంగా ఆశలు పెట్టుకున్న ఆయనకు చంద్రబాబే స్వయంగా హామీ ఇచ్చినట్లు మోత్కుపల్లి ఎప్పటినుంచో చెబుతున్నారు. అయితే, మోత్కుపల్లి ఎంతగా ఆశ పడుతున్నారో ఆ పదవి అంతగా దూరమవుతోంది. మెత్కుపల్లి పలుమార్లు చంద్రబాబు ఎదుట బహిరంగంగానే తన కోరికను వెలిబుచ్చారు. అలసిపోయానని - ఆర్థికంగా చితికిపోయానని పార్టీ కోసం చేసిన ఉద్యమాల్లో పోలీసులు బూటు కాళ్లతో తన్నారని వాటి నొప్పి ఇప్పటికీ ఉందని కాబట్టి తనను ఆదుకోవాలని ఆమధ్య మహానాడు వేదిక మీద కూడా ఆయన చంద్రబాబును వేడుకున్నారు. అయితే... అదే సమయంలో మహానాడు వేదిక మీద ‘‘గవర్నర్‌ మోత్కుపల్లి” అని చంద్రబాబు పిలిచే సరికి అప్పటి నుంచి మోత్కుపల్లి ఆశలకు మరింతగా రెక్కొలొచ్చాయి. మహానాడు వేదిక మీద చంద్రబాబు అలా అనడంతో మోత్కుపల్లికి గవర్నరు గిరీ ఖాయమని అంతా అనుకున్నారు. కానీ కేంద్రం కొత్త గవర్నర్లను ఇస్తున్న ప్రతిసారి మోత్కుపల్లికి మొండిచేయే ఎదురవుతోంది.

ఆ మధ్య పంజాబ్ - మణిపూర్ - అసోం - అండమాన్ నికోబార్‌ లకు కొత్త గవర్నర్లను నియమించారు. అప్పుడు మోత్కుపల్లి తనకు చాన్సు గారంటీ అనుకున్నారు. కానీ రాలేదు. అప్పుడు తీవ్ర ఆవేదనకు లోనైన మోత్కుపల్లికి చంద్రబాబు తమిళనాడును చూపించి అప్పటికి సముదాయించింది. రోశయ్య స్థానంలో గవర్నర్‌గా వెళ్లే అవకాశం ఉందని చెప్పారు. కానీ... ఇప్పుడు తమిళనాడు గవర్నర్‌ గా రోశయ్య పదవీ కాలం పూర్తయింది. కానీ... కేంద్రం మాత్రం మహారాష్ట్ర గవర్నరు విద్యాసాగర్‌ రావుకు తమిళనాడు అదనపు బాధ్యతలు అప్పగించింది.

తాజా పరిణామాలతో మోత్కుపల్లి తీవ్ర ఆవేదనకు లోనయినట్లు చెబుతున్నారు. ఇక తనకు గవర్నర్‌ పదవి రాదని... చంద్రబాబు మాటలు నమ్మి మోసపోయానని ఆయన తన సన్నిహితుల వద్ద అన్నట్లు తెలుస్తోంది. అయితే మోత్కుపల్లిని మాటలతో మెత్తబెట్టేయొచ్చన్నది బాగా తెలిసిన టీడీపీ నేతలు మరోసారి ఆయన్ను కూల్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాసాగర్‌ రావును తమిళనాడుకు ఇన్‌ చార్జిగా మాత్రమే నియమించారని... పూర్తి స్థాయి పదవి మీకే దక్కొచ్చని మోత్కుపల్లికి చెబుతున్నారట.