Begin typing your search above and press return to search.

చంద్రబాబుపై మోత్కుపల్లి, టీజీల ఒత్తిడి

By:  Tupaki Desk   |   25 May 2016 10:25 AM GMT
చంద్రబాబుపై మోత్కుపల్లి, టీజీల ఒత్తిడి
X
ఏపీలో టీడీపీ రాజ్య సభ సీట్ల కేటాయింపుపై చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నట్లు సమాచారం. పార్టీలోని కొందరు నేతల ఒత్తిడి పెరగడంతో ఏం చేయాలనే విషయంలో ఇంకా ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారట. ముఖ్యంగా ఖాయంగా దక్కే మూడు స్థానాల్లో ఒకటి తెలంగాణకు కేటాయించాలంటూ.. అది తనకే ఇవ్వాలంటూ తెలంగాణ టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు బాబు వెంట పడుతున్నారు. ఈ రోజు ఉదయాన్నే ఆయన విజయవాడలో ప్రత్యక్షమయ్యారు. హైదరాబాదు నుంచి విజయవాడ చేరుకున్న మోత్కుపల్లి నేరుగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లారు. తనతో భేటీకి హైదరాబాదు నుంచి వచ్చిన మోత్కుపల్లిని సాదరంగా ఆహ్వానించిన చంద్రబాబు విషయమేంటని ఆరా తీశారు. తనను ఈసారైనా రాజ్యసభకు పంపాలని ఈ సందర్భంగా తాను వచ్చిన అసలు విషయాన్ని మోత్కుపల్లి బయటపెట్టారు.

ఇప్పటికే తెలంగాణలో పార్టీ ఎమ్మెల్యేలంతా టీఆర్ ఎస్ లోకి చేరిపోవడంతో అక్కడ టీడీపీకి రాజ్యసభ సీటు దక్కడం అసాధ్యం అందువల్ల ఆయన ఏపీ నుంచి వెళ్లాలనుకుంటున్నారు. దీంతో ఏపీలో ఖాయంగా దక్కే మూడు సీట్లలోనే తనకు ఓ సీటును కేటాయించాలని మోత్కుపల్లి అభ్యర్థించారు. మోత్కుపల్లి ప్రతిపాదనతో కొంతసేపు ఆలోచించిన చంద్రబాబు... అక్కడికక్కడే స్పష్టమైన హామీ ఇవ్వలేక ఆలోచిస్తానని చెప్పారు. అయితే మోత్కుపల్లి మాత్రం రాజ్యసభ సీటిచ్చే విషయంలో చంద్రబాబు సానుకూలంగా స్పందించారని చెప్పారు.

మరోవైపు మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ అయితే చంద్రబాబు ఎక్కడికి వెళ్తే అక్కడకు వెళ్లి ఆయన్ను కలుస్తున్నారు. ఆ మధ్య బాబు ఢిల్లీ వెళ్లగా అక్కడ టీజీ తన అనుచరులు, కర్నూలు టీడీపీ నేతలను వెంటేసుకుని వెళ్లి ఏపీ భవన్ లో చంద్రబాబును కలిశారు. కర్నూలు జిల్లాకు ఒక సీటు ఇవ్వాలని.. అది తనకే ఇవ్వాలని కోరారు. దాంతో చంద్రబాబు.. జిల్లాల వారీగా రాజ్యసభ సీట్లిచ్చే సంప్రదాయం ఎక్కడా లేదు కదా అని టీజీని ప్రశ్నించారు. అక్కడితో అయిపోయిందని చంద్రబాబు అనుకున్నా టీజీ మాత్రం పట్టు వదలకుండా మరో రెండు సార్లు చంద్రబాబును మందీమార్బలంలో వచ్చి కలిసి ఒత్తిడి చేశారట. దీంతో చంద్రబాబు ఏం చేయాలో.. ఎవరికి ఇవ్వాలో నిర్ణయానికి రాలేక తలపట్టుకుంటున్నారు.